ఔత్సాహిక కవి… రాబర్ట్ బిలియం సెర్విస్, బ్రిటిషు కవి.
అదిగో ఆ బీరువా పై అరలో
సన్నటి పుస్తకాలు దొంతి కనిపిస్తున్నదా?
వాటిని ఏ పాఠకుడూ తొంగి చూడడు, వెదకడు
ఎందుకంటే…. అవి నేను రాసినవి కాబట్టి.
అవి చక్కగా నేవీ బ్లూరంగులో ముచ్చివేసి ఉన్నై
కాని ఎవ్వడూ వాటిని పట్టించుకోడు;
అవి అందంగా ముద్రించబడ్డాయి
అయినా ఎవడూ ఎప్పుడూ చదవడు.
నా ఆశల రూపం, ఆ పుస్తకాలు!
వాటిమీద ఎంత సమయం, డబ్బూ వెచ్చించేనని!
ఇప్పుడు అదంతా వృధాశ్రమ అనిపిస్తుంది,
అందులో ఏ ఒక్కటీ అమ్మలేకపోయాను;
ఒక్క కాపీ కూడా ఎవరికీ ఇవ్వలేకపోయాను
ఇవ్వబోతే నా మిత్రులందరూ భయంతో వెనకాడుతూ,
నావంక చూసి ఇలా అన్నారు: “ఎంతపని చేశావురా,
ఆ ఇంకు మరో పనికొచ్చే పనికి ఉపయోగించేదికదా!” అని.
ఆలా బీరువా మీద వాటివైపు చూస్తున్నప్పుడల్లా
బాధతో నా కళ్ళు చెమర్చినా
అవి నాకెంత సంతృప్తినిచ్చాయో తలుచుకుని
ఒక వేడి నిట్టూర్పు విడవకుండా ఉండలేను…
ఆ కవితలు అనుకున్నట్టు రావడానికి
సరైన మాటకోసం తపించగా తపించగా
చివరకి అది తళుక్కున నా మస్తిష్కంలో
మెరిసినపుడు ఎంత పరవశం కలుగుతుందని!
.
బహుశా ఆ తన్మయత్వమే నాకు దక్కిన ప్రతిఫలం
ఇతరత్రా లభించే చవకబారు కీర్తిప్రతిష్టలకంటే;
అందుకనే నే పడ్డకష్టాన్ని మరిచిపోతాను,
అసంతృప్తినీ మనసులోంచి తుడిచేస్తాను.
ఓ నా ఉజ్జ్వలమైన కోడెవయసు వ్రాతలారా!
నేనేమీ గుండె పగిలేలా దుఃఖించను,
ఎందుకంటే, నా నిష్కపటమైన ప్రేమ
సత్యాన్వేషణ అక్కడ మీలో సజీవంగా ఉన్నాయి
.
రాబర్ట్ విలియం సెర్విస్
(January 16, 1874 – September 11, 1958)
బ్రిటిషు కవి.
.
