మనసుకో విన్నపం … రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి
నేనో చిన్నపాటి పాపం కూడా చెయ్యకూడదా?
ఎందుకు నువ్వు వెంటనే చిత్రగుప్తుడిలా చిఠా రాస్తావు?
ఒక చిన్న తియ్యని పాపం చేస్తాను
నువ్వు చూసీచూడనట్టు ఊరుకోవా?
నే చెయ్యబోయే సున్నితమైన అపరాథం
ఎవరికీ అనుమానం రాకుండా కప్పిపుచ్చుతాను
ఎంత చీకటి తెర వేస్తానంటే, నే చేసే పాపం
నరమానవుడి కంటికి కనిపించదు.
వివేకవంతుల కళ్ళు బహుమతులతో మూసుకుంటాయి,
లంచంతో ఇతర సాక్షుల్ని తూర్పారబట్టవచ్చు,
ఓ నోరులేని నిశిరాత్రి, విశృంఖలంగా తిరగడానికి
నీ పెన్నూ, ఇంకూ పక్కనబెట్టి
ఏమీ రాయకుండా చూడడానికి
బంగారంతో నీ నోరు మూయించలేనా?
.
సాధ్యపడదూ?… సరే. అయితే చేసేదేముంది?
అయితే, ఇకపై తప్పుదారిలో సంచరించనని
భవిష్యత్తుపై ఆనవేసి చెబుతున్నాను. అప్పుడు
నీకుగాని, యమధర్మరాజుకిగాని భయపడక్కరలేదు.
.
రాబర్ట్ హెర్రిక్
(24 August 1591 – buried 15 October 1674)
ఇంగ్లీషు కవి
.
ఈ కవితలో మంచి చమత్కారాలున్నాయి. ముఖ్యమైన విషయం ఇది 17వ శాతాబ్దపు కవి వ్రాసినది. అప్పట్లోనే “వివేకవంతుల కళ్ళు బహుమతులతో మూసుకుంటాయి; సాక్షుల్ని లంచంతో తూర్పారబట్టవచ్చు ” అనడంలో అవినీతికి చాలా వయసుందనీ, అది వయసుతోపాటు బలపడటమే తప్ప బలహీనం కావటం లేదనీ తెలుస్తోంది. అంతేకాదు, బంగారానికి కూడ లొంగని మనసు ఉన్నవాడు అటు యముడికి కూడా భయపడక్కరలేదు అని సందేశాన్నిచాలా సున్నితంగా చెప్పేడు. ఇక్కడ బంగారం ప్రసక్తి చాలా ముఖ్యమైనది. అన్నిప్రలోభాలలోకంటే, బంగారం ప్రలోభం పెద్దది. “మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమోనమః” అన్నది ఊరికే రాలేదు. కన్నతల్లికీ, బిడ్దలకీ శత్రుత్వం తేగల శక్తి బంగారానికి ఉన్నది. ఈ సందర్భంలో కొందరు హిరణ్యం అంటే బంగారం కానక్కరలేదు, ఏ నాణెమైనా కావొచ్చు అనుకోవచ్చు. 1605 వరకూ బ్రిటనులో అంతెందుకు, మనదేశం బ్రిటిషువాళ్ళు పరిపాలించేరోజుల్లో కూడా,బంగారు నాణేలు చలామణీలో ఉండేవి. అది సావెరీను(Sovereign). అందులో 113 వీసాల బంగారం ఉండేదని వికిపీడియా ఉవాచ.
.

.
To His Conscience
.
Can I not sin, but thou wilt be
My private protonotary?
Can I not woo thee, to pass by
A short and sweet iniquity?
I’ll cast a mist and cloud upon
My delicate transgression,
So utter dark, as that no eye
Shall see the hugg’d impiety.
Gifts blind the wise, and bribes do please
And wind all other witnesses;
And wilt not thou with gold be tied,
To lay thy pen and ink aside,
That in the mirk and tongueless night,
Wanton I may, and thou not write?
–It will not be:And therefore, now,
For times to come, I’ll make this vow;
From aberrations to live free:
So I’ll not fear the judge, or thee.
.
Robert Herrick
24 August 1591 – buried 15 October 1674
English poet.
(Poem Courtesy: http://www.eliteskills.com/c/1884)