కవీ… కోకిలా (కల్పితగాథ)… ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవయిత్రి
ఒకానొక దేశంలో ప్రజలు కవిని చూసి:
“ఫో! మా మధ్యనుండి తక్షణం వెళ్ళిపో!
మేమేదో మా లోకవ్యవహారాలు గూర్చి చర్చిస్తుంటే
నువ్వేమిటి తత్త్వాలంటూ పాటమొదలెడతావు?
అదిగో, ఆ తలవాకిట చూడు నల్లగా
ఒక చక్కని కోకిల కూచుని ఉందే, అది
నీ దిక్కుమాలిన పాటకంటే మా చెవులకి
ఇంపైన సంగీతం వినిపిస్తుంది” అన్నారు.
.
కవి ఏడుచుకుంటూ వెళిపోయాడు…
కోకిల పాడటం ఆపేసింది,
“అరే! కోకిలా! నీకేమయింది?
నీ గొంతులోని మాధుర్యం ఎక్కడికిపోయింది?”
“నేను నా సంసారపక్షపు పాటలు పాడలేను
ప్రక్కన దైవాంశగల్గిన కవి లేకుండా,
అతని అత్యున్నత సంగతులలో కూడ
భూమిమీది అల్ప ప్రాణులు ఉన్నాయి”
.
అలా ఏడుచుకుంటూ వెళ్ళి వెళ్ళి
పరాయి దేశంలో, అనాధగా మరణించాడు కవి.
ఈ పక్షి అతని సమాధిదగ్గరకి ఎగిరి ఎగిరి
రోదిస్తూ, రోదిస్తూ ప్రాణాలు విడిచింది.
నేను ప్రమాణం చేసి చెబుతున్నాను:
నేను మొన్న కొత్తగా అక్కడికి వెళ్ళినపుడు
అక్కడ ఇప్పుడు వినిపిస్తున్న సంగీతం
కోకిలది కాదు; కవి పాటే!
.
ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్
(6 March 1806 – 29 June 1861)
ఇంగ్లీషు కవయిత్రి
.
