అనువాదలహరి

ఓ నా డేనియల్… అజ్ఞాత 8వశతాబ్దపు ఐరిష్ కవి

నిన్న రాత్రే పొద్దుపోయేక కుక్కపిల్ల నీ గురించి అడిగింది

అదుగో చిత్తడినేల్లో ‘కసవుగువ్వ’ నీగురించే తలుచుకుంటోంది

ఆ చిట్టడివిలో ఒంటరిగా అరిచే పిట్టవి నువ్వేననుకుంటాను

నన్ను కలిసేదాకా నీకు తోడు దొరకకుండు గాక!  

నాకు మాటిచ్చావు; నాతో అబద్ధం చెప్పావు:

గొర్రెలు మందకట్టేవేళకి నా ప్రక్కన ఉంటానని;

నేను నీకోసం ఈలకొట్టి, మూడు వందసార్లు అరిచేను,

నాకు ఆఖరికి దొరికిందల్లా అరుస్తున్న ఈ గొర్రెపిల్ల.

నీకు అశక్యం అని తెలిసీ నాకు మాటిచ్చేవు:

వెండి తెరచాపక్రింద ఓడనిండా బంగారం

పన్నెండు పట్టణాల్లో తిరుగులేని వ్యాపారం

సముద్రపొడ్డున ఒక రాజభవనం.

అసలు ప్రపంచంలో దొరకనివస్తువులు నాకు మాటిచ్చావు:

చేపపొలుసులతో చేసిన చేతితొడుగులిస్తాననీ

పిట్టతోలుతో చేసిన చెప్పుల జత ఇస్తాననీ

ఐర్లండులోనే అత్యంత ఖరీదైన సిల్కు బట్టలిస్తాననీ. 

నాలుగు పక్కలా చూస్తున్నప్పుడు, బంగారు జరీ కుచ్చుల

జుత్తు గల నా వాడు కనిపించనపుడు

నేను ఒక్కర్తినీ ‘ ఏకాంత కూప ‘సమీపంలో కూచుని

వ్యథలన్నీ నాలో నేనే కలబోసుకుంటుంటాను. 

ఆ ఆదివారం నాడే నేను నా ప్రేమని నీకర్పించింది,

అదే, ఈస్టరు ముందువచ్చే చివరి ఆదివారం…

మాకాళ్లమీద కూచుని నీకళ్ళలో ప్రేమను చదువుతూ

నా రెండు కళ్ళూ నా ప్రేమని శాశ్వతంగా సమర్పించాయి.

మా అమ్మ చెప్పింది మరుసటిరోజు : ఆ అబ్బాయితో మాటాడకు,

ఇవాళా, రేపూ, ఆదివారం కాదు … ఇక శాశ్వతంగా.

నాకు ఆమె చెప్పడానికి ఎంచుకున్న వేళ సరైంది కాదు…

ఎందుకంటే, అది ఇల్లుదోపిడీ అయేక తలుపులెయ్యడంలాంటిది.

నా మనసునిండా ఎంత చీకటి కమ్ముకుందంటే అడవి నేరేడంత నల్లనిది;

లేదా, కమ్మరివాని కొలిమిలో రాక్షసిబొగ్గంత నల్లనిది;

పాలరాతి చావడిమీద విడిచిన చెప్పులజత అడుగంత నల్లనిది.

ఆ చీకటిని నా బతుకునిండా నింపినది నువ్వే.

నువ్వు నానుండి పగలు దొంగిలించావు, రాత్రి దొంగిలించావు,

నా గతాన్నీ దొంగిలించావు, నా భవిష్యత్తునీ దొంగిలించావు

నా చల్లని ఆశలనీ, వేడి నిట్టూర్పులనీ దొంగిలించావు

నా భయం దేముడిమీద నా నమ్మకాన్నీదొంగిలించేవేమోనని.  

.

అజ్ఞాత ఐరిష్ కవి.

మన జానపద సాహిత్యంలో లాగే ఐరిష్ జానపద సాహిత్యంలో కూడా అపురూపమైన ప్రేమ కావ్యాలున్నాయి.  ఈ కవితని చాలా రకాలుగా ఇంగ్లీషులో వ్యాఖ్యానించారు గాని, నా మట్టుకి ఇది ఎంతో సున్నితంగా వ్యక్తీకరించిన ప్రేమ భావన. ఒక ముగ్ధ తన ప్రేమని ప్రియుడికి ధారపోస్తుంది. తల్లి హెచ్చరిక ఆలస్యం అయిపోతుంది అప్పటికే. ఆ రోజుల్లో అలవాటు ప్రకారం యువకుడు దేశం మీదకి వెళ్తాడు డబ్బు సంపాదించడానికి. ఆమెని సుఖపడతానని ఎన్నో బాసలు చేస్తాడు… అవి అసంభవమని తనకి తెలిసినా, ప్రేమ ఇచ్చే లావణ్య భావనల వల్ల ఆమె నిజమనే భ్రమలో ఉండకపోయినా, నిజమయితే బాగుండునని ఆశిస్తుంది.  ఏదీ, ఇదిగో చిటికెలో వచ్చెయ్యనూఅని మాట ఇచ్చిన వ్యక్తి, ఏడాది తిరిగినా కబురు లేదు. ఎన్ని దిక్కుల్ని పలకరించినా ఆమె గొంతు ప్రతిధ్వనే తప్ప సమాధానం లేదు. ఇక్కడ “Bleating Lamb” అని ఇచ్చిన ప్రతీక అతనివల్ల కలిగిన సంతానం అవొచ్చు.  

ఈ కవితలో సౌందర్యమంతా చివరి నాలుగు చరణాల్లో ఉంది: నా నిద్రా, మెలకువా, ఆశలూ, విచారాలూ భవిష్యత్తూ అన్నీ నువ్వే అంటూనే, ఆమె, అతను తిరిగిరాకపోతే, దేవునిమీద విశ్వాసం కూడా అతనితోనే అంతరించిపోతుందేమోనని చెబుతోంది. ప్రేమ ఉన్న చోట భయం, భయంతో పాటే అపనమ్మకాలూ, ముఖ్యంగా దేవునిమీద విశ్వాసం సన్నగిలడం మానవ సహజమైన బలహీనతలు. వాటిని చాలా చక్కగా చెబుతుందీ కవిత.

.

Donal Og

It is late last night the dog was speaking of you;
the snipe was speaking of you in her deep marsh.
It is you are the lonely bird through the woods;
and that you may be without a mate until you find me.

You promised me, and you said a lie to me,
that you would be before me where the sheep are flocked;
I gave a whistle and three hundred cries to you,
and I found nothing there but a bleating lamb.

You promised me a thing that was hard for you,
a ship of gold under a silver mast;
twelve towns with a market in all of them,
and a fine white court by the side of the sea.

You promised me a thing that is not possible,
that you would give me gloves of the skin of a fish;
that you would give me shoes of the skin of a bird;
and a suit of the dearest silk in Ireland.

When I go by myself to the Well of Loneliness,
I sit down and I go through my trouble;
when I see the world and do not see my boy,
he that has an amber shade in his hair.

It was on that Sunday I gave my love to you;
the Sunday that is last before Easter Sunday.
And myself on my knees reading the Passion;
and my two eyes giving love to you for ever.

My mother said to me not to be talking with you today,
or tomorrow, or on the Sunday;
it was a bad time she took for telling me that;
it was shutting the door after the house was robbed.

My heart is as black as the blackness of the sloe,
or as the black coal that is on the smith’s forge;
or as the sole of a shoe left in white halls;
it was you that put that darkness over my life.

You have taken the east from me; you have taken the west from me;
you have taken what is before me and what is behind me;
you have taken the moon, you have taken the sun from me;
and my fear is great that you have taken God from me!

.

Anonymous

This is an anonymous 8th Century Irish ballad; translated by Lady Augusta Gregory;  published in The School Bag, edited by Seamus Heaney and Ted Hughes, 1997.

(Donal Og: ‘Young Daniel’)

Poem Courtesy: Wonderingminstrels.blogspot.in

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: