ప్రాణం…… అనా లీటీటియా బర్బో. ఇంగ్లండు.
ప్రాణమా! నువ్వేమిటో నాకు తెలీదు.
కానీ, నువ్వూ నేనూ ఎడబాటు కాకతప్పదని తెలుసు.
మనం ఎప్పుడు ఎక్కడ ఎలా కలిసేమో
అది ఇప్పటికీ నాకు తెలియని రహస్యమే.
కాని, ఇది మాత్రం బాగా తెలుసు, నువ్వు నన్ను వీడేక
ఈ శిరస్సూ, ఈ అవయవాలూ ఎక్కడున్నప్పటికీ
మట్టిపాలైన నా అవశేషాల్లో
అంత పనికిమాలినవి మరేవీ ఉండవు.
.
అరే! ఎక్కడికి, ఎక్కడికి అలా ఎగిరిపోతున్నావు?
అగోచరమైన నీ మార్గం ఏ కనపడని వంపులు తిరుగుతోంది?
చిత్రమైన మనిద్దరి ఈ ఎడబాటులో, “నేను” అనబడే
రసాయనికపదార్థం ఎక్కడ వెతుక్కోవాలో చెప్పు?
హేయమైన ఈ శరీరపు చెరనుండి విముక్తి లబించగానే
నీ సత్వము ఎక్కడనుండి వెలువడ్డదో ఆ తేజోమయమైన
అనంతార్ణవపు జ్వాలవైపేనా నీ ప్రస్థానం కొనసాగుతున్నది?
లేక, నువ్వు కంటికి కనిపించకుండా,
మంత్రశక్తివశమైన ఒక యోధుడిలా,
కొన్ని సంవత్సరాలు కాలం ఊసులేకుండా గడిపి,
నీకు నచ్చిన సమయంలో నీ సమాధిస్థితి వీడి
నీ శక్తిని తిరిగి పరిగ్రహిస్తావా?
ఏం, నీకు ఎన్నడూ ఆలోచనలూ, అనుభూతులూ ఉండవా?
నువ్వు నువ్వు కానప్పుడు, నువ్వెలా ఉంటావో చెప్పు?
.
ఓ ప్రాణమా! మనిద్దరం చాలా కాలం కలిసి ఉన్నాం.
ఆనందంలోనూ, విషాదం కమ్ముకున్నప్పుడూ.
ఒకసారి ఆప్తమిత్రులమయ్యేక విడిపోవడం చాలా కష్టం.
బహుశా ఒక నిట్టూర్పు, ఒక అస్రువు వీడాలేమో!
అదే నిజమైతే, దొంగలా జారుకో;ఏ హెచ్చరికా ఇవ్వకు;
నీ కెప్పుడు వెళ్ళాలనుంటే అపుడు వెళిపో;
నాకు వీడ్కోలు చెప్పకు. కాని, ఏదో ఒక మంచిరోజున
నాకు శుభోదయం మాత్రం చెప్పు!
.
అనా లీటీటియా బర్బో
(20 June 1743 – 9 March 1825)
ఇంగ్లీషు కవీ, వ్యాసకర్తా, సాహిత్య విమర్శకు రాలూ, సంపాదకురాలూ.
ఈ కవితలోని సౌందర్యం అందరూ మరణం గురించి చెప్పేటప్పుడు మృత్యువుని సంభోదిస్తూ కవిత్వం చెబితే, ఈమె మరణం గురించి చెబుతున్నప్పుడు, ప్రాణాన్ని సంభోదిస్తూ ఈ కవితని రసవత్తరంగా చెప్పింది. ప్రాణం అంటే ఏమిటో ఇప్పటికీ అగోచరమైన విషయాన్ని ఎంతో సున్నితంగా చెప్పింది ఈ కవితలో. ప్రాణం స్వభావం తెలీదని ఎంత చక్కగా ప్రారంభించిందో, మళ్ళీ పునర్జన్మ అంటూ ఉంటే కలుసుకుందాం అన్నట్టు ఆశావహంగా ముగించింది.
.
