అనువాదలహరి

ఈ శరీరం ఏమిటి? … సి. హెచ్. సిస్సన్ , ఇంగ్లండు

.

ఈ శరీరం ఏమిటి? కేవలం ఊహేనా?

అలా అయితే, “నా” లో నేను లేను.

ఇదొక రూపకాలంకారమా?

లేక, దేవునికి అన్యాపదేశమా?

అదే నిజమయితే,

నే నేమిటో నాకు తెలీదు. 

 

దీనికి స్పృహ ఉందని గర్వించపనిలేదు.

ఎందుకంటే, సుఖం చర్మపులోతే.

నువ్వు సంపాదించినవన్నీ

మరొకడు అనుభవించడానికే.

నీ వెలుగు

మరొకరి చీకటిలో దీపకళిక.

 

నువ్వు ఏమిచెప్పేవన్నదానితో నిమిత్తం లేదు

ఎందుకంటే, నువ్వెవరైనా, ఏదైనా

అది ఒక్కరోజు భాగవతమే.

దానితో నీ చుక్క రాలిపోతుంది

మాటే కాదు

నీ ఇంద్రియాలకు అందనంతగా.

 

మనకి తెలియని దేముడెవరో

ఓరియన్ (Orion) నక్షత్ర మండలంలో క్రాస్ లా

కాళ్లు బారజాపుకుని కనిపిస్తుంటాడు.

క్రింద మనం అన్నిరకాలుగా

అర్థం కాక సతమతమవుతుంటాం.

ఇంతమందిమి ఉన్న మనకి

ఏ రకమైన ఉనికీ లేదా?  

.

సి. హెచ్. సిస్సన్ 

(22 April 1914 – 5 September 2003) 

ఇంగ్లండు 

.

ఈ కవిత నిజంగా మన విశ్వాసాలకీ ఆచరణలకీ మధ్యనున్న వైరుధ్యాన్ని ప్రశ్నించే కవిత. ఒక పక్క దేముడిమీద విశ్వాసాన్ని ప్రకటిస్తూనే ఇంకొకపక్క అనంతంగా సంపదని, కూడబెట్టడం కాదు పోగేసుకోవడంవైపు అర్రులు చాస్తుంటాం… ఏదీ మనతో రాదు అని తెలిసినా.  ఎక్కడో ఆకాశంలో ఏవేవో రూపాలని చూస్తూ మనసులో ఆకారాలు ఊహించుకుంటూ వాటిని గుర్తిస్తున్నాం; మన కళ్ళెదుట ఇంతమంది కనిపిస్తున్నా మనుషులని మనుషులుగా గుర్తించం; మన ఊహలకి అందని దేముడిని, ఒకే ఒక్క దేముడిని, గుర్తించడానికి సిద్ధం, కానీ, శరీరం మిధ్య అనీ అశాశ్వతమనీ గుర్తించడానికి నిరాకరిస్తాం.  దీనికి ఏమైనా అర్థం ఉందా? మన ఉనికి కేవలం ఊహేనా? కల్పనేనా? అని ప్రశ్నిస్తున్నాడు కవి.

పరోక్షంగా, మనకి ఏ దేముడూ అక్కరకు రాడనీ, జీవించినంత సేపూ, ఎంత స్వల్పకాలమైనా, దాని అశాశ్వతత్వాన్నీ, ఎంత సంపద కూడబెట్టినా, మనవెంట తీసుకుపోలేమన్న సత్యాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలనీ, చెబుతున్నాడు కవి. సుఖం చర్మపులోతేననీ, హృదయానికి సుఖం వెతుక్కోవాలనీ సూచిస్తున్నాడు. మన తాత్త్విక చింతనలోనూ, ఆచరణలోనూ, మానవీయ కోణాన్ని చూడవలసిన ఆవశ్యకతని ఈ కవిత చెప్పకనే చెబుతుంది.
 .

C. H. Sisson
C. H. Sisson (Photo credit: Wikipedia)

.

The Person … C H Sisson

.

What is the person? Is it hope?
If so, there is no I in me,
Is it a trope?
Or a paraphrase of deity?
If so,
I may be what I do not know.

Do not be proud of consciousness
For happiness is in the skin.
What you possess
Is what another travels in.
Your light
Is phosphorus in another’s night.

It does not matter what you say
For any what or who you are
Is of a day
Which quite extinguishes your star—
Not speech
But what your feelers cannot reach.

There is one God we do not know
Stretched on Orion for a cross
And we below
In several sorts of lesser loss
Are we
In number not identity?

.

Charles Hubert Sisson

(22 April 1914 – 5 September 2003)

British Poet and Translator

Poem Courtesy: The Harvill Book of  Twentieth-Century Poetry in English. Ed. Michael  Schmidt.

%d bloggers like this: