ఏమా తెరలు తెరలుగా దిగి వ్యాపించే పొగమబ్బు దొంతరలు !
ఈ శిశిరఋతు పొద్దు, రంగులకై తపిస్తూ
నీ పండుతోపులు తీపుతోవాలి పరితపిస్తున్నాయి;
ఆ కాటుకకొండ తన వాలు కప్పిపుచ్చుకుందికీ
ఆ శుష్కించిన మోడు చిగురించడానికీ ఆరాటపడుతున్నై;
ఓ ప్రకృతీ! పుడమితల్లీ! నీనింతకంటే చేరువకాలేకున్నానే!
.
ఇక్కడి సౌందర్యాలగురించి ఎప్పటినుండో తెలుసు
కానీ,ఇవి ఇంత సుందరంగా ఉంటాయని ఊహించలేదు!
ఎంత పట్టరాని వ్యామోహం కలుగుతోందంటే,
అది నన్ను నిలువునా చీరేస్తోంది.
ప్రభూ!
ఈ ఏడు ప్రకృతిని మరీ ఇంత అందంగా మలిచేవేమి స్వామీ!
.
నాలోంచి నా ఆత్మ ఎగసి పోతోందా అని అనిపిస్తోంది. … ష్!
ఏ పండుటాకునీ రాలనీవద్దు! దయచేసి ఏ పికమూ పాడవద్దు!
.
ఎడ్నా విన్సెంట్ మిలే
(February 22, 1892 – October 19, 1950)
అమెరికను కవయిత్రి, నాటకకర్తా, స్త్రీవాద రచయిత్రి
అమెరికను సాహిత్యంలో అపురూపమైన కవయిత్రులలో మిలే ఒకరు. ఆమె తల్లి ఆర్థిక నియంత్రణలేని భర్తనుండి వేరుపడి, ముగ్గురు కూతుళ్ల బాధ్యతా తీసుకుని ఊరూరూ తిరుగుతున్నా, ఆమె సాహిత్యంపట్ల ఉన్న మక్కువతో షేక్స్పియర్ నీ, మిల్టన్ నీ కూడా తీసుకువెళ్ళేది, పిల్లలకి స్వయంగా చదివి వినిపించేది. ప్రగాఢమైన స్వాతంత్రేచ్ఛా, స్త్రీవాద దృక్పధమూ బహుశా అంత గుండెదిటవుతో తమని పోషించిన తల్లినుండి గ్రహించి ఉండవచ్చు. ఈమె పులిట్జరు బహుమతి గెలిచిన (అప్పటికి) మూడవ మహిళ.
రసహృదయము ఉండాలే గానీ, ప్రకృతిని మించిన సౌందర్యమూ, మత్తూ, భగవత్స్వరూపమూ, ఆనంద వార్నిధీ ఎక్కడ ఉంటుంది? అందులో లీనమయితే, మనల్ని మనం మరిచిపోవడమే కాదు, ఆ అపూర్వక్షణాన్ని అనుభవిస్తూ, ఈ సృష్టికి కారణభూతమైన శక్తిగురించి ఊహించి తన్మయత్వంపొందకుండా ఉండలేము. ఎడ్నా విన్సెంట్ మిలే ఎంత అద్భుతంగా ఆ క్షణాన్ని వర్ణించిందో చూడండి…