విడిపోవడం కష్టసాధ్యం … మైకేల్ డ్రేటన్, ఇంగ్లీషు కవి
వేరే మార్గం లేదు గనుక, దా, మనిద్దరం ముద్దుముద్దుగానే విడిపోదాం
లాభం లేదు, నేను విసిగిపోయాను, నన్నిక నువ్వుచూడడం కుదరదు.
నాకు సంతోషంగా ఉంది, నిజం, మనసుకి చాలా హాయిగా ఉంది
ఇలా ఇంత నిర్మలంగా నేను విముక్తుడిని అవుతున్నందుకు.
కడపటిసారి చేతులు కలుపుకుందాం, ప్రమాణాలు గట్టుమీదపెడదాం,
భవిష్యత్తులో ఎప్పుడైనా కలుసుకోవడం తటస్థిస్తే,
మనిద్దరిలో ఏ ఒక్కరూ మన పూర్వపు ప్రేమఛాయలు
లేశమైనా మనిద్దరి కనుబొమలలో మిగలనీవద్దు.
“ప్రేమ” ఇపుడు ఎగవూపిరితో చివరిశ్వాశకై పాకులాడుతూ,
దాని నాడి దొరకక, అనురాగానికి మాటపడిపోయి
నమ్మకం ఆశ చావక మరణశయ్యనానుకుని కూర్చుండగా,
అమాయకత్వం కళ్ళు మూసుకుపోతున్నప్పుడు…
అందరూ లాభంలేదని పెదవి విరిచేస్తే, ఒక్క నువ్వు మాత్రమే
ఇప్పటికీ, తలుచుకుంటే, దానికి ప్రాణదానం చెయ్యగలవు.
.
మైకేల్ డ్రేటన్,
1563 – 23 December 1631
ఇంగ్లీషు కవి.
.
