అలా నిలబడు…ఉహూ… కిటికీకి దగ్గరగా…
వాలుబల్లకి పక్కగా… ఆ చిత్తరువు మీద
వెలుగు ఇప్పుడు బాగా పడుతున్నదా? అదిగో,
రాసేటప్పుడు నేనూ దాన్ని అలాగే చూస్తుంటాను.
ఆ ముఖం ఎవరిదో నాకు తెలియదు,
కానీ, అందులో నేర్చుకోవాలన్న తపన కనిపిస్తోంది
సగం విచారంగానూ, సగం హుందాగానూ
చురుకైన చక్కని చూపులతో, ఒత్తైన పొడవాటిజుత్తుతో.
ఆ చిత్రకారుడు ఎవరైతే నాకేమిటి?
అది ఎంత అనామకపు పేరు అయినా ఒకటే;
రేపు ఎవరో అది “వలాస్క్వేజ్”* దని అన్నా ఒక్కటే;
దాని విలువేమీ అమాంతం పెరిగిపోదు.
ఇప్పుడు ఉన్నపళంగా ఎవరైనా దానికి బదులు
మరో అపురూప కళాఖండం ఇస్తామన్నా ఇచ్చేదిలేదు.
అది నాలోనే జీవిస్తూ, నా మనసులోని
ఎనెన్నో రహస్యాలను తనుకూడా విన్నది.
ఎన్నోసార్లు, ఈ చీకటి గూభ్యంలోకి
రాత్రి బాగా అలసిపోయి వచ్చినపుడు
అదే ఎంతో సాదరంగా ఆహ్వానిస్తూ
ఈ పేదకుటీరంలో వెలుగులు నింపేది.
ఎన్నోసార్లు, అనారోగ్యం పాలై, నిద్రపట్టనపుడు
దీపపుప్రమిదెలోని వత్తి వెలుగులు దానిమీద పడి,
నా కలల్లో అవి అలా అలా ఇంకిపోయేదాకా,
వణుకుతున్నట్టు మెరవడం గమనించాను.
గడ్డురోజుల్లో చిక్కుకుని, స్నేహానికి విలువలేదనీ,
అసలు బ్రతుకే నిరర్థకమనీ అనిపించినపుడు,
అదిగో, ఆ వదనంలోని స్నేహపూర్వక మందహాసపు
రుచులే ధైర్యమిచ్చి నన్ను నిలబెట్టినవి.
ఎప్పుడైనా నేను అసహ్యించుకున్నచోటనే
అత్యవసరం పడి తలవంచవలసి వచ్చినపుడు
ఆ తీక్ష్ణమైన కళ్లవెనుక, విచారంతో పాటు,
నా చర్యని గర్హిస్తూ, హెచ్చరించడం గమనించాను.
నా బుర్రలో ఏదైనా ఒక ఊహ మెరిసి, నా చేతులు
అలసేదాకా పనిచేసి ఆ పని సాధించినపుడు,
ఆ లేశమాత్రపుటాలోచన రెక్కలుతొడుగుకుని
కార్యరూపం ధరించేదాకా వీక్షించింది అదే.
నా విజయాలకు సంతసించిందీ అదే,
నిరాశలో కృంగిపోయినపుడు లేవనెత్తిందీ అదే.
నే నెరిగిన ప్రేమాస్పదమైన ఆ జంట కనులు
రాత్రిపగలూ నన్నుకనిపెట్టుకుని కాపాడేయి
నా బొమ్మే నాకొక స్నేహితుడైపోయిందని
ఆశ్చర్యపోతున్నావు కదూ? నిజమే, ఎందుకంటే,
అది నా జీవితపు ప్రథమాంకాన్ని చూసింది
నా చరమాంకాన్ని కూడా చూసి జే కొడుతుంది!
.
ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్
(30th October 1825 – 2nd February 1864)
ఇంగ్లీషు కవయిత్రి.
(Note: * వలాస్క్వేజ్ : Velasquez (baptised June 6, 1599 – August 6, 1660) , a Spanish painter who was the leading artist in the court of King Philip IV)
.
బ్రిటిషు కవయిత్రి, మానవప్రేమి (Philanthropist). 38 ఏళ్ళ వయసులోనే క్షయవ్యాధివల్ల తనువుచాలించిన ప్రాక్టర్, విక్టోరియా మహారాణికి అత్యంత ప్రీతిపాత్రమైన కవయిత్రి. 14 సంవత్సరముల వయసులోనే కలం పట్టిన ప్రాక్టర్ Charles Dickens తో తమ కుటుంబానికి ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకోదలచుకోక, అతని పత్రికలకే మారుపేరుతో కవితలు పంపింది. ఆమె అత్యంత ప్రతిభావంతురాలని Charles Dickens కీర్తించాడు. కవిగా లార్డ్ టెన్నిసన్ తర్వాత స్థానంలో నిలబడగలిగినదంటే, ఆమె ప్రతిభని ఊఒహించుకో వచ్చు. సోషలిస్టు భావాలు కల ఈమె జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉండి, నిరుద్యోగయువతులకోసం, నిరాశ్రయులకోసం కృషిచేసింది. ఈమె కవితలలో మంచి తూగు ఉండి సంగీత బధ్ధం చెయ్యడానికి అనువుగా ఉంటాయి.
.

స్పందించండి