అందమైన అబద్ధం… షెనా ప్యూ, ఇంగ్లండు

ఇది చాలాకాలం క్రిందటి మాట,

 బహుశా అప్పుడు వాడికి నాలుగేళ్ళుంటాయేమో…

 పెరట్లో, బటాణీ పాదుల మాటున ఏదో పెంకితనం…

 సరిగ్గా గుర్తులేదుగాని, ఒక కొమ్మ విరిచెయ్యడమో,

 పాదుకి ఆసరాగాపెట్టిన కర్రలాగేడమో ఏదో చేశాడు…

 వాళ్ళ అమ్మమ్మ వచ్చి చూసి, ఇలా అడిగింది:

 “ఏరా, నువ్వేనా ఈ పాడుపని చేసింది?”

 

ఆమె వాణ్ణి “నువ్వెందుకిలా చేశావ్?”

అని అడిగి ఉండి ఉంటే, కాదనేవాడు కాదేమో.

కాని ఆమె వాడికిప్పుడు తప్పుకునే సందు చూపించింది;

వాడి కళ్ళలో వేరే సమాధానం చెప్పడానికి

ఉన్న అవకాశం అవగాహనవగానే ముఖం వెలిగిపోతోంది: 

మాటకీ చేతకీ పొంతన ఉండనక్కరలేదనీ, తనకి

అనుగుణంగా లోకానికి జవాబుచెప్పొచ్చనీ తెలిసింది.

 

వాడు “నేను కాదు” అన్నప్పుడు,

నేను ఘంటాపథంగా చెప్పగలను, వాడిలో

పసిపిల్లవాడు ఆసరాగా పిడికిలితో వేలుపట్టుకున్నట్టు, 

తొలిసారి పండురుచిచూచినట్టు… అనుభూతి కలిగి ఉంటుంది.

వాడి కళ్ళు ఒక కిటికీలోంచి, రంగూ రూపూ

నిర్దిష్టంగా లేని ఒక కొత్త ప్రపంచాన్ని 

చూస్తున్న అనుభూతి నాకు అవగతమౌతోంది. 

 

ఆ ప్రపంచం ఒక ప్రవాహంలా, పాములా వంకరలు తిరుగుతూ

ఉత్తరధృవ కాంతుల్లా అంచులంట ప్రకంపిస్తూ,

శబ్దాన్నిబట్టి ఆకృతులు మార్చుకుంటూండడం ఊహిస్తున్నాను.

చెవుల్లో ఏదో అస్పష్ట సముద్రఘోష వింటూ

ఇసుకగడియారంలా తను నిండుతుండడం గ్రహిస్తున్నాను;

పాటలు రాయాలన్నా, పాత్రలు సృష్టించాలన్నా,

బొమ్మలువెయ్యాలన్నా, కథలుచెప్పాలన్నా కావలసింది ఈ కల్పనే.  

 

నేను బఠాణీ పాదులన్నానుగాని అవి కాకపోవచ్చు

బహుశా అవి చిక్కుడు పాదులయి ఉండొచ్చునేమో;

నిజానికి అసలక్కడ ఏ పాదూ లేకపోయైనా ఉండవచ్చు;

ఎందుకో, అక్కడ ఏదో ఒకటున్నట్టనిపించింది. అంతే!  

అన్నట్టు వాడెవరో కాదు… లేదు, చెప్పి ప్రయోజనం లేదు. 

ఆ పొదల మాటు అన్నది నా కల్పనే గాని,

వాడు ఏమి చేశాడో నాకు స్పష్టంగా తెలుసు.

 . 

షెనా ప్యూ

ఇంగ్లండు

కవిత్వాన్ని ప్రజలకి చేరువగా తీసుకురావాలన్న ఆలోచన అమెరికను కవి Judith Chernaik ది. 1986లో ప్రారంభమైన ఈ ప్రోజెక్టులో మరోముగ్గురుకవులు జతకూడి, (ఆ ముగ్గురు కవుల్లో షెనా ప్యూ ఒకరు ) లండనులో భూగర్భ రైలుమార్గంలో ప్రయాణంచేసే రైళ్లలో కొన్ని అత్యుత్తమమైన కవితలను/ పాదాలను అడ్వర్టైజ్ మెంటు బోర్డుల మీద రాసేవాళ్ళు (ఇప్పటికీ కొనసాగుతోంది). ఆ రాసే జాగాకి అయే ఖర్చుని కొన్ని కంపెనీలు / వ్యక్తులు భరిస్తారు. ఈ ప్రయోగంలో వచ్చిన అపురూపమైన ప్రాచీన, ఆధునిక కవుల కవితలలో ఈ కవిత ఒకటి. (మనందరం, ప్రపంచంలో ఎక్కడో ఒకచోట అటువంటి ఒక ప్రయోగం జరిగినందుకూ, అతి ఫలవంతంగా నడుస్తూ, జనసామాన్యానికి కవిత్వం అందుబాటులోకి వస్తున్నందుకూ సంతోషించాలి. ఆ తర్వాత, ఈ కవితల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిని సంకలనాలుగా తీసుకు వస్తున్నారు.)

చాలా కాలం తర్వాత నాకు కవిత్వంలో  జీవితాన్ని నిర్వచించగల ఒక సంఘటన జరిగినపుడు మానసిక విశ్లేషణ చేస్తూ, దాన్ని వ్యాఖ్యానించిన కవిత దొరికింది. ఇందులో, జీవితంలో మొదటిసారి అబద్ధం చెప్పడం కూడా ఒక సంక్లిష్టమైన సందర్భమే … మరీ ముఖ్యంగా పిల్లలకి. అందులోనూ, వాళ్ళు తెలివిగలపిల్లలైతే, మంచిచెడుల నైతికవిశ్లేషణలమధ్య పెరిగినవారైతే, మొదటిసారి అబద్ధం ఆడవలసి రావడం, లేదా అబద్ధమూ, నిజమూ కాకుండా చెప్పుకుని తప్పించుకోగలమన్న అవగాహన రావడమూ, జీవితంలో గ్రాడ్యుయేషన్ క్రింద జమ.

.

The Beautiful Lie

.

He was about four, I think… it was so long ago.
In a garden; he’d done some damage
behind a bright screen of sweet-peas
– snapped a stalk, a stake, I don’t recall,
but the grandmother came and saw, and asked him:
“Did you do that?”

Now, if she’d said why did you do that,
he’d never have denied it. She showed him
he had a choice. I could see, in his face,
the new sense, the possible. That word and deed
need not match, that you could say the world
different, to suit you.

When he said “No”, I swear it was as moving
as the first time a baby’s fist clenches
on a finger, as momentous as the first
taste of fruit. I could feel his eyes looking
through a new window, at a world whose form
and colour weren’t fixed

but fluid, that poured like a snake, trembled
around the edges like northern lights, shape-shifted
at the spell of a voice. I could sense him filling
like a glass, hear the unreal sea in his ears.
This is how to make songs, create men, paint pictures,
tell a story.

I think I made up the screen of sweet peas.
Maybe they were beans; maybe there was no screen,
it just felt as if there should be, somehow.
And he was my – no, I don’t need to tell that.
I know I made up the screen. And I recall very well
what he had done.

Sheenagh Pugh:

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/2001/05/beautiful-lie-sheenagh-pugh.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: