అనువాదలహరి

ఒకదాని వెనక ఒకటి… ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్, బ్రిటిష్

ఒకదాని వెనక ఒకటి ఇసకరేణువులు జారుతున్నై

ఒకదాని వెనుక ఒకటి క్షణాలు రాలుతున్నై

కొన్ని వస్తున్నై, కొన్ని పోతున్నై

అన్నిటినీ పట్టుకుందికి ప్రాకులాడకు.


ఒకదాని వెనుక ఒకటి నీ బాధ్యతలు ఎదురుచూస్తునై

ప్రతిదానిమీద నీ పూర్తి శక్తియుక్తులు వినియోగించు

భవిష్యత్తుమీది ఏ కలలూ నిన్ను ఉల్లాసపరచనీకు

ముందుగా ప్రతి ఒక్కటీ నీకేది నేర్పగలదో తెలుసుకో


ఒకదాని వెనుక ఒకటి స్వర్గం నుండి ఆశీస్సులు

సుఖసంతోషాలుగా నీకు ఇక్కడకి పంపబడతాయి

ఎప్పుడు వచ్చినా వాటిని తక్షణం స్వీకరించు

అలాగే త్యజించడానికి కూడ సంసిద్ధంగా ఉండు.


ఒకదాని వెనక ఒకటి కష్టాలు నిను చుట్టుముడతాయి

ఆ సైనిక పటాలం చూసి ఏమాత్రం భయపడొద్దు

ఒకటి నిష్క్రమిస్తుంటే మరొకటి పలకరిస్తుంటుంది

నేలమీద కదలాడే నీడల ప్రవాహంలా.


జీవితంలోని అంతులేని విషాదాన్ని తిలకించకు

ప్రతి నిముషంలోని బాధ, ఎంత క్షణికమో గుర్తించు

రేపు నీకు భగవంతుడు తప్పకం సాయం చేస్తాడు

అందుకనే ప్రతిరోజూ కొత్తగా ప్రారంభిస్తునాడు.


నెమ్మదిగా పరిగెత్తే ప్రతి ఒక్క క్షణానికి

అది చెయ్యవలసినపనో, మోయవలసిన భారమో ఉంటుంది

ప్రతి రత్నాన్నీ జాగ్రత్తగా పొదిగినప్పుడే గదా

కిరీటానికి శోభా, పవిత్రతా దక్కేది


అదే పనిగా విచారిస్తూ కూచోకు

నిరాశతో, నిరాసక్తంగా కాలం దొర్లనీకు

నీ దైనందిన బాధ్యతలు విస్మరించకు

భవిష్యత్తుని కుతూహలంతో ఎదురుచూడు


స్వర్గాన్ని చేర్చే బంగారు లంకెలు క్షణాలు,

అవి భగవంతుని ముద్రలు; కానీ,

ఒక దాని వెనక ఒకటిగా లంకె తెగిపోకుండా

పట్టుకుని సాగాలి, ఈ తీర్థయాత్ర ముగిసే లోగా.

.

ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్

(30 October 1825 – 2 February 1864)

బ్రిటిష్

విక్టోరియన్ యుగంలో అత్యంత పేరుప్రతిష్ఠలు సంపాదించి, విక్టోరియా మహారాణి ఆదరానికి పాత్రమైన కవయిత్రి ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్. ఫెమినిజం ఒక వాదంగా రూపుదిద్దుకోని కాలంలో ఆమె స్త్రీలకు ఇచ్చిన పిలుపు: “మీరు మగవాళ్ల నీడలక్రింద మీ జీవితాలని  వెళ్ళబుచ్చకండి” అని. ఆమె కవిత్వం ఎందరో అజ్ఞాత మహిళలు తమ అస్తిత్వంకోసం జరిపిన పోరాటాలని స్పృశిస్తుంది.

కవిత్వంతో బాటు, ఆమె జామెట్రీ, సంగీతం, పియానో, డ్రాయింగు, ఫ్రెంచి, ఇటాలియన్, జర్మను భాషలలో చెప్పుకోదగ్గ ప్రావీణ్యాన్ని సంపాదించింది అన్నదాన్నిబట్టి ఎవరికి వారు ఆమె ప్రజ్ఞాపాటవాలని అంచనా వేసుకోవచ్చు. ఛార్ల్స్ డికెన్స్ కి ఈమె చాలా కాలం అజ్ఞాతంగానూ, తర్వాత ప్రత్యక్షంగానూ అభిమాన కవయిత్రి.

.

Adelaide Anne Procter
Adelaide Anne Procter (Photo credit: Wikipedia)

.

One By One …
.
One by one the sands are flowing,
One by one the moments fall;
Some are coming, some are going;
Do not strive to grasp them all.

One by one thy duties wait thee,
Let thy whole strength go to each,
Let no future dreams elate thee,
Learn thou first what these can teach.

One by one (bright gifts from Heaven)
Joys are sent thee here below;
Take them readily when given,
Ready too to let them go.

One by one thy griefs shall meet thee,
 Do not fear an armèd band;
One will fade as others greet thee;
Shadows passing through the land.

Do not look at life’s long sorrow;
See how small each moment’s pain;
God will help thee for to-morrow,
So each day begin again.

Every hour that fleets so slowly
Has its task to do or bear;
Luminous the crown, and holy,
When each gem is set with care.

Do not linger with regretting,
Or for passing hours despond;
Nor, the daily toil forgetting,
Look too eagerly beyond.

Hours are golden links, God’s token,
Reaching Heaven; but one by one
Take them, lest the chain be broken
Ere the pilgrimage be done.
.

(From Legends and Lyrics, Series 1)
Adelaide Anne Procter

(30 October 1825 – 2 February 1864)

American

Poem Courtesy: http://gerald-massey.org.uk/procter/c_poems_1a.htm

%d bloggers like this: