తళుకు … కీర్తనా విశ్వనాథ్, మలయాళం, భారతీయ కవయిత్రి
ఆమె చనిపోయింది.
ఇక శవాన్ని ముస్తాబు చెయ్యడం మాత్రమే మిగిలుంది.
.
ఆ పొడుచుకొస్తున్నట్టున గుడ్లు మూయడం అయింది.
పెన్సిలుతో దిద్దుకోడంవల్ల నల్లబడ్డ ఆమె కనుకొసల
వేలాడుతున్న నిలకడలేని చివరి ఆశలకి
వీడ్కోలుపలకడం పూర్తయింది.
.
ఈ రోజు కళ్ళజోడు తియ్యకుండా స్నానం చెయ్యొచ్చు నువ్వు!
.
ఊ… ఊ… త్వరగా కానివ్వండి. సమయం మించిపోతోంది.
పాడెమీదకి తరలించడానికి అలంకరణ ముగించండి…
.
ముందు నుదుట చుక్క పెట్టండి…
అదే, బొట్టు పెట్టండి.
సిందూరంతో… దాన్ని గుండ్రంగా దిద్దండి.
అదిగో, స్టిక్కర్లు వాడొద్దు… చర్మం పాడవుతుంది.
కొంచెం గంధం అద్దుతారా?
పోనీ విభూది ఉపయోగించండి.
ఇంతచేసీ, ఆవిడెళుతున్నది ఎక్కడికో కాదు, శ్మశానానికి!
.
ఇవాళ కళ్ళకి కాటిక పెట్టొద్దు.
అది కారిపోయి గీతలా మరకకట్టొచ్చు.
ముక్కులో దూది పెట్టడం మరిచిపోకండి,
ఏమో? ఆవిడ వాసనలు పసిగడితే ??
.
చావుతో విచ్చుకున్న పెదాలూ, ఎగుడుదిగుడు దంతాలూ
కొంచెం మొరాయించొచ్చు. అయినా సరే,
అదిగో, ఆ సైను గుడ్డతో
దవడలని గట్టిగా కట్టి నోటికి బుద్ధిచెప్పండి
.
ఆవిడ నాలిక కక్కే విషం
బయటకి పొర్లకుండా అక్కడే కట్టడి చెయ్యాలి.
బుగ్గమీద ఉన్న ఒకే ఒక సొట్టని దేంతోనైనా పూడ్చండి.
అసత్యాలకి ఇప్పటికైనా ముగింపు పలికితే మంచిది.
.
రక్తం కారుతున్న చెవుల్లో
పెద్ద పెద్ద దూది ఉండలు బాగా కూరండి .
ఇప్పుడు చెవులు ఇంకా బాగా వినపడతాయిట,
మనం అననిమాటలు కూడా ఆవిడకి వినిపించొచ్చు.
అన్నట్టు చెప్పడం మరిచాను,
మెరుస్తున్న చెవి రింగులు తియ్యడం మరిచిపోకండి.
.
చేతులమీది నరాలు ఉబ్బిపోయి,
లావెక్కిన ఆ వేళ్ళని తొందరగా తాళ్లతో బిగించండి.
వలలు నేసిన వేళ్ళవి, నేర్పుగా చురుకుగా కదలగలవు.
ఏ ఉంగరాలూ, స్మృతిచిహ్నాలూ
వాటి పట్టుకి చిక్కకుండా చూసుకొండి.
.
ఖాళీ చేతుల్ని రెండింటినీ
తప్పులు మన్నించమని వేడుతున్నట్టు విరిచికట్టండి.
.
ఇక మనం కాళ్ళకున్న కడియాలు తీసెయ్యొచ్చు.
జాగ్రత్త! చప్పుడు చెయ్యనివ్వకండి.
కాళ్ళని కూడా ఇప్పుడు స్వేచ్ఛగా వదలకుండా తాళ్లతో కట్టెయ్యండి.
మళ్ళీ ఆవిడ తిరిగి రాకూడదు… జ్ఞాపకాల్లోకి కూడా.
.
ఇక చాలు. అలంకారం ఆపొచ్చు.
ఇప్పుడందరికీ ప్రదర్శనకి పెట్టొచ్చు.
ఆఖరిసారిగా, ఆవిడని చూద్దాం.
మరొక్కసారి అన్నీ తణిఖీ చెయ్యండి
తనతో ఆవిడేమీ పట్టుకుపోకుండా.
ఇక ఎవరికి తోచింది వాళ్ళు చెయ్యొచ్చు…
వెక్కిరించొచ్చు.
ఒక పక్కకి నిలబడి కన్నీళ్ళు తుడుచుకోవచ్చు
దుఃఖంతో వెక్కివెక్కి ఏడ్వొచ్చు.
ఎక్కువసేపు అట్టిపెట్టొద్దు.
పెద్దగొయ్యితీసి అందులో కప్పెట్టండి.
కుటుంబంలో పెద్దవాళ్ళు ఇంకా బతికి ఉన్నారు.
అందుకని దహనం చెయ్యడానికి మామిడిచెట్టుని నరకలేం.
అసలు దహనం చెయ్యనే చెయ్యొద్దు,
ఎందుకంటే, ఆవిడ బూడిద కూడా మిగలడానికి వీల్లేదు.
.
కీర్తనా విశ్వనాథ్,
మలయాళం కవయిత్రి
.
Keerthana Viswanath
Image Courtesy: