స్థితప్రజ్ఞుడు డేవిడ్ హ్యూం… ఏడం స్మిత్, ప్రఖ్యాత ఆర్థికశాస్త్రవేత్త, స్కాట్లండు

ఉపోద్ఘాతం:

18వ శతాబ్దంలో స్కాట్లండులో తాత్త్విక చింతన, శాస్త్రీయ ఆవిష్కారాలతో ఒక కొత్తశకానికి తెరలేచింది. గ్లాస్గో, ఎడింబరో, ఏబర్డీన్ వంటి ప్రాచీనమైన విశ్వవిద్యాలయాలలోనూ పదిమంది కలుసుకునే కూడళ్ళలోనూ, ఎక్కడపడితే అక్కడ మేధోపరమైన చర్చలు జరుగుతుండేవి. అదే కాలంలో యూరోపులో ప్రచారంలో ఉన్న మానవతావాదం, హేతువాదాలతో ఆలోచనలను పంచుకుంటూ, స్కాట్లండుకు చెందిన మేధావులు మానవ వివేచనాశక్తికి అధిక ప్రాధాన్యతనిస్తూనే, తర్కానికి నిలబడని ఏ ప్రాచీన సంప్రదాయాన్నైనా నిర్దాక్షిణ్యంగా త్రోసిపుచ్చేరు. ఇతర యూరోపియన్ దేశాలవారికి భిన్నంగా కేవలం వివేకము ద్వారానే మానవాళి ప్రకృతిలోనూ, సమాజంలోనూ మేలైన మార్పులు తీసుకురాగలదన్న ఆశావహమైన దృక్పథం కలిగి ఉండేవారు. దాని పర్యవసానమే, తత్త్వవేత్త జాన్ లాకే … “మనిషికి జ్ఞానం ఇంద్రియాలద్వారానే ప్రాప్తిస్తుందనీ, ప్రతిదాన్నీ అనుభవంద్వారానో, పరీక్షద్వారానో ప్రామాణీకరించాలితప్ప సంప్రదాయం దానంతట అది ప్రమాణం కాద”ని చెప్పిన అనుభవైక వాదానికి (Empiricism) కొనసాగింపు డేవిడ్ హ్యూం సమర్థవంతంగా చేసిన తత్త్వవివేచన. జీవిత చరమాంకంలో మరణం పట్ల డేవిడ్ హ్యూం కనబరచిన నిర్భీతి మనకు సోక్రటీసును గుర్తుచేస్తుంది. దానికి తగ్గట్టుగానే, ప్లేటో సోక్రటీసు మరణం గురించి వ్రాసినంత హృద్యంగా డేవిడ్ హ్యూం గురించి, తన Wealth of Nations ద్వారా ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థని రూపుకట్టిన ఆర్థిక శాస్త్రవేత్త, అతని మిత్రుడు ఏడం స్మిత్ (Adam Smith), William Strahan, Esq. కి స్వయంగా వ్రాసిన ఈ క్రింది ఉత్తరం కళ్ళకు కట్టినట్టు మన ముందు ఉంచుతుంది…

జీవితంపట్ల, అద్భుతమైన రాగాన్నీ, మృత్యువుపట్ల అంతే వైరాగ్యాన్నీ కనబరిచిన డేవిడ్ హ్యూం మన ఋషులు చెప్పిన స్థితప్రజ్ఞతకి అచ్చమైన నిదర్శనం అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాన్ని ప్రగతి మార్గంలో తీసుకుపోగల ఏ భావజాలమూలేని ఈ రోజుల్లో, అటువంటి వాళ్ళ జీవిత చిత్రాలు, కొందరికైనా స్ఫూర్తినిస్తాయేమోనన్న చిన్న ఆశ.
————————————————————————————-  విలియం స్ట్రేహాన్, ఎస్క్వైర్
కిర్కాల్డీ, ఫైఫ్ షైర్,
నవంబరు 9, 1776.

ఆర్యా,

ఉదాత్తుడైన మనిద్దరి సన్నిహిత మిత్రుడు హ్యూం, ఈ మధ్య అతని అనారోగ్య పరిస్థితిలో ప్రవర్తించిన తీరు ప్రస్తావించడానికి మనసులో విషాదం ఉన్నా, సంతోషంగానే, ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.

వ్యాధి కుదరదనీ, చనిపోవడం ఖాయం అనీ అతని అభిప్రాయం అయినప్పటికీ, అతని మిత్రుల ప్రోద్బలం కారణంగా, బహుశా సుదీర్ఘమైన ప్రయాణపు పరిణామంగా వచ్చిన అనారోగ్యానికి చికిత్సచేసుకుందికి అంగీకరించేడు. అతను ఎడింబరోనుండి బయలుదేరే ముందు అతని స్వీయచరిత్ర వ్రాసి, మిగతా కాగితాలతో పాటుగా దాన్ని మీ దగ్గర భద్రపరిచిన సంగతి విదితమే. కనుక, ఈ లేఖ అతను ఎక్కడితో తనస్వీయచరిత్ర ఆపేడో, అక్కడనుండి ప్రారంభమవుతుంది.

ఏప్రిల్ నెల చివరలో అతను లండను ప్రయాణం కట్టేడు. ఎడింబరోలో ఉంటాడనుకుని అతన్ని కలవడానికే ప్రతేకంగా లండనునుండి బయలు దేరిన నేనూ, జాన్ హోం ఇద్దరం దారిలో Morpeth వద్ద అతన్ని కలిసేము. హోం అతనితో వెనక్కి తిరిగి వచ్చి ఇంగ్లండులో అతనున్నంతకాలం ఒక నిజమైన మిత్రునిదగ్గరనుండి ఏ అభిమానం ఆప్యాయతా ఆశిస్తామో దానికి తగ్గట్టుగా అతని అవసరాలు పర్యవేక్షించేడు. స్కాట్లండులో తనని కలుస్తానని మా అమ్మగారికి నేను ముందుగా ఉత్తరంవ్రాసి ఉండడం వల్ల, నా ప్రయాణం మాత్రం నేను ముందుకి కొనసాగించడం తప్పనిసరి అయింది. గాలిమార్పుకీ, వ్యాయామానికీ అతని అనారోగ్యం లొంగినట్టు కనిపించింది; ఎడింబరోలో బయలుదేరినప్పటికంటే అతను లండను చేరేటప్పటికి ఆరోగ్యం మెరుగయినట్టు కనిపించింది. అందుకని అతన్ని Bath వెళ్లమనీ అక్కడి నీళ్ళు త్రాగమనీ వైద్యులు సలహా ఇవ్వడమూ, అక్కడికివెళ్ళి కొంతకాలం ఉన్నాక, ఎప్పుడూలేనిది అతనుకూడా అతని ఆరోగ్యం బాగుపడిందని అనుకునేంతగా ఆ వాతావరణం అతనికి బాగా సరిపడడమూ జరిగింది. కానీ తొందరలోనే, వ్యాధి లక్షణాలన్నీ పూర్వపు తీవ్రతతో తిరగబెట్టాయి; ఆ క్షణంనుండీ అతను వ్యాధి నయంకావడం అన్న ఆలోచనకి స్వస్తి పలికి అనంతరపరిణామాలని స్వీకరించడానికి ఆనందంతో, పరిపూర్ణమైన నిర్వికారముతో, ప్రసన్నతతో సంసిధ్ధుడయ్యాడు. ఎడింబరో తిరిగివచ్చిన తర్వాత అతను బాగా నీరసించిపోయినప్పటికీ అతనిలో హుషారు ఎంతమాత్రమూ తగ్గలేదు; యధాప్రకారం అతను రాబోయే ముద్రణలకు తన రచనలు సరిదిద్దుకుంటూనో, మనసుకి ఆహ్లాదంకలిగించే పుస్తకాలు చదువుకుంటూనో, స్నేహితులతో మాట్లాడుతూనో, ఒక్కొక్కసారి వాళ్లతో సాయంత్రం వేళల్లో Whist ఆడుతూనో పొద్దుపుచ్చుతుండేవాడు. అతను ఎంత ఉల్లాసంగా ఉండేవాడంటే, అతని సంభాషణలూ ఛలోక్తులూ ఎప్పటి ధోరణిలోనే సాగుతూ, అతని వ్యాధిలక్షణాల తీవ్రత ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ, ఎవరికీ అతను నెమ్మది నెమ్మదిగా చనిపోతున్నాడంటే నమ్మబుధ్ధి అయ్యేదికాదు. ఒకరోజు అతనికి చికిత్స చేస్తున్న డా. డండాస్, అతనితో “అలాగయితే, కల్నల్ ఎడ్మాన్స్టోన్ (Colonel Edmonstone)తో నేను ఇక్కడ బయలుదేరేవేళకి మీ ఆరోగ్యం మెరుగ్గా ఉందనీ, త్వరలో పూర్తిగా కోలుకునే దిశలో మీరున్నారనీ చెబుతాను,” అన్నాడు. దానికతను, “డాక్టర్! మీరు నిజం తప్ప ఇంకేదీ చెప్పరని నా గాఢమైన నమ్మకం. నాకు శత్రువులంటూ ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళు కోరుకునేంత త్వరగానూ, నా ఆప్తమిత్రులు నేను ఎంత సునాయాసంగా, ఉల్లాసంగా చనిపోవాలని కోరుకుంటారో అంత సునాయాసంగానూ మరణిస్తున్నానని అతనికి చెప్పండి,” అన్నాడు. తర్వాత కల్నల్ ఎడ్మాన్స్టోన్ అతన్ని చూడడానికి వచ్చి, వెళిపోతున్నప్పుడు మార్గమధ్యంలో ఉత్తరం రాయకుండా ఉండలేకపోయాడు. మరొక్కసారి అతనికి తుదివీడ్కోలు చెబుతూ అందులో Abbe Chaulieu తనకు మరణ ఆసన్నమైనదని తెలిసి, తన మిత్రుడైన Marquis de la Fare నుండి దూరమైపోతున్నానన్న బాధతో వ్రాసిన ఫ్రెంచి కవితని అతనికి అనువర్తిస్తూ ఉదహరించేడు. హ్యూం యొక్క ఔదార్యమూ, గుండెదిటవూ ఎంత గొప్పవంటే, అతనికి అత్యంత ఆప్తులైన మిత్రులకి తెలుసు, అతనితో ఒక మరణిస్తున్న వ్యక్తితో మాట్లాడుతున్నట్టు మాటాడినా, ఉత్తరం వ్రాసినా, దానివల్ల తాము ఏ విపత్తూ అతనికి తీసుకురావడం లేదని; అలా ఉన్నదున్నట్లు రాస్తున్నందుకు బాధపడకపోగా, మీదుమిక్కిలి, అతను అదొక పొగడ్తగా భావించి, సంతోషించేవాడు. అప్పుడే వచ్చిన ఆ ఉత్తరం అతను చదువుతున్న సమయంలోనే నేను గదిలోకి అడుగుపెట్టడం, అతను నాకు అది వెంటనే చూపించడం జరిగింది. నే నతనితో, అతను ఎంతగా నీరసించిపోయాడో చూస్తున్నాననీ, అతని రూపు రేఖలు ఎంతగా కళతప్పి ఉన్నాయో కూడా గ్రహించాననీ, అయినప్పటికీ, అతనిలో ఇంకా హుషారు ఎంతమాత్రం తగ్గకపోడంవల్ల అతనిలో జీవశక్తి చాలా గట్టిగా ఉందనీ, అందువల్ల నాకు ఇంకా కొంత చిగురాశ ఉందనీ అన్నాను. దానికతను, “నీ ఆశలు కేవలం నిరాధారమైనవి. ఏ వయసులోనైనా ఏడాదిపాటు కొనసాగుతున్న అతిసారవ్యాధి (డయేరియా) ప్రమాదకరమైనది; నా వయసులో అయితే అది మరణ హేతువు. నేను రాత్రి పడుక్కునేటప్పుడు, ఉదయం లేచినప్పటికంటే నీరసంగా అనిపిస్తుంది; నేను ఉదయం లేచేటప్పుడు రాత్రి పడుక్కున్నప్పటికంటే నీరసంగా ఉంటుంది. అదిగాక, నాకు తెలుస్తూనే ఉంది, నా ముఖ్యమైన అవయవాలు ఒక్కటొకటీ దెబ్బతినడం. కనుక నేను త్వరలోనే మరణించడం ఖాయం,” అన్నాడు. నే నన్నాను, “సరే! అదే నిశ్చయమైనప్పుడు, నీకు నీ మిత్రులందరినీ, ప్రత్యేకించి నీ సోదరుడి కుటుంబాన్ని, మంచి అభివృధ్ధిలో ఉండగా చూస్తూ వెళుతున్న సంతృప్తి అయినా దక్కుతుంది,” అన్నాను. దానికతను, ఆ సంతృప్తిని చాలా స్పష్టంగా అనుభవించేనని చెబుతూ, కొద్దిరోజులు ముందు “Lucian’s Dialogues of the Dead” అన్న పుస్తకం చదువుతుండగా, షరోన్ (Charon) నావలోకి వెంటనే ఎక్కడానికి నిరాకరిస్తూ జీవులు చెప్పే సవాలక్ష కుంటిసాకుల్లో తనకి సరిపడినది ఏదీ లేదని అంటూ, తనకి పూర్తిచెయ్యవలసిన ఇల్లుగాని, జీవనాధారము కల్పించవలసిన కూతురుగాని, తను పగతీర్చుకోవలసిన శత్రువులుగాని లేరని అన్నాడు. మళ్ళీ తనే, “షరోన్ దగ్గర కొద్దికాలం వాయిదా సంపాదించడానికి తగిన కారణం ఊహించలేకపోతున్నాను. ‘దీనివల్ల ఫలితం ఉంటుంది, ఇది తప్పకుండా చెయ్యాలి’ అనుకున్న ప్రతి పనీ నేను పూర్తిచేశాను; ఇప్పుడున్న పరిస్థితికంటే మెరుగైన పరిస్థితుల్లో నా మిత్రుల్నీ, బంధువుల్నీవిడిచివెళ్ళే అవకాశం ఊహించలేను. కాబట్టి నేను సంతృప్తిగా కన్నుమూయడానికే తగిన కారణం కనిపిస్తోంది,” అన్నాడు. తనే మళ్ళీ మాటమారుస్తూ, హాస్యస్ఫోరకమైన కొన్ని కుంటిసాకులు షరోన్ కి చెప్పాలని వెదుకుతూ, షరోన్ అతని స్వభావానికి తగ్గట్టుగా చిరచిరలాడుతూ తనకి ఏమని సమాధానం చెబుతాడోకూడా తనే ఊహించి చెప్పడం ప్రారంభించేడు. “బాగా పునరాలోచన చేసిన తర్వాత” అంటూ అతను ప్రారంభించేడు, “నేనూ ఇలా చెప్పడానికి ప్రయత్నిస్తాను, ‘నాయనా షరోన్! నా పుస్తకాలు పునర్ముద్రణకోసం కొన్ని దిద్దుబాట్లు చేస్తున్నాను. నాకు కొంచెం సమయం ఇవ్వు. ఈ లోగా నా దిద్దుబాట్లని ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారో చూడనీ.’ అని. కానీ షరోన్ అంటాడు: ‘ఒకసారి వాటి ప్రభావం చూసేక నువ్వు మరికొన్ని దిద్దుబాట్లను చెయ్యడానికి పూనుకుంటావు. ఇలా ఈ దిద్దుబాట్లుకి అంతూ పొంతూ ఉండదు. కనుక ప్రియ మిత్రమా, పడవలోకి వేంచేయీ’ అంటాడు. అయినా, అప్పటికీ నేను మరో ప్రయత్నం చెయ్యొచ్చు. ఈ సారి, ‘మిత్రమా, షరోన్! కొంచెం ఓపిక పట్టవయ్యా!. ప్రజల కళ్ళు తెరిపించాలని నేను ఎంతగానో తాపత్రయపడుతున్నాను. నేను మరికొన్ని సంవత్సరాలుగాని బ్రతకగలిగితే, ఇప్పుడున్న మూఢనమ్మకాలు కొన్ని పతనమవడం చూసేనన్న సంతృప్తి నాకు దక్కుతుంది,’ అంటాను. దానితో షరోన్ సహనం కోల్పోయి, సభ్యతా, మర్యాదలన్నీ పక్కనబెట్టి, “ఓరి కాలయాపనచేసే ధూర్తుడా! అది కొన్నిసంవత్సరాలు కాదుగదా వందసంవత్సరాలకైనా జరిగేదికాదు. ఏం? నీకు అన్ని సంవత్సరాల వాయిదా ఇస్తానని అనుకుంటున్నావా? తక్షణం నావలోకి ఎక్కు, పనిలేక, నా సమయం వృధాచేసే పోకిరీ వాడా!’ అని అంటాడు.”

తనని సమీపించబోయే మృత్యువుగురించి హ్యూం ఎప్పుడూ సరదాగా మాటాడినప్పటికీ, ఆ హుందాతనాన్ని పదిమందిముందూ ప్రదర్శించడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. సంభాషణ సహజంగా ఆ విషయం వైపు మళ్ళితే తప్ప తనంత తాను ఆ ప్రస్తావన తీసుకు వచ్చేవాడు కాదు; అప్పుడుకూడా ఆ విషయం గురించి ఎంతసేపు మాటాడాలో అంతసేపే తప్ప అంతకుమించి కొనసాగించేవాడు కాదు; అయితే ఆ విషయం తరుచూ ప్రస్తావనలోకి వస్తుండేది, కారణం, అతన్ని చూడడానికి వచ్చిన మిత్రులు ఆయన ఆరోగ్యపరిస్థితి గురించి సహజంగానే అడిగే వాళ్ళు. నేను పైనప్రస్తావించిన సంభాషణ ఆగష్టు ఎనిమిదవ తేదీన మా ఇద్దరి మధ్యా జరిగింది; ఆ తర్వాత మరొక్క సారే మాటాడగలిగేను. అతను ఎంతగా నీరసించిపోయాడంటే, అతని ఆత్మీయమిత్రుల కలయిక అతనికి ఇంకా అలసట తెప్పిస్తోంది. ఎందుకంటే, ఇప్పటికీ అతనిలోఉన్న ఉత్సాహము ఎంత ఎక్కువా, అతని సౌజన్యమూ, స్నేహశీలతా ఎంత పరిపూర్ణమైనవీ అంటే, అతని పక్కన ఎవరైనా స్నేహితుడు కూర్చుంటే బాగా చిక్కిపోయిన అతని శరీరం-అనుమతించినదానికంటే ఎక్కువగా, ప్రయాసపడుతున్నప్పటికీ మాటాడకుండా ఉండలేడు. అందుకని, ఎడింబరోలో నే నుండడానికి అతనొక కారణమైనప్పటికీ, అతని సలహా మేరకి, అతను నన్నెప్పుడు చూడాలనిపించినా నాకు కబురుపెట్టాలన్న షరతు మీద ఎడింబరో విడిచి ఇక్కడ కిర్కాల్డీలో మా అమ్మగారి ఇంటికి వచ్చేను; ఈ లోగా అతన్ని ఇప్పుడు తరచు పర్యవేక్షిస్తున్న వైద్యుడు డా. బ్లాక్, కూడా అతని ఆరోగ్యం గురించిన సమాచారం వీలున్నప్పుడల్లా తెలియజేస్తానని మాట ఇచ్చేడు.

ఆగష్టు 24న డా. బ్లాక్ ఇలా రాసేడు:

“నేను క్రిందటిసారి ఉత్తరం వ్రాసినప్పటికంటే, హ్యూం అతని సమయాన్ని చాలా సులువుగానే గడిపేడు, కాకపోతే, ఇంకా నీరసించిపోయేడు. రోజుకొకసారి లేచి కూచోడమూ, మెట్లుదిగి క్రిందకి వెళ్లడమూ, పుస్తకాలు చదువుకుంటూ కాలక్షేపం చెయ్యడం తప్ప ఇప్పుడు ఎవరినీ కలవడం లేదు. అత్యంత ఆత్మీయ మిత్రులతో సంభాషణ కూడా అతనికి అలసట కలిగించి, నొప్పి ఎక్కువచేస్తోంది; అదృష్టవశాత్తూ అతనికి మిత్రుల్ని కలవవలసిన అవసరం లేదు, కారణం, అతనికి ఏ రకమైన విచారమూ, అసహనమూ, వ్యాకులమూ లేవు; అతని సమయాన్ని పుస్తకాలు చదవడంతో బాగానే గడపగలుగుతున్నాడు.”

మరుచటి రోజు నాకు స్వయంగా హ్యూం దగ్గరనుండే ఉత్తరం వచ్చింది. దానిలో ముఖ్య విషయం ఇది:

ఎడింబరో,
ఆగష్టు 23, 1776
ప్రియ మిత్రమా!
నేను ఈ రోజు పక్కమీదనుండి లేవలేకపోవడం వల్ల మా నెవ్యూ* సహాయం తీసుకోవలసి వచ్చింది.
***
నా ఆరోగ్యం త్వరగా క్షీణిస్తోంది. నిన్నరాత్రి నాకు కొంచెం జ్వరం వచ్చింది. అది ఈ సుదీర్ఘమైన వ్యాధికి ముగింపు పలుకుతుందేమోనని ఆశించానుగాని, దురదృష్టవశాత్తూ, అది చాలవరకు తగ్గిపోయింది. ఆ కారణంతో, నన్ను చూడడానికి నువ్విక్కడకి రావడానికి అంగీకరించలేను. ఎందుకంటే నేను నీతో గడపగలిగిన సమయం అతితక్కువ; కానీ, నాకు ఏపాటి శక్తి ఇంకా మిగిలి ఉందన్న విషయం డా. బ్లాక్ తెలియ పరచగలడు. సెలవు.”

మూడు రోజుల తర్వాత డా. బ్లాక్ దగ్గరనుండి ఈ ఉత్తరం వచ్చింది:

ఎడింబరో,
సోమవారం,
26 ఆగష్టు, 1776,

గౌరవనీయులకు,
“నిన్న మధ్యాహ్నం సుమారు 4 గంటలకు హ్యూం పరమపదించేరు. అతనికి మరణం ఆసన్నమైనదన్న విషయం గురు శుక్రవారాల మధ్యలో, అతని అనారోగ్యం బాగా ముదిరిపోయి, ఎప్పుడైతే అతన్ని పక్కమీదనుండికూడా లేవలేనంత బలహీనుణ్ణిచేసిందో అప్పుడే రూఢి అయిపోయింది. అతను చివరిక్షణంవరకు స్పృహలోఉండి, మరణసమయంలో ఏ రకమైన బాధగానీ, కష్టంగానీ పడలేదు. ఏ క్షణంలోనూ సూచనప్రాయంగానైనా అసహనం ప్రదర్శించలేదు; అతను ఎవరితోనైనా మాటాడగలిగే సందర్భం తటస్థించినపుడు, ఎప్పుడూ ప్రేమగానూ ఆప్యాయంగానే మాట్లాడే వాడు. మీరు ఇక్కడికి రావద్దని ఇంతకుముందే అతను మీకు ఉత్తరం రాసి ఉండడం వలన మిమ్మల్ని ఇక్కడకి పిలిపించడం మర్యాద కాదని భావించి మీకు కబురుచెయ్యలేదు. అతను బాగా నీరసించిపోయినపుడు మాటాడడానికి చాలా కష్టపడవలసి వచ్చేది. అతను ఎంత ప్రశాంతమైన చిత్తముతో మరణించేడంటే, అంతకు మించిన స్థితి బహుశా మరొకటి ఉండదు. “

ఆ విధంగా ఉత్తముడూ, ఎన్నడూ మరువశక్యంకాని మన స్నేహితుడు పరమపదించాడు; అతని తాత్త్విక వివేచననీ, అభిప్రాయాలనీ నిస్సందేహంగా మేధావులు చర్చిస్తారు, ప్రతివారూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగానో వ్యతిరేకంగానో ఉండడాన్ని బట్టి వాటిని ఆమోదించడమో, ఖండించడమో చేస్తారు; కానీ, అతని వ్యక్తిత్వంగురించీ అతని శీలంగురించీ ఎక్కడా అభిప్రాయభేదం ఉంటుందని అనుకోను. అతనికి ఎంత ఆత్మనిగ్రహం, భావరాగాలమీద అదుపూ ఉందంటే, మీరేమీ అనుకోనంటే, నా పరిచయస్థులలో ఇంతవరకు ఏ వ్యక్తిలోనూ అవి గమనించలేదు. అతనికి డబ్బుకి కటకటగా ఉన్నప్పుడు కూడా, అతని ఆర్థికపరిస్థితుల్లో అత్యంతావశ్యకమైన ఆ అతిపొదుపరితనం, తగిన సందర్భం వచ్చినపుడు, ఉపకారం చెయ్యడానికీ, దానం చెయ్యడానికీ అడ్డురాలేదు. అతని పొదుపరితనం లోభత్వంవల్ల వచ్చినదిగాక, అతను ఇతరులమీద ఆధారపడకూడదన్న స్వతంత్రేచ్ఛవల్ల వచ్చినది. అతని సుతిమెత్తని స్వభావం అతని మనోస్థైర్యాన్నిగాని, తీసుకున్న కఠిననిర్ణయాలనుగాని ఎన్నడూ సడలించలేదు. మర్యాదా, వినమ్రతతోపాటు ఎప్పుడూ చలాకీగాఉంటూ సరసోక్తులాడే అతని స్వభావం సహజమైనదేగాక ఏ ద్వేషపు ఛాయలూలేని అతని మంచిదనంనుండీ, అతని హాస్యప్రియత్వం నుండీ వచ్చినది; ఆ గుణం వేరెవరిలోనైనా అతితెలివిగా కనిపించి తరచు వెగటు పుట్టించి ఉండేది. అతని పరిహాసాల పరమార్థం ఎన్నడూ ఇతరుల్ని కించపరచడం కాదు; కనుకనే అవి, అతను తరచు పరిహాసమాడిన వ్యక్తులని కూడా, చిన్నబుచ్చుకుని కోపం తెచ్చుకునేట్టు చెయ్యకపోగా, వాళ్ళకికూడా నవ్వుతెప్పించడంలో ఎన్నడూ విఫలం కాలేదు. నిజానికి, అతనికున్న ప్రీతిపాత్రమైన అనేక మంచి గుణాలలో అతనితో సంభాషణని ఇష్టపడేలా చేసేది మరొకటి లేదేమో. సమాజంలో అందరూ ఇష్టపడే అలా ఎప్పుడూ సరదాగా, చలాకీగా ఉండే స్వభావం వెనుక తరచు చపలత్వమూ, మిడిమిడి జ్ఞానమూ కలగలిసి ఉంటాయి; కాని ఇతని విషయంలో అతని విస్తృతమైన అధ్యయనమూ, అత్యంత గంభీరమైన ఆలోచనాశక్తీ, ఏ విషయమైనా పరిపూర్ణంగా ఆకళింపుజేసుకోగల సమర్థతా అనువర్తించి ఉన్నాయి. మొత్తంమీద, అతని జీవితకాలంలోనూ, ఇప్పుడు అతను మనమధ్య లేనప్పుడూ, అతని గురించి నా ఖచ్చితమైన అభిప్రాయం ఒక్కటే: మానవసహజమైన బలహీనతలూ, పరిమితులకీ లోబడి ఒకవ్యక్తి ఎంతవరకు పరిపూర్ణ జ్ఞానవంతుడూ, ఉదాత్తుడూ, గుణవంతుడూ కాగలడో, దానికి అతిచేరువుగా వెళ్ళిన వ్యక్తి అతను.

తమకి ఎప్పుడూ ప్రీతిపాత్రమైన,

ఏడం స్మిత్
————————————————————————————-(*అతనికి ఒక సోదరుడూ ఒక సోదరీ ఉండటంతో ఎవరి కొడుకో తెలియక అనువాదం చెయ్యలేదు)

English: Adam Smith statue in Edinburgh's High...
English: Adam Smith statue in Edinburgh’s High Street with St. Giles High Kirk behind. (Photo credit: Wikipedia)

For the Original Text in English please visit:
http://oll.libertyfund.org/?option=com_staticxt&staticfile=show.php%3Ftitle=704&chapter=137475&layout=html&Itemid=27

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: