తీర్పులొద్దు… ఎడిలేడ్ ఏన్ ప్రాక్టర్, ఇంగ్లీషు కవయిత్రి
ఎవని హృదయమూ, మనసూ ఎలా పనిచేస్తాయో
నీకు తెలియదో అతనిగురించి, నీ తీర్పులొద్దు;
నీ హ్రస్వదృష్టికి వాళ్ళలో కనిపించే మరక,
నీలాంటివాళ్ళు స్పృహతప్పి,లొంగిపోయే పోరాటాలలో
అతను భయంకరంగా పోరాడి గెలిచినపుడు ఏర్పడ్డ
గాయపు మచ్చగా దేవుని తేజో దృష్టికి కనిపించవచ్చు
నీకు చికాకు కలిగించే ఆ చూపులూ, ఆ కనిపించే రీతీ
అవి కేవలం పైపై సంకేతాలు మాత్రమే అయి ఉండొచ్చు;
అతని అంతరాంతరాల్లో ఒక భయంకరమైన శత్రువుతో
ఘోరమైన యుద్ధంలో నిమగ్నమై ఉండొచ్చు;
ఆ శత్రువు చూపులకి నీ నవ్వుముఖం మాడిపోవడమేగాక
గజగజ వణుకుతూ నువ్వు విగ్రహంలా నిల్చుందువేమో!
నువ్వు ఆక్షేపించ సాహసిస్తున్న అతని ఓటమికి,
ఏ దేవదూతో చేయి వదులుగా ఇవ్వడం కారణమవొచ్చు;
బహుశా, రెండోమారు అతను పైకి లేచి, బిగువుగా,
సడలనిపట్టు పట్టుకుంటాడని అతని యోచనేమో!
లేదా, ఈ మానవమాత్రులని నమ్మి, ఆధారపడక
తనరెక్కలనే ఉపయోగించడం నేర్చుకుంటాడనేమో!
ఓడిపోయిన వారిపై తీర్పులు ఇవ్వొద్దు;
నిరీక్షించి చూడు; ఉపేక్షతో కాదు,
అనుకంపతో కూడిన ఆశావహ దృక్పథంతో;
వేదన తీవ్రతకి, పడినలోతు కొలమానం కావొచ్చు.
తర్వాత రోజుల్లో ఈ ఆత్మని దైవానికి చేరవేసేవి
కేవలం ప్రేమా, పోరాటపటిమా మాత్రమే.
.
ఎడిలేడ్ ఏన్ ప్రాక్టర్
(30th October 1825 – 2nd February 1864)
ఇంగ్లీషు కవయిత్రి
మానవప్రేమి (Philanthropist), 38 ఏళ్ళ వయసులోనే క్షయవ్యాధివల్ల తనువుచాలించిన ఎడిలేడ్ ఏన్ ప్రాక్టర్, విక్టోరియా మహారాణికి అత్యంత ప్రీతిపాత్రమైన కవయిత్రి. 14 సంవత్సరముల వయసులోనే కలం పట్టిన ప్రాక్టర్ Charles Dickens తో తమ కుటుంబానికి ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకోదలచుకోక, అతని పత్రికలకే మారుపేరుతో కవితలు పంపింది. ఆమె అత్యంత ప్రతిభావంతురాలని Charles Dickens కీర్తించాడు. కవిగా లార్డ్ టెన్నిసన్ తర్వాత స్థానంలో నిలబడగలిగినదంటే, ఆమె ప్రతిభని ఊఒహించుకో వచ్చు. సోషలిస్టు భావాలు కల ఈమె జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉండి, నిరుద్యోగయువతులకోసం, నిరాశ్రయులకోసం కృషిచేసింది. ఈమె కవితలలో మంచి తూగు ఉండి సంగీత బధ్ధం చెయ్యడానికి అనువుగా ఉంటాయి.
.
