దేశం అంటే ఏమిటి?… సర్ విలియం జోన్స్, వెల్ష్ కవి
దేశం అంటే ఏమిటి?
ఆకాశానికి చేతులుచాచే భవంతులూ,
ఎత్తైన సైనిక ప్రాకారాలూ, కోటగోడలూ, అగడ్తలూ కాదు;
అందమైన మేడలూ, గోపురాలతో విర్రవీగే మహానగరాలూ,
తుఫానులను కూడా ధిక్కరించి, బలమైన నావికాదళం కవాతుచేసే
పొడుగైన సముద్రతీరాలూ, విశాలమైన ఓడరేవులూ కాదు;
కుసంస్కారుల దిగజారుడుతనం, అహంకారానికి అత్తరులద్దే
చుక్కలు పొదిగినట్టు మెరిసే రాజదర్బారులూ కాదు.
.
కాదు, కాదు, కాదు:
ఏ మనుషులు… ఏ మేధావులు
అడవుల్లో, కొండ గుహల్లో, చెట్టుతొర్రల్లో
అనాగరికంగా బ్రతికిన మనిషికంటే చాలా రెట్లు శక్తిమంతులో,
ఎవరికి వాళ్ళ విద్యుక్త ధర్మాలు తెలియడంతోపాటు
వాళ్ళ హక్కులుకూడా తెలిసి, వాటిని పరిరక్షించుకుంటూ,
వాటిని క్రమక్రమంగా వమ్ముచేయ ప్రయత్నించే నియంతలను
శృంఖలాలు తెంచడంతోపాటే హతమార్చగలరో,
వాళ్ళూ దేశమంటే;
రాజశాశనం అంటే, ప్రజల సమిష్ఠి అభిలాష,
అది సింహాసనాల, భూగోళపు పరిధులుదాటి విస్తరిస్తుంది;
మంచికి పట్టం కట్టి, కీడుని అణిచి మహరాణిలా కూచుంటుంది;
అది నొసలు చిట్లించిందంటే చాలు
దుర్మార్గాలూ, అభిప్రాయభేదాలూ ఉఫ్ అని ఎగిరిపోవలసిందే.
చివరికి మిరిమిట్లుగొలిపే కిరీటమైనా సరే,
అది ఆనతిస్తే, దాని మిరిమిట్లు దాచుకోవలసిందే.
.
ఒకప్పుడు దైవానుగ్రహం వల్ల ఈద్వీపం అలా ఉండేది.
ఇప్పట్లా అబద్ధాలకోరులూ, చాతకానివాళ్లూ కాదు వాళ్ళు
స్వాతంత్ర్యం ఈ నేల మీద మరి చిరునవ్వు నవ్వదా?
ఇక బ్రిటిషర్లు కృశించవలసిందేనా? వీళ్ళు మగవాళ్ళు కాలేరా?
అందరూ ఎప్పుడో ఒకప్పుడు మరణించవలసిందే
గనక సాహసానికి ప్రతిఫలంగా వచ్చే కీర్తిప్రతిష్ఠలని తృణీకరించి,
నీరవమైన సమాధిలోకి, అపకీర్తితో జారుకోవడం చాలా తెలివితక్కువ.
.
సర్ విలియం జోన్స్.
1746 – 1796
ఆంగ్ల కవి.
.
