చీకట్లో నీడలు … యుజీన్ ఫీల్డ్, అమెరికను కవి
.
నాకు పాములన్నా, కప్పలన్నా, పురుగులన్నా, క్రిములన్నా, ఎలుకలన్నా
ఆడపిల్లలు జడుసుకేనేవి ఏవన్నా భయం లేదు; అవెంతో మంచివి.
నాకు తెలిసి నేను మహాధైర్యవంతుణ్ణి; అయితే పక్క ఎక్కాలంటేనే చికాకు
ఎందుకంటే, నా ప్రార్థనలు చదువుకుని, దుప్పట్లో వెచ్చగా ఒదిగిపోగానే
అమ్మ “కమ్మగా పడుక్కో” అని చెప్పి దీపం తీసేస్తుంది, రాత్రి చీకట్లో
నన్నొకడినే పడుకోమని వదిలేస్తుంది, ఏవేవో ఆకారాలు కనిపిస్తుంటే.
ఒక్కోసారి అవి గది మూలనీ, మరోసారి తలుపువెనకా నక్కి ఉంటాయి;
ఇంకొక్కసారి గది మధ్యలో నేలమీద అన్నీ నిలుచుంటాయి,
లేదా అన్నీ మఠంవేసుకు కూర్చుంటాయి, లేపోతే తిరుగుతూ ఉంటాయి
ఎంత నెమ్మదిగా పాకురుతుంటాయంటే ఒక్క పిసరు చప్పుడు చెయ్యవు.
ఒకసారి అన్నీ సిరాలా నల్లగానూ, మరోసారి అన్నీ తెల్లగానూ—
రాత్రిపూట అలా కనిపిస్తూ ఉంటే, ఏ రంగు అయితే నేమిటి?
ఓ రోజు మా వీధిలో ఎవడో వెళుతుంటే వాణ్ణి కొట్టేనని
ఆ రాత్రి నాకు తిండిపెట్టకుండా నాన్న పక్కమీదికి తగిలేసేరు,
అర్థరాత్రి నేను లేచి చూద్దును: అవన్నీ వరసగా నిలుచున్నాయి,
మెల్లకన్నుపెట్టి నా వంక జాలిగా చూస్తున్నట్టు — అనిపించింది.
ఓరి నాయనో! ఎంత భయమేసిందంటే రాత్రి కన్ను రెప్ప పడలేదు…
నేను ఏరోజు పెంకితనం చేస్తే ఆరోజురాత్రి అలాగే కనిపిస్తుంటాయి.
అదృష్టంకొద్దీ నేను ఆడపిల్లని కాదు; లేకుంటే భయంతో హడలి చద్దును!
మొగపిల్లడిని గనక ఊపిరి గట్టిగా బిగబట్టి దుప్పట్లో తల దాచుకుంటాను.
నిజమే, నేను చాలా పెంకివాణ్ణి. అయితే, ఇకమీదటనుండీ
మంచిగా ఉంటానని ఒట్టు వేసుకుని,నా ప్రార్థనలు చదువుకుంటాను.
అమ్మమ్మ చెప్పుతుంటుంది: అల్లరి పిల్లలకి రాత్రిపూట ఏవేవో
కనిపిస్తున్నాయంటే, దాన్ని చక్కదిద్దుకునే మార్గం అదొక్కటేనని.
ఇకమీదట మిగతా అల్లరి పిల్లలు ఎవరైనా పెంకితనం చెయ్యడానికి
నన్ను రేపెడితే, నా ఉబలాటాన్ని మనసులో అణుచుకుంటాను;
రాత్రి భోజనంలోకి మంచి మంచి అప్పాలూ, పెద్దపెద్ద కేకులులాంటివుంటే
నాకు అడగాలనిపించినా, ఎవరినీ అడగడానికి రెండోసారి కంచం జాచను,
పోతే పోనీ, ఆకలి వేసి వేసి … నెమ్మదిగా చచ్చిపోవడం ఉత్తమం
బతికి ఉంటూ అలా రాత్రిపూట ఏవేవో చూస్తూ ఉండడం కంటే!
.
యుజీన్ ఫీల్డ్
September 2, 1850 – November 4, 1895
అమెరికను కవి.
ఈ కవిత చిన్నపిల్లల మనస్తత్వాన్ని చాలా బాగా ఆవిష్కరిస్తుంది. అందులో మగపిల్లలకి తాము ఆడపిల్లలకంటే ధైర్యవంతులమనో, అలా ఉండాలనో పెద్దవాళ్ళు అనుకోవడమో, చెప్పడమో, మనసులో నాటుకున్నప్పుడు, దానికి వ్యతిరేకమైన సందర్భాలు తటస్థించినపుడు వాళ్ళని వాళ్లు సముదాయించుకుందికి చేసుకునే ప్రయత్నాన్నీ, వాళ్ల మానసిక సంఘర్షణనీ కవి హాస్యస్ఫోరకంగా చిత్రించేడు. ఈ కవిత మగపిల్లలలో Male chauvinism కిసంబంధించి బీజాలు ఎప్పుడు ఎలా నాటుకుంటాయో చెప్పకపోయినా, వాటి ప్రభావం ఎలా పనిచేస్తుందో తెలుపుతోంది.
.
