ప్రియతమా! నిన్ను నే మరిచిపోవచ్చు! … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
.
ప్రియతమా! నిన్ను నే మరిచిపోవచ్చు! త్వరలోనే.
కనుక ఉన్న ఈ నాల్గు ఘడియలూ, లేదా నాలుగు రోజులూ,
లేదా మిగిలిన నాలుగు నెలలూ సద్వినియోగం చేసుకో…
నాకు మరుపురావడమో, నేను మరణించడమో,
మనకు ఎడబాటో, మన కథముగియడమో జరిగే లోగా;
అపుడు క్రమక్రమంగా ఇందాకచెప్పినట్టు నిన్ను మరిచిపోతాను.
కాని ఇప్పుడు, నువ్వు నీ అందమైన అబద్ధంతో బ్రతిమాలితే మాత్రం
నేను నా అలవాటైన ఒట్టువేసి మరీ అభ్యంతరం చెబుతాను.
ప్రేమ నిజంగా నాలుగు కాలాలు కొనసాగాలనీ
చేసిన బాసలు మరీ ఇప్పటంత బలహీనం కాకూడదనీ ఆశిస్తాను.
కానీ, అవి అంతే! ప్రకృతి తీరే అంత!! ఇంతవరకు ఆ తీరుకి
ఆటంకం రాకుండా ఉండడానికి ప్రకృతే తంటాలు పడ్డది…
జీవశాస్త్రపరిభాషలో చెప్పాలంటే, మనం కోరుకుంటున్నది
నిరుపయోగమైనదో కాదో మనం తెలుసుకోగలిగినా, లేకున్నా.
.
ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే
(February 22, 1892 – October 19, 1950)
అమెరికను కవయిత్రి
.
ఈ కవితలో ఒక స్పష్టమైన సందేశం ఉంది. మగవాళ్ళు తియ్యని అబద్ధాలు చెబతారని ఆడవాళ్లకి తెలుసు. కాని, వాళ్ళు ఎన్ని అబద్ధాలనయినా ఆనందంగా సహిస్తారు గాని, విశ్వాసఘాతుకం సహించలేరు. అంతే కాదు, మగవారు ఎన్ని ప్రమాణాలు చేసినా, వాళ్ల మనసులూ బలహీనమైనవే, వాళ్ళు వేసే ఒట్లూ (లేదా ప్రమాణాలూ) అంత బలహీనమైనవే అనికూడా తెలుసు. అందుకే, ఇందులో స్త్రీ తన పురుషుడితో చెబుతోంది: “నీ మనసు ఎపుడు పెడత్రోవ పడుతుందో నీకు తెలీదు. అప్పుడు నాకు కోపం రావడమో, నేను మరణించడమో, తెగతెంపులుచేసుకోవడమో ఏదైనా జరగవచ్చు”. దానికి కారణం కూడా ఆమే చెబుతోంది. మనిషి తనకు ఏదో కావాలనుకుని నిత్యమూ వెతుక్కుంటాడు. తనకి అందిన వస్తువులో ముందు ఉందనుకుని భ్రమపడతాడు. అది లేదనుకున్న నాడు తిరిగి అది వెతుక్కునే ప్రయత్నం చెయ్యవచ్చు. అప్పుడే తప్పుదారి పట్టేది. అందుకే ప్రేమ నిత్యం కాదని ఆమె చెప్పింది. అది ప్రకృతి సహజమనికూడా చెబుతోంది ఈమె. కనుక ఆ రోజు రాకముందే జీవితాన్ని సార్థకం చేసుకోమంటోంది. ఇందులో కవయిత్రి మానవ నైజాన్ని సునిశితంగా పరిశీలించడంతో పాటు, ఒక రకమైన నిర్లిప్తత, క్షణికమైనదైనా, జీవితంలో, ఆ క్షణాన్ని సంపూర్ణంగా అనుభవించాలని చెబుతోంది.
.
