అనువాదలహరి

శ్రోతలు… వాల్టర్ డి లా మేర్, ఆంగ్ల కవి

…’ఎవరదీ లోపల?’ అని అడిగేడు బాటసారి

వెన్నెల జాల్వారుతున్న తలుపును తడుతూ.

ఒత్తుగా పచ్చిక మొలిచిన అడవినేలమీద

మౌనంగా  గడ్డి కొరుకుతోంది అతని గుర్రం:

ఇంటి కప్పుమీదనుండి రివ్వున ఎగురుకుంటూ

బాటసారి తలమీదనుండి ఒక పిట్ట దూసుకు పోయింది.

అతను తలుపుమీద రెండోసారి గట్టిగా తట్టేడు;

‘ఇంట్లో ఎవరైనా ఉన్నారా?’ అని అడిగేడు మరోసారి.

కాని ఎవ్వరూ బాతసారి వైపు కదల్లేదు;

లతలతో అల్లుకున్న ద్వారబంధం నుండి

ఒక్క తలకాయా అతనివైపు వంగి వాలలేదు, నిశ్చేష్టుడై

ఉన్నచోటే నిల్చున్న అతని అలసిన కనుల్లోకి తొంగిచూడలేదు.

అయితే,ఆ ఒంటరి ఇంట్లో నివసిస్తూ ఆ వెన్నెల ప్రశాంతతలో

మానవలోకం నుండి వస్తున్న ఆ శబ్దాన్ని వింటూ,

మౌనంగా ఉండిపోయిన అస్పష్ట శ్రోతలు చాలా మంది ఉన్నారు;

ఖాళీ చావడిలోంచి పోతూ   ఆ చీకటి మెట్లమీద పలచగాపడుతున్న

వెన్నెల చుట్టూ గుమిగూడేరు,  ఆ ఒంటరి యాత్రికుడి పిలుపులకి

కదిలి చెల్లాచెదరైన గాలిలోని శబ్దాలు వింటూ;

అతని ప్రశ్నకి సమాధానంగా నిశ్శబ్దమూ …

ఆకులమధ్య మధ్యచిక్కుకున్న నక్షత్రాలు పొదిగిన ఆకాసం క్రింద

ఆ చీకటి నేలమీది గుర్రం కాలితో గీరడమూ,

అతనికి మనసుకి ఏదో వింతగా అనిపించింది;

ఎందుకంటే, అతను అకస్మాత్తుగా తలుపుమీద

ముందుకంటే దబదబా బాది, తలెత్తి:

‘అలా అయితే,ఇచ్చిన మాట ప్రకారం నేను వచ్చాననీ

ఎవరూ బదులు పలకలేదనీ చెప్పండి,’ అన్నాడు.

అతను చెప్పిన ప్రతిమాటా ఆ ఇంటి నిశ్శబ్దపు

నీలినీడల్లోంచి ప్రతిధ్వనిస్తున్నా శ్రోతల్లో ఏ ఒక్కరూ

కించిత్తయినా కదిలే ప్రయత్నం చెయ్యలేదు;

అన్నట్టు, రికాబు మీద అతని కాలి చప్పుడూ

రాతినేలమీద గుర్రపుడెక్కల చప్పుడూ వినడంతోపాటు

పరిగెడుతున్న డెక్కలు దూరమవగానే, నిశ్శబ్దం తిరిగి

ఎలా నెమ్మదిగా వెనక్కి ఎగసిపడిందో గమనిస్తూనే ఉన్నారు….

.

వాల్టర్ డి లా మేర్

(25 April 1873 – 22 June 1956)

ఇంగ్లీషు కవీ, నాటకకర్తా, కథా రచయితా అయిన వాల్టర్ డి లా మేర్  తన ప్రఖ్యాతినందిన ఉపన్యాసం “Rupert Brooke and his intellectual imagination” లో ప్రతిపాదించిన మనుషులలోని రెండురకాల ఆలోచనా స్రవంతుల ద్వారా ఎక్కువగా నేడు గుర్తింపబడుతున్నాడేమో! బాల్యపుటూహలు(Childlike) సత్యమే సౌందర్యమని భావిస్తాయనీ, అవి సహజాతమూ (intuitive), ఆగమవాదములూ (inductive) అయితే, కౌమారపుటాలోచనలు(Boylike) సౌందర్యమే సత్యమని భావిస్తాయనీ, అవి తార్కికమూ, నిగమితములూ (Deductive) అని ప్రతిపాదించేడు. అంతేగాక, యౌవనారంభవేళలో, ఈ బాల్యపుటాలోచనలలోకి బాహ్యప్రపంచపు నిరంతరచొరబాటు వలన, అవి నత్తగుల్ల లోనికి ముడుచుకుపోయినట్టు, లోనికి ముడుచుకుపోవడముగాని, లేదా, శక్తిమంతముగా ఎదిగి బాహ్యప్రపంచాన్ని ఎదుర్కోడానికి తగిన సన్నద్ధత సమకూర్చుకోవడంగాని చేస్తాయని ప్రతిపాదించేడు.

“Memoirs of the Midget” అన్న అతని నవలా, 100 కు పైగా రాసిన అతని దయ్యాల కథలలో “Seaton’s Aunt”, “Out of the Deep” అన్న కథలూ అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. “Songs of Childhood” తో పాటు అతను 5 కవితా సంకలనాలూ, 10కి పైగా కథా సంకలనాలూ, 5 నవలలూ వెలువరించాడు.
.

Walter de la Mare

PNG Courtesy: http://gutenberg.ca/ebooks/rothenstein-twelveportraits/rothenstein-twelveportraits-00-h-dir/rothenstein-twelveportraits-00-h.html

.
The Listeners
.
Is there anybody there?’ said the Traveller,
Knocking on the moonlit door;
And his horse in the silence champed the grasses
Of the forest’s ferny floor:
And a bird flew up out of the turret,
Above the Traveller’s head
And he smote upon the door again a second time;
‘Is there anybody there?’ he said.
But no one descended to the Traveller;
No head from the leaf-fringed sill
Leaned over and looked into his grey eyes,
Where he stood perplexed and still.
But only a host of phantom listeners
That dwelt in the lone house then
Stood listening in the quiet of the moonlight
To that voice from the world of men:
Stood thronging the faint moonbeams on the dark stair,
That goes down to the empty hall,
Hearkening in an air stirred and shaken
By the lonely Traveller’s call.
And he felt in his heart their strangeness,
Their stillness answering his cry,
While his horse moved, cropping the dark turf,
‘Neath the starred and leafy sky;
For he suddenly smote on the door, even
Louder, and lifted his head:-
‘Tell them I came, and no one answered,
That I kept my word,’ he said.
Never the least stir made the listeners,
Though every word he spake
Fell echoing through the shadowiness of the still house
From the one man left awake:
Ay, they heard his foot upon the stirrup,
And the sound of iron on stone,
And how the silence surged softly backward,
When the plunging hoofs were gone.

Walter de la Mare

25 April 1873 – 22 June 1956

 English poet, short story writer and novelist.

%d bloggers like this: