గొర్రెల కాపరి (2)… ఫెర్నాండో పెసో, పోర్చుగీసు కవి
నా చూపు సూర్యకాంత పుష్పంలా స్వచ్ఛంగా ఉంది
నాకు రోడ్డు మీద వెళుతున్నప్పుడు
కుడిపక్కకీ ఎడమపక్కకీ
అప్పుడప్పుడు వెనక్కీ తిరిగి
చూస్తూ నడవడము అలవాటు
నేను ఎప్పుడు ఏదిచూసినా కొత్తగానూ,
అంతకుమునుపెన్నడూ చూసినట్టనిపించదు
నాకూ వస్తుపరిశీలినలో నేర్పుంది.
అప్పుడే పుట్టిన పాపాయి
తను నిజంగా పుట్టినట్టు తెలుసుకోగలిగితే
ఎంత ఆశ్చర్యపడుతుందో
అంతగా ఆశ్చర్యపడగలను.
నాకు అనుక్షణమూ ఏదో వినూత్నలోకంలో
అప్పుడే పుట్టినట్టు అనిపిస్తుంది
.
నాకు ఈ ప్రపంచం మిధ్య కాదు
అప్పుడే విరిసిన పూవంత నిజం. కారణం,
నేను దాన్ని చూస్తాను తప్ప దాన్ని ఊహించను;
ఊహిస్తున్నామంటే అది అర్థంకాలేదని అర్థం.
ఈ ప్రపంచం మనం అర్థం చేసుకుందికి సృష్టించబడలేదు…
(ఆలోచించడం కళ్ళు సరిగాపనిచేయకపోడానికి సూచిక).
అది ఉన్నది, దాన్ని చూస్తూ దానితో మమేకమవడానికి.
.
నాకే తాత్త్విక దృక్పథం లేదు. ఉన్నవి ఇంద్రియాలు మాత్రమే .
ప్రకృతిగురించి మాటాడితే,అది నాకేదో తెలుసునని కాదు,
నేను దాన్ని ప్రేమిస్తున్నాను గనుక, అంతకుమించి,
ప్రేమిస్తున్న వాళ్ళకి వాళ్ళు దేన్ని ప్రేమిస్తున్నారో,
ఎందుకో, అసలు ప్రేమంటే ఏమిటో తెలియదు గనుక.
.
ప్రేమించడమంటే, జీవితపర్యంతం వీడని అమాయకత్వం,
ఆలోచించకపోవడంలోనే అసలైన అమాయకత్వం ఉంది
.
ఫెర్నాండో పెసో
(June 13, 1888 – November 30, 1935)
పోర్చుగీసుకవి
.
