జ్ఞానోదయం .. సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
అవి వసంతకాలపు తొలిరాత్రులు
హేమంతపు మత్తు నిదర ఇంకా వదల్లేదు
మా చుట్టూ ఉన్న నీడలూ, గాలీ
మేము మాట్లాడుకోని మాటలకి చెవులురిక్కిస్తున్నాయి.
పది సంవత్సరాలు దొర్లిపోయాయి గాని
వసంతం ఇప్పుడూ అప్పటంతవాడిగానే ఉంది
మళ్ళీ మొదలుపెట్టాల్సి వస్తే
అప్పుడు చేసినవే మళ్ళీ మళ్ళీ చేస్తాం
ఎదురుచూసిన వసంతం అయితే ఎన్నడూ రాలేదు
కాని, అదేమిటో తెలుసుకోగలిగినంత జీవితం గడిచిపోయింది
మనకి లేనిది ఎప్పుడూ లేకుండానే మిగిలిపోతుంది,
మనకున్న వస్తువుల్నే మనం పోగొట్టుకునేది.
.
.
సారా టీజ్డేల్
అమెరికను కవయిత్రి
.
మాటలని పొదుపుగా వాడి, ఒక్కొక్కసారి ఏ రకమైన ప్రతీకలూ వాడకుండానే, చెప్పవలసిన భావాన్ని పాఠకుడికి అందజెయ్యగలగడంలో సారా టీజ్డేల్ ఆరితేరిన కవయిత్రి. ఇక్కడ మూడే మూడుపాదాల కవితలో వ్యక్తులమధ్య నెమ్మదిగా ప్రవేశించే అసంతృప్తీ, ఎడబాటూ; చివరి పాదంలో అద్భుతమైన సత్యాన్నీ, మనసులోని బాధనీ ఎంత అందంగా వ్యక్తీకరించిందో గమనించవచ్చు.
.
