ఆతిథ్యం… క్రిస్టినా రోజెటి
.
నేను మరణించిన తర్వాత నా ఆత్మ
ఎంతోకాలం నే మసలిన ఇల్లుచూడాలని వెళ్ళింది
నేను ప్రాకారందాటి, నా మిత్రులందరూ పెరట్లో
ఆకుపచ్చని నారింజచెట్లనీడన విందారగించడం చూసేను.
ఒకరిచేతినుండి ఒకరికి మధుపాత్ర మారుతోంది;
పళ్లలోని రసాన్ని చప్పరిస్తూ ఆస్వాదిస్తున్నారు.
నవ్వుతూ, పాడుతూ, పరాచికాలాడుకుంటున్నారు,
అవును మరి, ప్రతివారికీ తక్కినవాళ్లంటే ప్రేమ.
.
కపటంలేని వాళ్ళ మాటలు వింటున్నా:
ఒకరన్నారు:”రేపు మనం సముద్రతీరం వెంబడి
మైళ్లకి మైళ్ళు, ఒక దారీ తెన్నూ లేని
ఇసకతిన్నెలమీద కాళ్ళీడ్చుకుంటూ నడవాలి.”
మరొకరు:” రేపు సముద్రానికి పోటువచ్చేలోగా
మనం అనుకున్న చోటుకి చేరుకుంటాం.”
ఇంకొకరు: “రేపుకూడా ఇవాళ్టిలాగే ఉంటుంది
కానీ, ఇంతకంటే బాగుంటుంది.”
.
“రేపు” గురించి అందరూ, ఎంతో ఆశగా,
ఎంతో కమ్మగా ఊహిస్తూ మాటాడుకున్నారు;
“రేపు” గూర్చి వీరూవారనకుండా అందరూ, మాటాడేరు
గాని, నిన్నటి ఊసు ఎవరూ ఎత్తలేదు.
మధ్యాహ్నానికి వాళ్ళలో మళ్ళీ జీవకళ తొణికిసలాడింది,
నేను, నేనొక్కతెనే, అక్కడ మరణించింది:
“ఇవాళా, రేపూ” అని అని పలవరిస్తున్నారు వాళ్ళు;
నేనేకదా నిన్నటికి చెందినదాన్ని.
.
చాలా ఇబ్బందిగా కదిలేను; కానీ,
వాళ్ళపట్ల నాకు ఎలాంటి ఉదాసీనత కలగలేదు;
అందరూ మరిచిపోయిన నాకు వణుకొచ్చింది,
ఉండాలంటే విచారం వేసింది,
కానీ వదిలివెళ్ళాలన్నా ఎంత అయిష్టత;
ప్రేమకి దూరమయిన నేను
పరిచయమైన గది విడిచి వచ్చేను…
ఒక్కరోజు ఉండి వెళ్ళిన అతిథి మిగిల్చిన జ్ఞాపకంలా.
.
క్రిస్టినా రోజెటి,
(December 5, 1830 – December 29, 1894)
ఇంగ్లీషు కవయిత్రి
విశ్వనాథ సత్యనారాయనగారు కొండవీటి పొగమబ్బులు అన్న ఖండకావ్యంలో ఒక చోట కొండవీటి పొగమబ్బుల్ని వర్ణిస్తూ: “ఆశవోవక నిగుడు ప్రేతాత్మల వలె” అని అంటారు. కవయిత్రి అటువంటి ఒక చక్కని ఊహను పట్టుకుని ఎంత హృద్యమైన కవిత అల్లిందో చూడండి. మనం మనగురించీ, మనం సాధించినవాటి గురించీ చాలా ఎక్కువ అంచనాలు వేసుకుని, మనం పోయినతర్వాత అందరూ ఏదో గొప్పగా చెప్పుకుంటారనో తలుచుకుంటారనో రకరకాల అపోహలలో ఉంటూ ఉంటాం. అవన్నీ అపోహలే, కాలమూ ఆగదు, జీవితాలూ ఆగవు అని వాచ్యం చెయ్యకుండా రసవత్తరమైన భావాన్ని ప్రకటించింది క్రిస్టినా. Pre-Raphaelite Brotherhood లో ఆమెకు అధికారిక సభ్యురాలుగా గుర్తింపులేకున్నా, ఆ ఉద్యమస్ఫూర్తితో ఆమె చక్కని కవిత్వం వెలయించింది. నిజానికి 19వ శతాబ్దపు ఆంగ్ల కవయిత్రులలో ముందువరుసలో గణింపవలసిన కవయిత్రి ఆమె.
.
