పెనుగాలికి నువు బెదురుతావా?… హానిబాల్ హామ్లిన్ గార్లాండ్, అమెరికను కవి
పెనుగాలి తీవ్రతకి నువు భయపడతావా?
మరి సూదులుగుచ్చే వర్షం మాటో?
ఫో! వాటిని ఎదుర్కొని పోరాడు…
మళ్ళీ ఆటవికుడిగా మారు.
తోడేలులా చలికివడకట్టి ఆకలికి అలమటించు!
వెళ్ళు, కొంగలా మొలబంటినీళ్లలోంచి ఈదుకురా!
అప్పుడు నీ అరచేతులు రాటుదేరుతాయి;
నీ బుగ్గలమీది చర్మం కందుతుంది;
నువ్వు అలసి, కరుకుగా, నల్లగా మారుతావు.
అయితేనేం? నువ్వు మనిషిలా తలెత్తుకు నడుస్తావు!
.
హానిబాల్ హామ్లిన్ గార్లాండ్
అమెరికను కవి
కొన్ని కవితలు చదవగానే మనసుని కట్టి పడెస్తాయి. అటువంటి కవితల్లో ఇది ఒకటి. ఇందులో జీవితం గురించి, అందులో పోరాటం యొక్క ఆవశ్యకతగురించి అతి చిన్న కవితలో ఎంతో అందంగా చెప్పాడు కవి హామ్లిన్ గార్లాండ్. రైతు పక్షపాతి అయిన ఇతను, Under The Lion’s Paw అని అచ్చం మనదేశంలో లాగే, కష్టపడి వ్యవసాయం చేసేవాడికి కాకుండా, దళారీలచేతుల్లోకి భూమి ఎలాగపోతోందో చెబుతూ ఒక అద్భుతమైన కథ రాసేడు.
.
