గత సంవత్సరం… జాన్ క్లేర్, ఇంగ్లండు
బ్లాగ్మిత్రులకి, సందర్శకులకీ
2013 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కొత్త సంవత్సరం మీకూ మీ కుటుంబానికీ
ఆయురారోగ్యైశ్వర్యానందసందోహాల్ని కొనితెచ్చుగాక
అని మనఃపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను.
.
పాత సంవత్సరం వెళ్ళిపోయింది…
చీకటిలోకి… శూన్యం లోకి:
ఇక పగలు ఎంత వెతికినా కనిపించదు
రాత్రి దాని సంగతి ఎవరూ చెప్పరు.
అది దాని అడుగుజాడలు గాని, గుర్తులుగాని,
వెలుగునీడల చిరునామా గాని వదలలేదు.
క్రిందటేడు పక్కింటివాళ్ల పోలిక లుండేవి దానికి
ఈ ఏడు అదంటే అందరూ తెల్లమొహం వేస్తారు.
.
కనిపించేదంతా ఆశాశ్వతమే:
ఉషోదయంలో గమనించే తుషారాలకి
ఉన్నంతసేపైనా అంతకంటే ప్రస్ఫుటమైన ఆకృతీ,
దానికంటే ఇంద్రియగోచరమైన పదార్థమూ ఉంటాయి.
ప్రతి చలిమంటదగ్గరా, గుడిశలోనూ,
ప్రతి సమావేశంలోనూ అందరికీ ఆత్మీయ వ్యక్తే
మనసారా అందరూ కోరుకునే అతిథే
పాపం, ఇప్పుడు మాత్రం ఎవ్వరికీ ఏమీ కాదు.
.
పారేసిన కాగితాలు గాని
ప్రక్కకు తోసేసిన పాత బట్టలుగాని
నిన్న మనం మాటాడుకున్న మాటలు గాని
మళ్ళీ మనం గుర్తుపట్టగలిగినవి;
కాని, కాలం ఒకసారి తొలగిపోయిందా
ఎవ్వరూ దాన్ని వెనక్కి పిలవలేరు
కొత్త సంవత్సరము ముంగిట్లో
పాతది అందరూ దాన్ని శాశ్వతంగా కోల్పోయారు.
.
జాన్ క్లేర్.
ఇంగ్లండు
.
