ఒక వేసవి పొద్దు ఉరకలేస్తున్న సెలయేటి ఒడ్డున
కొబ్బరాకుల బూరాలు ఊదుకుంటూ ఒక కాలక్షేపరాయుణ్ణి చూసేను
అతని ప్రపంచం అంతా హాయిగా ఉల్లాసంగా ఉన్నట్టుంది
ప్రతి వంపులోనూ అతని చేష్టల్లో కొంటెతనం కనిపిస్తోంది.
.
కలలప్రపంచంలో తేలియాడుతున్న ఒక చిత్రకారుణ్ణి చూసేను
అతని దేదీప్యమానమైన సృష్టిలోంచి హరివిల్లు ఉదయిస్తోంది
కామరూపిలా పలు అవతారాలు ధరిస్తున్న ఆలోచనాస్రవంతిపై
దాని సమ్మోహకరమైన పట్టకపు రంగులను ప్రసరిస్తూ .
.
నేనొక ఉచ్చును చూశాను… మరోలోకాన్ని కప్పుతూ…
దానిమీద వేట పక్షులు ఆచితూచి అడుగులేస్తున్నాయి
చుక్కలవంక నిక్కిచూసే తమరెక్కలని కూడదీసుకుని
ఆకలి తీర్చగల వ్యామోహం ఎదురుగా ఊరిస్తుంటే.
.
నేనొక పాపిని చూశాను… కాలం ఖజానానుండి
తన మృత్యు భత్యాన్ని తీసుకుందికి తెగ శ్రమిస్తూ
నేనో నావికుణ్ణి చూశాను… అతనికి సముద్రమే సర్వస్వం…
కోరికా, కుంపటీ, ప్రేయసీ, పెళ్ళిబాజాలూను.
.
తన బిడ్డలో జీవిస్తున్న తల్లిని చూశాను
తోటి మానవులతో జీవిస్తున్న ఋషిపుంగవుని చూశాను
నాకళ్ళముందే క్రమశిక్షణతో నడిచిన దండు చూశాను
గంభీర హృదయులైన మేధావుల్ని చూశాను…
.
నేనన్నాను “దగ్గరగా ఉంటూ మనకు నచ్చిన భాషలు మాటాడుకుని
ఎవరికివారు తమ కక్ష్యల్లో జీవితాలు వెళ్ళదీసే మనుషులకంటే
ఖగోళంలో అనంత దూరాల్లోకి విసిరివేయబడినట్టుండే
ఆ నక్షత్రాలు ఎంతమాత్రమూ దూరం కావు” అని.
.
ప్రేమ అందరిలోనూ జ్వలిస్తుంటుంది
పొరపాటునైనా చీకటిలో వెలుగులేక తపించే
శాపగ్రస్త జీవితం ఉంటుందేమో నని; అయినా,
సృష్టినంతటినీ వెలిగించేది ఆ ఒక్క సూర్యుడే కదా!
.
మార్తా గిల్బర్ట్ డికిన్సన్ బియాంచీ
(November 30, 1866 – 1943)
అమెరికను
ఈ కవితలో సౌందర్యం ఒక గొప్ప చిత్రకారుడు కాన్వాసుమీద అనేక గీతలు గీసి వాటిని చివరికి ఒక అందమైన ఆకారంగా మలిచినట్టు, కొన్ని జీవితాలని వర్ణించి, చివరికి అవి ఒకదానికొకటి పొందకుండా బతకడాన్ని, ఖగోళదూరాల్లో విసిరివేయబడ్డట్టు కనిపించే నక్షత్రాలతో సాదృశం తీసుకొస్తుంది కవయిత్రి. ఎంతదగ్గరగా ఉన్నా ప్రేమ మనుషుల్ని వెలిగించలేనపుడు, సామీప్యతకీ దూరానికీ ఇంక వ్యత్యాసం ఏముంటుంది? దాని విలువ ఏమిటి? అని చాలా చక్కగా ప్రశ్నిస్తూ, సమస్తజీవులకూ వెలుగునిచ్చే సూర్యుడితో పోలుస్తుంది కవయిత్రి ప్రేమని.
.

Image Courtesy: http://www.geni.com/people/Martha-Mattie-Bianchi
స్పందించండి