*ధన్వంతరి పుష్పం… వషేల్ లిండ్సే, అమెరికను కవి
తూనీగ తన రెక్కలు సరిచేసుకోవాలనుకున్నా
నత్త తన ఇంటిని మరమ్మత్తు చేసుకోవాలనుకున్నా
పాపం, ఎలుకకూన తను తొడుక్కునే కోటును
చిమ్మటలు కొరికేసినా
ఈ చిన్న ప్రాణులన్నీ వెంటనే పరిగెత్తేది
సూర్యరశ్మితో నవనవలాడే నీలిగడ్డి** కొండలకే
అక్కడ ధన్వంతరి పూలు మైనాన్ని స్రవించడమేగాక
వీటి అనారోగ్యం నయం అయేలా పట్టుబిగిస్తాయి.
అయితే, అలా పట్టునేసి మైనంపూతపూసే వేళ
ఇవి తెలియకుండా నిద్రలోకి జారుకుంటాయి
లేచి కళ్ళుతెరవగానే జీర్ణమైన వాటి వస్త్రాలు
ఒక్క కుట్టుకూడా కనబడకుండా అతకబడి ఉంటాయి.
నా హృదయం ఒక తూనీగ
నా మనసు చిట్టెలుకే, సందేహం లేదు.
నా గుండె తన గులకరాతి ఇంటిలో
అహమికతో మసలే ఒక నత్త
నీ హస్తవాసి అన్నిటినీ నయంచేసే తేనెపట్టు
నీ మాటలు అన్నిటినీ అతకగల సూత్రాలు
నువ్వు నా పాలిట ధన్వంతరి పుష్పానివి
నా మనసు కుదుటపరిచి, నన్ను అదుపుజేయడానికి.
.
వషేల్ లిండ్సే
(November 10, 1879 – December 5, 1931)
అమెరికను కవి
(*Note:
* ధన్వంతరి పుష్పం : కల్పితం. మూలానికి దగ్గరగా ఉంటూ శీర్షిక సులభంగా అర్థం
అవడానికి వాడుకున్న ప్రతీక.
** నీలిగడ్డి : అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలోని మధ్యభాగం నీలిఅంచురేకులగలగడ్డికి
బాగా ప్రసిద్ధిచెందినది. )
.
