అద్దం… సిల్వియా ప్లాత్, అమెరికను కవయిత్రి.
.
నేను వేలెత్తి లోపం చూపలేని తళతళలాడే ఉపరితలాన్ని
నాకు ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలు లేవు.
నేను దేన్ని చూస్తే దాన్ని తక్షణం స్వీకరిస్తాను, యథాతథంగా.
ద్వేషాభిమానాల పొరలు నన్ను కమ్ముకోవు.
నాకు క్రూరత్వం లేదు, కేవలం నిజాయితీగా ఉంటాను
పాపాయి కనుపాపలా, నాలుగు మూలలతో.
ఎక్కువసమయం ఎదుటిగోడమీదే ధ్యానమగ్నమై ఉంటాను.
అది గులాబిరంగులో ఉంటుంది… అక్కడక్కడ మచ్చలుంటాయి
దాన్ని ఎంతగాపరిశీలించేనంటే అది నా గుండెలో ఒకభాగమైపోయింది.
పదే పదే మమ్మల్ని ముఖాలూ, చీకట్లూ వేరుచేస్తుంటాయి
.
ఇప్పుడు నేనొక సరస్సుని.
ఒక స్త్రీ నా మీదకి వొంగుతుంది.
తనెలా ఉన్నానా అని, నా అంతరాంతరాలని దీక్షగా వెతుకుతూ.
తర్వాత ఆ అబద్ధాలకోరులు, చంద్రుడ్నీ, కొవ్వొత్తుల్నీ ఆశ్రయిస్తుంది
ఆమె నాకు వెన్ను చూపుతుంది. అంత నమ్మకంగానూ ప్రతిఫలిస్తాను.
ఆమె నన్ను కన్నీటితో, వణుకుతున్న చేతులతో సత్కరిస్తుంది.
ఆమెకు నేను చాలా ముఖ్యం. ఆమె వస్తూ పోతూ ఉంటుంది.
ప్రతిఉదయమూ చీకటిని పారద్రోలేది ఆమె ముఖమే.
నాలో ఆమె ఒక పడుచుపిల్లని మునకలేయించితే ;
ఇప్పుడు ఒక్కొక్కరోజు గడుస్తున్నకొద్దీ,
నానుండి ఆమె వైపుకి ఒక ముదుసలి లేచివస్తోంది.
ఒక భయంకరమైన చేపలా.
.
సిల్వియా ప్లాత్
(October 27, 1932 – February 11, 1963)
అమెరికను కవయిత్రి
.
ఈ కవితలో ప్రత్యేకత అద్దం ముందు ఉన్న స్త్రీ ఎవరన్నది వాచ్యం చెయ్యకపోవడం. కాని అది తెలుసుకుందికి వీలుగా అన్ని రకాల సంకేతాలూ ఇవ్వడం…. మొదటి భాగంలో అద్దాన్ని అద్దంగా మాత్రమే చిత్రిస్తే, రెండో భాగంలో దానికీ హృదయముందని చెప్పడం. రసవత్తరమైన భాగాలూ, పదాలూ ఇందులో ఏరుకోవలసినవి చాలా ఉన్నాయి. మొదటి భాగంలో: “నాకు ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలు లేవు; ద్వేషాభిమానాల పొరలు కమ్ముకోవు; పాపాయి కనుపాప; రెండో భాగంలో: ఇపుడు నేనొక సరస్సుని; అబద్ధాలకోరులు చంద్రుడ్నీ, కొవ్వొత్తుల్నీ ఆశ్రయించడం; ఆమెకు నేను చాలా ముఖ్యం; ఆమె పడుచుపిల్ల మునకలేయిస్తే దుసలి రోజురోజుకీ పైకి లేవడం”
.
