అనువాదలహరి

వీడ్కోలు … డొరతీ లారెన్స్ మాన్, అమెరికను

వీడ్కోలుకి సమయం దగ్గరపడి పగలు నెమ్మదిగా ముగుస్తున్నప్పుడు,

కొండలమీదా, మైదానాలమీదా చీకటి చిక్కబడుతున్నప్పుడు

నేలమీద ఇక ఏ దుఃఖమూ ఏ వేదనా, ఏ యాతనా లేనప్పుడు

మనం ఇంకా పోట్లాటలతోనూ, కలహాలతోనూ అలసిపోవాలా?

.

కడకు, జాడలు చెరుగుతూ సమీపంలో నక్షత్రాలు మెరుస్తూ

విజయగంధాలని శ్వాసిస్తున్నప్పుడు; మనకు వినిపిస్తున్న గొంతుకలు

చరిత్రను పునీతంచేసిన ఉదాత్తులైన మన సహచరులవైనప్పుడు,

మనం పోతూ, ఒక నిముషపు శోకానికైనా నోచుకోగలమా?

.

ఆ డేగ కాళ్ళు అందుకునే ముందు ఒక్క క్షణకాలం ఆగుదామా?

ఈ నేలలు చూపులకి క్రమంగా కనుమరుగయేలోగా

కడసారిగా ఒక్కసారి తనివితీరా కన్నులారా పరికిద్దుమా?

అలా పరికిస్తూ, ఈ నేలతో ఋణానుబంధం తీరేలోగా

ఇక్కడి సౌందర్యాన్నంతా పోగుచేసి

ఒక్క తేజోమయమైన లిప్తపాటు దాన్ని ఆస్వాదిద్దామా.

.

లేక, ఏ తీరని కోరికలతోనో వెనుతిరిగిచూడక

ఒకే ఒక్క ఉరుకుతో ఈ చివరి అఖాతాన్ని దాటుదామా?

ఈ కరుకైన మహోన్నత నిటారు శిఖరాలను,

భూమిమీద వ్యామోహంతో ఏ క్షణం వెనకాడినా,

సూర్యుడు తనకిరణాలతో స్పృశించి తనలో

లీనంచేసుకునే అవకాశం ఆలస్యమౌతుందన్న భయంతో

త్వర త్వరగా సంతోషంగా అధిరోహిద్దామా?

.

 డొరతీ లారెన్స్ మాన్

(Jan 26, 1887 – NA)

అమెరికను

.

ఈ కవితలో  తెలియకుండానే ఒక చిత్రమైన విషయం దాగుంది.  ‘నామలింగానుశాసనం’లో సూర్యమండలానికి ఉన్న పేర్లలో “పోరనీల్గెడు మొనగాండ్రు పోవుదారి” అన్నది ఒకటి. అంటే యుద్ధంలో మరణించేవారు సూర్యమండలాన్ని భేదించుకుని వెళ్లతారట. ఈ కవితలో కూడా చివరిపాదంలో చిత్రంగా అలాంటి అర్థాన్నే స్ఫురింపజేసే పదాలున్నాయి. యుద్ధంలో మరణించడానికీ, సూర్యమండలాన్ని దాటడానికీ భిన్నసంస్కృతులలో ఒకే నమ్మకం ఉందేమో అన్న అనుమానం కలుగుతోంది.

ఈ కవిత మృత్యువు ఆసన్నమై చివరిక్షణాల్లో ఉన్న వ్యక్తి సందేశంగా చెప్పుకోవచ్చు. వ్యక్తికి తనకి నూకలు చెల్లిపోయాయని తెలిసినా ఇంకా బ్రతకాలన్న వెంపర్లాట పోదు.

ఈ భూమిమీద ఒకానొక అదృష్ట సంఘటనద్వారా మానవ శరీరాన్ని పొందిన అణువులు మరణంతో  మళ్ళీ యధాస్థితికి విడిపోతాయి. అచేతనప్రకృతిగానూ, మానవేతర ప్రాణిగా ఉన్నప్పుడు ఇక్కడి సౌందర్యంలో భాగంగా అంతవరకు ఉన్న అణువులు, మనిషిగా రూపుదిద్దుకోగానే వాటిని ఆనందించగల ఇంద్రియ ప్రకంపనలు పొందుతాయి.  జీవినుండి ధాతువులుగా, ధాతువులనుండి జీవిగా అది ఒక ఆవృత్తి. ఈ జీవ-నిర్జీవ చలన-అచలన   ఆవృత్తంలో ఈ అణువులు భూమి ఉన్నంతకాలం, లేక ఏ ఖగోళ సంఘటనవల్లనో ఇంకో గోళానికి చెందితే ఆ గోళం ఉన్నంతవరకో, అలా, ఈ సృష్టి ఉన్నంతవరకూ జరుగుతూనే ఉంటుంది. కాని చిత్రంగా, మనిషిరూపం ధరించి, ఆలోచించగల అవకాశం వచ్చినప్పుడు వాటిలో జరిగే ప్రతిక్రియే చిత్రంగా ఉంటుంది. అది నిత్య యవ్వనాన్ని కాంక్షించిన యయాతి చరిత్రని గుర్తుకు తెస్తుంది… ఎలాగైనా ఈ జీవితాన్ని కొనసాగించాలన్న తపన ప్రారంభమౌతుంది . …

అందుకే ఈ సందేశం. మరణం ఆసన్నమైనపుడు మనిషి ప్రశాంతచిత్తుడుగా ఉండగలిగితే అదృష్టమే, ఇంకా పగ- ప్రతీకారాలతో కొట్టుమిట్టాడకుండా. మృత్యువనే డేగ తనకాళ్ళతో తన్నుకుపోయే లోగా, అపురూపమైన ఈ భూమి సౌందర్యాన్ని వీక్షించగలిగితే, ఆ లిప్తపాటు కూడా ఆనందం. ఏ వెంపర్లాటలూ లేని స్థితిరాగలిగినపుడే, ఆఖరిపాదంలో చెప్పినట్టు మనిషి ఒక్క గెంతులో ఈ అఖాతాన్ని దాటగలడు… మృత్యువును ఏ చింతలూ లేకుండా అక్కునచేర్చుకోగలడు.

భారతీయ చింతనకు దగ్గరగా ఉన్న భావన ఇది. నిర్యాణ సమయంలో అందుకోవలసిన నిర్వాణ భావన.

.

L’Envoi  (The Parting)

.

When the time for parting comes, and the day is on the wane,

And the silent evening darkens over hill and over plain,

And earth holds no more sorrow, no more grief, and no more pain,

Shall we weary for the battle and the strife?

When at last the trail is ending,and the stars are growing near,

And we breathe the breath of conquest,and the voices that we hear

Are the great companions’ voices that have hallowed year on year,

Shall we know an instant’s grieving as we pass?

Shall we pause a fleeting moment ere we grasp the eager hands,

Take one last long look of wonder at the dimming of the lands,

Love the earth one glowing moment  ere we pass from its demands,

Cull all beauty in its essence as we gaze?

Or with not one backward longing shall we leap the last abyss,

Scale the highest crags glad-hearted, fearful only lest the bliss

Of an earth-remembering instant should delay the great sun’s kiss—

Consuming us within the flame?

.

Dorothea Lawrence Mann

(Jan 26, 1887 – NA)

American

[Poem Courtesy: Anthology of Massachusetts Poets. 1922

William Stanley Braithwaite, ed. (1878–1962). ]

%d bloggers like this: