అచ్చమైన ప్రేమ… జిష్వావా షింబోర్స్కా, పోలిష్ కవయిత్రి
అచ్చమైన ప్రేమ.
ఇది సహజమేనా? అది నిజమేనా? సాధ్యమైనదేనా?
వాళ్ళ లోకంలో వాళ్ళుండే ఇద్దరు ప్రేమికులవల్ల
ఈ ప్రపంచానికి ఏమిటి ఒరుగుతుంది?
.
ఏ కారణమూ లేకుండా, ఒకే తాటిమీద నిలబెట్టి
లక్షలమందిలోంచి యాదృచ్ఛికంగా తీసి
ఇది ఇలాగే జరగవలసి ఉందనడం, దేనికి ప్రతిఫలమట?
దేనికీ కాదు.
కాంతి ఎక్కడినుండో అవరోహిస్తుంది.
మరెవ్వరిమీదా కాకుండా ఈ ఇద్దరిమీదే ఎందుకు?
ఇది న్యాయాన్ని అపహసించదూ? అపహసిస్తుంది.
మనం ఎంతో శ్రమపడినెలకొల్పుకుంటున్న సిద్ధాంతాల్ని భంగపరచి,
అందులోని నైతికతని అగాధాల్లోకి గిరవాటెయ్యదూ?
వేస్తుంది. రెండు రకాలుగానూ.
.
ఆనందంగా ఉన్న జంటల్ని గమనించండి.
కనీసం దాన్ని దాచేప్రయత్నం చెయ్యలేరా,
వాళ్ళ మిత్రులకోసం లేని వ్యాకులత కొంత నటించలేరా?
వాళ్ళ నవ్వుల్ని వినండి- అది ఒక అవమానం.
వాళ్ళ భాష వినండి- అది మోసపుచ్చేంత స్పష్టం.
వాళ్ళ వేడుకలూ, వాళ్ల సంస్కారాలూ,
నియమబద్ధంగా ఆచరించే నిత్యవిధులూ చూస్తే
అది నిశ్చయంగా మానవజాతి కళ్ళుగప్పి పన్నుతున్న కుట్రే.
.
ప్రజలుగనుక వాళ్ళని అనుకరించడం ప్రారంభిస్తే
విషయం ఎంతదూరం వెళుతుందో ఊహించడం కష్టం.
కవిత్వమూ మతమూ దేనిమీద ఆధారపడదలుచుకున్నాయి?
ఏది గుర్తుంచుకోవాలి? ఏది వదిలించుకోవాలి?
ఎవరికి హద్దుల్లో ప్రవర్తించాలని ఉంటుంది?
.
అచ్చమైన ప్రేమ… నిజంగా అదంత అవసరమా?
వివేకమూ, లోకజ్ఞానమూ దాని ఊసు ఎత్తొద్దని చెబుతాయి
గొప్పవాళ్ల జీవితాలగూర్చిన పుకార్లలా.
దాని సహాయం లేకుండానే ఎంచదగ్గ పిల్లలు పుడతారు.
లక్షల ఏళ్ళకైనా అది ఈ భూమ్మీద నిలదొక్కుకోలేదు
అదెప్పుడో… చాలా అరుదుగా లభిస్తుంది.
.
అచ్చమైన ప్రేమ లభించని వ్యక్తుల్ని
అటువంటి ప్రేమే లేదని చెప్పనీయండి.
ఆ నమ్మకమే వాళ్ల జీవితాల్ని
సుఖతరం చేసి ప్రశాంతంగా మరణించనిస్తుంది.
.
జిష్వావా షింబోర్స్కా
(2 July 1923 – 1 February 2012)
పోలిష్ కవయిత్రి
.
- Wisława Szymborska (b. July 2, 1923 in Bnin, Poland), Polish poet, and Nobel Prize winner.She lives in Cracow, Poland (Photo credit: Wikipedia)