నేను విన్న సంగీతం … కాన్రాడ్ ఐకెన్, అమెరికను కవి
నేను నీతో కలిసి విన్న సంగీతం, కేవలం సంగీతం కాదు
నేను నీతో కలిసి పంచుకున్న రొట్టె … కేవలం రొట్టె కాదు,
నా ప్రక్కన ఇప్పుడు నువు లేవు… కనుక అంతా శూన్యమే,
ఒకప్పుడు సౌందర్యంతో దీపించినదంతా ఇపుడు జీవకళ కోల్పోయింది.
.
ఒకప్పుడు నీ చేతులు ఈ మేజానీ, ఈ పాత్రల్నీ స్పృశించేయి
నీ వేళ్ళు ఆ గాజుపాత్రని పట్టుకోగా చూడడం నాకింకా గుర్తే,
ప్రేయసీ! ఈ వస్తువులేవీ నిన్ను గుర్తుపెట్టుకోకపోవవచ్చు,
కానీ, వాటిపై నీ స్పర్శ ముద్ర ఎన్నటికీ మాసిపోదు సుమా!
.
ఓ వివేకవతీ! సుందరీ! నువ్వు వాటికి పాత పరిచయానివే.
కారణం, నువ్వు నా మదిలోనే వాటి మధ్య మసలిందీ
నీ చూపులతో, నీ కరస్పర్శతో వాటిని అనుగ్రహించినదీను;
నా మనసులోని పాత్రలు నిన్ను ఇక మరవమన్నా మరవవు.
.
కాన్రాడ్ ఐకెన్
(August 5, 1889 – August 17, 1973)
అమెరికను కవి
