ఆత్మలేని మనిషి … సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ కవి
ఇది నాది, నా జన్మభూమి అని
ఎన్నడూ తనకు తాను సంభావించుకోని
ఆత్మలేని మనిషి ఒకడక్కడ ఉన్నాడు.
పరాయి నేలలమీద తిరిగి తిరిగి
కాళ్ళు ఇంటిముఖం పట్టినపుడు ఎవరి మనసు
జన్మభూమిని తలుచుకుని పులకరించదు?
వాడిలాంటి మనిషి కనిపిస్తే, జాగ్రత్త;
ఏ జానపద సంగీతమూ అతనికై హోరెత్తదు;
బిరుదులూ,పదవులతో,అతనిపేరు మార్మ్రోగిపోవచ్చు గాక,
కోరికల అవధులకి ధనం పోగుచేసుకుని ఉండవచ్చు గాక;
కానీ, అతని పేరుకీ, అధికారానికీ, ఆ తుచ్ఛుడు
తనకోసం పోగేసుకున్న తుచ్ఛమైన సంపదకీ,
ఉన్నంతకాలమూ మంచిపేరుతెచ్చుకోలేడు సరిగదా,
బ్రతికినన్నాళ్ళూ జీవచ్ఛవంలా బ్రతికి, చివరకి
ఏడ్చేవారూ, గౌరవించేవారూ, కీర్తించేవారూ లేక
ఏ మట్టిలోంచి వచ్చాడో, ఆ మట్టిలోనే కలిసిపోతాడు.
.
సర్ వాల్టర్ స్కాట్.
15 August 1771 – 21 September 1832
స్కాటిష్ కవి, నాటక కర్తా, నవలాకారుడూ
ఈ రోజుల్లో, దేశభక్తి ఒక అనరాని పదమైపోయింది. చరిత్రలో చేసిన తప్పులను తెలుసుకుని, గుణపాఠం నేర్చుకుని, తప్పులని సరిదిద్దుకుంటూ, ఒక పతాకం క్రింద ఐకమత్యంగా, ఒక నాగరికతకి ప్రతిబింబంగా సాగిపోడానికి ఇతరదేశాలు ప్రయత్నిస్తుంటే; చేసినతప్పులనే పునరావృతంచేస్తూ, అధికారయంత్రాంగాన్ని తమచెప్పుచేతలలో పెట్టుకుని, తమ అధికారాన్ని నిస్సిగ్గుగా దుర్వినియోగంచేసి తమకీ, తమ బంధువర్గానికీ దేశసంపదని దోచిపెట్టడానికి ఈ దేశంలో రాజకీయపార్టీలు ప్రయత్నిస్తుంటే, అస్తిత్వవాద సమస్యలతో ప్రజలు పెనుముప్పుగా రాబోతున్న “ఆర్థిక బానిసత్వం” గురించి ఏమాత్రం ఆలోచనలేకుండా, ఎవరి వర్గానికి వాళ్ళు వత్తాసులు పలుకుకుంటూ, జాతికి అస్తిత్వం లేకుండా చేస్తున్నారు.
ఈ కవితలో చెప్పిన మనిషిని పోలిన చాలామంది మనుషులు ప్రస్తుత రాజకీయ ముఖచిత్రంలో కోకొల్లలుగా కనిపిస్తున్నారు. కానీ, వాళ్ళకి కవితలో చెప్పిన ముగింపు ఎక్కడా ఉన్నట్టు కనిపించదు. బ్రతికినంతకాలమూ వాళ్ళకి భజనచేసి, కీర్తించేవాళ్ళేగాక, పోయినతర్వాతకూడ ఆరాధించేవాళ్ళు కనిపిస్తున్నారు. బహుశా, స్కాట్లండు ప్రజల నైతిక చిత్తవృత్తికీ, మన నైతిక ప్రవృత్తికీ హస్తిమశకాంతరం తేడా ఉందేమో!
కొందరికైనా కనువిప్పుకలిగితే ఎంతబాగుణ్ణు.
.

Breathes There the Man
.
Breathes there the man with soul so dead
Who never to himself hath said,
This is my own, my native land!
Whose heart has ne’er within him burned,
As home his footsteps he hath turned
From wandering on a foreign strand?
If such there breathe, go, mark him well;
For him no minstrel raptures swell;
High though his titles, proud his name,
Boundless his wealth as wish can claim,
Despite those titles, power, and pelf,
The wretch, concentred all in self,
Living, shall forfeit fair renown,
And, doubly dying, shall go down
To the vile dust from whence he sprung,
Unwept, unhonored, and unsung .
.
Sir Walter Scott
15 August 1771 – 21 September 1832
Scottish Poet, Novelist, and Playwright.
Related articles
- Celebrating Scotland: St Andrew’s Day (oup.com)