బుర్ఖా … అఫియా నూర్, మలయాళం, ఇండియా
.
నేను మాటాడలేను,
ఎందుకంటే,
ఈ బలమైన దారాల అల్లిక
నా పెదాలు దగ్గరగా
గట్టిగా కుట్టేసింది.
వినడానికి నాకు చెవులు గాని
శ్వాశించడానికి ముక్కురంధ్రాలుగాని లేవు;
ఈ నల్లదారాల జాలీ వెనక
నా చూపుకూడా నిరోధింపబడుతుంది.
నామీద దాడిచేసే వాడు
ఎదురుగా ఉన్నా
వాడిని గుర్తుపట్టకుండా ఉండడానికి
ఏదో ఏర్పాటు చేసినట్టు,
చుట్టూ అంతా చీకటి…
శరీరం పాపపంకిలమని నిరసించినపుడే
నా అస్తిత్వ చైతన్యం మీద
మొట్టమొదటిసారి,
నల్లగా ఇది
తొడగబడింది.
కామకేళికి నేనొక ఆటబొమ్మను తప్ప
మరేమీ కానట్టు,
నేను మౌనంగా అంగీకరించినపుడే
మరింత నల్లబడింది.
కవులు కావ్యాలలో స్తోత్రంచేస్తారు గాని
వాళ్ళు చెప్పినదేమీ
ఈ శరీరంలో లేదు.
నాలో ఉన్నది
కేవలం
రక్త మాంసాలు తప్ప
మరోటి లేదు.
కన్నీళ్ళూ, పిచ్చి, నిస్సహాయత
తప్ప మరేమీ
లేవు
ఎత్తైన ఈ మతం గోడల మధ్య
బందీనై పడి ఉండి
స్వాతంత్ర్యం కోసం
కొంగులో చప్పుడులేకుండా
వొదిలే నిట్టూర్పులు తప్ప
మరేమీ లేవు
.
చివరగా
ఈ నల్లని బురఖా వెనక
స్త్రీని దాసిగా ఉంచుతున్నప్పటికీ
అది ఆమె క్షేమం కోసమే
అని ప్రమాణాలు చేసిమరీ చెప్పేవారికి
ఒక ప్రశ్న:
ప్రతి బురఖా వెనకా స్త్రీయే ఉందని
చెప్పకనే తెలిసిపోతున్నప్పుడు,
ఇక ఏ బురఖా క్రింద స్త్రీకి రక్షణ దొరుకుతుంది?
ఇదేనా దైవ నిర్ణయం అంటే?
.
అఫియా నూర్
మలయాళం
ఇండియా
.
Afiya Noor