కవలలు … రాబర్ట్ విలియం సెర్విస్, ఇంగ్లీషు కవి
పూర్వం జాన్, జేమ్స్ అని ఇద్దరు కవలలుండేవారు
నగరంలో అగ్నిప్రమాదం జరిగి ఇళ్ళుతగలబడుతుంటే
జేమ్స్ ఇల్లు రక్షించడానికి ఆదుర్దాగా పరిగెత్తేడు జాన్,
వెనక్కితిరిగి వస్తే, ఇంకేముంది, తనకొంప తగలడిపోయింది.
.
ప్రపంచ మహా సంగ్రామం ప్రారంభం అయ్యేక
అందులో చురుగ్గాపాల్గోడానికి తనకుతానే వెళ్ళేడు జాన్
అతను… అవయవాలు ఎలా ఎగురుతాయో ప్రత్యక్షంగా చూసేడు,
జేమ్స్ ఇంటిపట్టునే ఉండి, జాన్ ఉద్యోగం కాజేసేడు.
.
జాన్ ఒక అవయవం పోగొట్టుకుని ఇంటికి వచ్చేడు
దానికతను ఏమీ బాధపడినట్టు కనిపించలేదు;
కానీ, అతనికి తలగిరిగినంతపని అయింది మాత్రం
జేమ్స్ తన ప్రియురాల్ని కూడా కాజేసేడని తెలుసుకుని.
.
కాలం గడిచింది. జాన్ బాధ దిగమింగ ప్రయత్నించేడు
ఇప్పుడు నగరం లో సగానికి సగం జాగా జేమ్స్ దే;
అతనికున్న సైనికపరిచయాలు సంపద తెచ్చిపెట్టేయి;
జాన్ సంగతా? అక్కడెక్కడో కుమ్మరిసారెమీద ఉంటాడు చూడండి.
.
రాబర్ట్ విలియం సెర్విస్.
(16 Jan, 1874 – 11th Sept 1958)
ఇంగ్లీషు కవి
.
ఈ కవితలో చాలా పదునైన వ్యంగ్యం ఉంది. ఇది నిజానికి అన్నదమ్ముల కథే కానక్కరలేదు. సమాజంపట్ల నిబద్ధత ఉన్నవాడిదీ, తనూ తనకుటుంబంపట్ల మాత్రమే నిబద్ధత ఉన్నవాడిదీ కావోచ్చు. సేవా తత్పరతతో మడులూ, మాన్యాలూ, దానాలు చేసినవాళ్ళూ, మంచి డబ్బు సంపాదించే తరుణంలో దేశ స్వాతంత్ర్యంకోసం ఉద్యమించి తమ భవిష్యత్తునీ, అండమాన్ లో జీవితాలనీ చాలించినవా రనేకులున్నారు. ఇప్పుడు ఆ మడులూ మాన్యాలూ అనుభవిస్తున్నవారు దానం పొందిన వాళ్ళూ కారు, వాళ్ల వంశీకులూ కారు. అంతెందుకు, ప్రజాప్రయోజనార్థం దేశాధ్యక్షుడు సమీకరించిన అనేకవేల ఎకరాలభూమి రైతులదగ్గరనుండి అయితే పోయింది గానీ, దాన్ని అనుభవిస్తున్న వారు వేరే. జాన్, జేమ్స్ లు ఇక్కడ ఒకతల్లి బిడ్డలు. వాళ్ల ప్రవృత్తులే ఎంత విపరీతంగా ఉన్నాయో చెప్పకనే చెప్పాడు కవి. ఒకడు మంచి చెయ్యకుండా ఉండలేదు. రెండవవాడు చెడుచెయ్యకుండా ఉండలేడు. ఇక మిగతాజనం సంగతి వేరే చెప్పాలా?
.
Robert William Service
Image Courtesy: http://en.wikipedia.org/wiki/