అనువాదలహరి

Begum Akhtar (Part 1) … Samala Sadasiva

మతాన్నీ, విశ్వాసాల్నీ జీవనమార్గంగా అనువదించుకుని, హిందూ-ముస్లిం సఖ్యతకూ, పాలూ నీళ్లలా కలగలిసిన సంస్కృతీ వారసత్వాలకు నిలువెత్తు నిదర్శనాలుగా, మనకు మార్గదర్శకులుగా  మనకళ్ళెదుటే ఉదాత్తమైన వ్యక్తిత్వాల్ని కనబరుస్తూ,సహజీవనాన్ని సాగించిన అద్భుతమైన వ్యక్తులు కొద్దికాలంక్రిందట ఈ నేలమీద నడిచేరు.  సంగీతమూ, సాహిత్యమూ భాషా ఒక మతానికో ప్రాంతానికో చెందినవని కాకుండా, అవి ఈ దేశ సంపదగా భావించి వాటిలోని స్వారస్యాన్ని గ్రహించి ఆనందించిన ఒక  జీవన ప్రక్రియ ఈ గడ్దమీద నిలిచింది. అటువంటి సంఘీభావం మధ్య కొయ్యలు దిగ్గొట్టి వేరుచేసిన / చేస్తున్న నేటి రాజకీయ పరిస్థితి చూస్తుంటే, శ్రీశ్రీ చెప్పిన “ఏవి తల్లీ నిరుడుకురిసిన హిమ సమూహములు” అన్న బాధ మనసులో కలుక్కు మనక మానదు. సామల సదాశివగారు అత్యద్భుతంగా ఆవిష్కరించిన అటువంటి జీవిత చిత్రాలలో, కొన్ని తరాల యువకుల్ని తన వ్యక్తిత్వ,గాన,రూపలావణ్యాలతో అలరించి వెర్రివాళ్లను చేసి సంగీతానికి మతం లేదని చాటిచెప్పిన అపూర్వ ఘజల్ గాయని బేగం అఖ్తర్.

ఆమె జీవితంలో మనం నేర్చుకోగలిగిన గుణపాఠాలు ఎన్నో ఉన్నాయి. అవధరించండి:

.

In her youthful days Begum Akhtar really drove many people mad with her Ghazal  

Deewaanaa banaanaa haitO deevaanaa banaanaa dE  

(Drive me crazy if you so wish…).

Written by Bejaad Lakhnavi, this Ghazal belongs to Sufi tradition. So there was no hyperbole when it was said that the Ghazal drove the worshippers of love crazy. Love in the Sufi tradition is of two kinds… one is “Ishk e Majaaji”, the temporal love and the other is Ishk e Hakiiki, the eternal love. Temporal love is a means to achieve the eternal. So, these kinds of Ghazals always attracted the attention of the youth and the old alike. The listeners experience a kind of bliss. That state of experiencing bliss is the craziness the Ghazal speaks of.

That Ghazal is still capable of driving youth crazy even today. But the times when she rendered this Ghazal she was not Begum Akhtar; she was Akhtaribai Faizabadi. As Akhtaribai she sang many immortal Thumries, Dadras, Kajries, and Chaities.

She became Begum Akhtar after her Nikah with the rich bar-at-law from Lucknow having roaring practice, Ishtiaq Ahmed Abbasi.

As Begum Akhtar she rendered more Ghazals than Thumries and Dadras. She has a unique style in singing of Ghazals. In her sunset days Begum Akhtar made scores of discerning listeners cry with her Ghazal:

Aye Mohabbat  tere Anjaam pe Rona Aaya” (Oh, You Love! Your consequences make me cry!).

When I said she made people cry, it may sound strange to some people. But people with fine sensibilities weep when they listen  touching words or a touching song. In music parlance those people are called “Dardees” Dardees are the people who can feel the pain. All of us are “Dardees” if we can discern the fine pain in either literature or music. Here is a small anecdote:

Maharaja of Mehamoodabad had invited all the reputed artistes of his time on the occasion of the marriage of his son Mohammad Ahmad Hasan Khan. Those days, the famous singers were not within the reach of gramophone companies or the Programme Executives of AIR stations, but thought it prestigious to sing in the courts of the kings. That night great stalwarts like Jaddanbai (Mother of Nargis), Rasoolanbai had performed. Bigganbai’s turn came as the day was about to break. She sang a Ghazal in Rag Bhairavi. Every stanza of the Ghazal touched the heart of the listeners straight. And her style of sweet rendering added to its beauty. The handkerchiefs of the invitees were dripping with tears. And the discerning music lovers began referring that night as “tar rumaalomki raat” (Night of wet handkerchiefs.)

I narrated this event to substantiate that music has the ability to make you cry.

Akhtaribai was the highest paid artiste those days. The beauty of her person, the refined and tasteful Lucknow civility, and her witty conversation reflecting her culture; and above all, her straining voice in the high octaves which in any other person might have been a blemish but in her it was an asset, added to enhance her value.

Her fans would say the harmony of her notes was only in the realm of experience and not in expression. Purushottam Lakshman Des Pande was not only a music lover with refined taste, but was also a very good writer. He once said: “as her notes meet the ear, the legs cease to walk, the active hands become still, and the blubbering mouth becomes mute.” And another writer of equal stature, Kishansing Chavda said: “even the musically deaf shall stand still the moment her notes enter their ears.”

Her manner commanded for respect from everybody. However great they were, and how much ever they had paid for her, nobody dared to cross the limits of decency with her. And if anybody tried to do, she was so adept in smoothly wriggling out of such situations with a friendly censure keeping her respect unblemished.

The second son of Hyderabad Nizam, Prince Moazzamjahi, was a patron of arts and literature. His court was always teeming with artistes. He once invited Akhtaribai for one week programme in his court. Akhataribai noticed the state of affairs at that place were not to her taste on the first day itself. So without even taking leave from the Prince, she packed up her luggage and left the place the following day. The Prince sent Jewelry for seven days of the week, seven valuable saris and the contract amount for the seven days programme with his secretary to the Nampally Station. Noted court poet Sidq Jaisi mentioned this in his “Darbar- e-durbar”, a chronicle of the Prince’s Darbar. But he never mentioned whether she accepted them or rejected them; after all, the court poet’s intention in recording this incident was more to highlight the generosity of his Prince rather than the self-respect of Akhtaribai!

It was a custom those days with all wealthy families to invite reputed Baijees and arrange mujras whenever there was a function in their households. Thus once a Zamindar in Punjab arranged a mujra by Aktaribai on the occasion of some auspicious function at his home. All the invitees were enraptured by her performance. As per the custom she was handed over a bag containing thousand Victoria Coins. She handed it over to someone in her retinue. “Baijee! There are thousand Victoria coins in that, you forgot to count,” said the Zamindar. The tone of the Zamindar had a smack of arrogance. She hated that. Politely saying “Hujur!” she raised her both hands and said, “The amulets of these hands value above sixty thousand and you are witnessing the jewelry on my person. I don’t know the value of the jewelry at my home. By your grace, there is no dearth of money. Where is the time for me to count these coins?” and left the place.

Not that she behaved with everybody like this. Whenever the ‘King of Aesthetics’ Ramu Bhayya Date visited her house, she was so delighted as if God himself had visited her house, and attended to every detail, customary to Lucknowites while playing host, sang him his favorite cheeses before seeing him off. He was an officer in the then government and  a resident of Indore . His knowledge of music was unsurpassed. All the artistes yearned for his attention when they sang. It was they who conferred him the title ‘King of Aesthetics’. He had great love for Akhtaribai’s music. He used to call the jarda pills he took in his pan as ‘Akhtar pills’. And whenever he followed the musicians of his liking on a musical tour, he used his car named “Akhtari”.

(continued)

.

బేగంఅఖ్తర్ … సామల సదాశివ 

(మలయ మారుతాలు” నుండి)

. Part 1

బేగంఅఖ్తర్ పడుచునాళ్ళలో “దీవానా బనానా హై తో దీవానా బనాదే” అనే గజల్ ద్వారా ఎందరినో దీవానాలను చేసింది. బెహ్జాద్ లఖ్నవీ రచించిన ఆ గజల్ సూఫీ సంప్రదాయానికి చెందింది. కాబట్టి అది ప్రేమోపాసకులందరిని దీవానాలుగా చేసిందనటం అతిశయోక్తి కాదు. సూఫీ సంప్రదాయంలో ప్రేమ ద్వివిధము. ఒకటి “ఈష్కే మజాజి” అంటే ఐహిక ప్రేమ; రెండవది “ఇష్కే హఖీఖి” అంటే ఈశ్వర ప్రేమ. ఈశ్వరప్రేమకు ఐహికప్రేమ ఆధారం. ఇలాంటి గజళ్ళను యువకులెంత ఉత్సాహంగా వింటారో భక్తిభావంగల పెద్దలూ అంతే ఉత్సాహంగా వింటారు. పరవశులౌతారు. పరవశమే దీవాన్గీ.

“దీవానా బనానా హై తో దీవానా బనాదే” అనే గజల్ ఇప్పటికీ శ్రోతలను ప్రణయపరవశులనుచేసే సామర్థ్యం గలది. ఈ గజల్ పాడిన కాలంలో అమె బేగంఅఖ్తర్ కాదు. అక్తరీబాయి ఫైజాబాది. అఖ్తరీబాయిగా ఆమె చిరస్మరణీయమైన ఠుమ్రీలు, దాద్రాలు, హూరీలు, కజ్రీలు, చైతీలు అనేకం పాడింది.

లఖ్నోలో మాంచి ప్రాక్టీసుగల సంపన్నుడు బారిస్టర్ ఇస్తేయాఖ్ అబ్బాసితో నికాహ్ జరిగిన తర్వాత ఆమె బేగం అఖ్తర్ అయింది.

బేగం అఖ్తర్ గా అమె ఠుమ్రీ, దాద్రాలు స్వల్పం గానూ, గజళ్ళు అధికం గానూ పాడింది. గజల్ గాయనంలో ఆమె శైలి విశిష్టమైనది.  బేగంఅఖ్తర్ వార్థక్యంలో “ఆయ్ మొహబ్బత్ తెరె అంజాంపె రోనా ఆయా” అనే గజల్ పాడి అశేష రసిక జనానీకాన్ని ఏడిపించింది. ఏడిపించడం అన్నమాట కొందరికి వింతగా తోచవచ్చు.  కానీ మనసున్నవాళ్ళు మనసును కదిలించే మాటవిన్నా, పాటవిన్నా ఏడుస్తారు. అలాంటివాళ్ళను సంగీత పరిభాషలో “దర్దీలు” అంటారు. దర్ద్ కలవాళ్ళు దర్దీలు. అంటే బాధ తెలిసినవాళ్ళు. మనందరం దర్దీలమే… సంగీతసాహిత్య రసికులమైతే.

ఇకడొక ముచ్చట. మహరాజా అఫ్ మెహమూదాబాద్ కుమారుడు మహమ్మద్  అహమ్మద్ హసన్ ఖాన్ వివాహ సందర్భాన రాజాసాహెబ్ దేశంలోని ప్రఖ్యాత గాయనీగాయకులని ఆహ్వానించాడు. అనాటి గాయనీగాయకులు గ్రామఫోన్ కంపెనీ వాళ్ళకూ, రేడియో స్టేషన్ల వాళ్ళకూ ఒక పట్టాన దొరికేవాళ్ళు కారు. కానీ రాజప్రాసాదాల్లో పాడటం ప్రతిష్ఠాకరం అని భావించేవాళ్ళు. ఆనాటి సభలో బాయీ జద్దన్ బాయి (నర్గీస్ తల్లి)  రసూలన్ బాయి లాంటి హేమాహేమీలంతా పాడినారు. తెల్లవారు ఝామున లఖ్నోకుచెందిన బిగ్గన్ బాయి భైరవీ రాగంలో గజల్ పాడింది. ఒక్కొక్క చరణం గుండెకు సూటిగా గుచ్చుకునేది. అందుకు తగిన ఆమె మధుర గాయన శైలి. ఆహూతులైన పెద్దలందరి జేబురుమాళ్ళూ అశ్రువులతో తడిసిపోయినవి.   “తర్ రుమాలోం కీ రాత్” (తడిసిన జేబురుమాళ్ళరాత్రి)”గా ఆరాత్రిని సంగీతరసికులు చాలాకాలం స్మరించుకున్నారు.

సంగీతంలో ఏడిపించే శక్తి ఉందని చెప్పడానికి ఈ ముచ్చట  చెప్పినాను.

ఆ రోజుల్లో అందరికంటే విలువైన కళాకారిణి అఖ్తరీబాయి. ఆమె రూప లావణ్యం, మధురమైన లఖ్నవీ మర్యాద, సంస్కారం వుట్టిపడే చతుర సంభాషణ, అన్నిటికి మించి, ఆమె కంఠం పై సప్తకాలలో ఎక్కడో పగులువారి జీర వోయేది. ఇతరుల విషయాన అది దోషమేకాని, ఆమె విషయంలో అది గొప్పగుణం. ఇవన్నీ అమె విలువను పెంచిన అంశాలు.

“ఆమె స్వర సౌందర్యం అనుభవించి ఆనందించదగిందేగాని వర్ణించడం సాధ్యం కాదు” అంటారు ఆమె అభిమానులు.

పు.ల. దేశపాండే (పురుషోత్తం లక్ష్మన్ దేష్పాండే (8 నవంబర్ 1919 – 12 జూన్ 2000)) సంగీత రసికుడేగాక, చక్కని వచన రచన చేయగలవాడు కనుక “ఆమె స్వరాలు చెవిని సోకినంతనే నడిచేకాళ్ళు నిలిచిపోతాయి. కదిలేచేతులు కట్టుబడుతాయి. మాట్లాడే నోరు మౌనముద్రవహిస్తుంది” అంటాడు. అతనిలాంటి రచయిత కిషన్ సింగ్ చావ్ డా. “అరసికులు సైతం ఆమె స్వరాలు చెవినిపడగానే అడుగు ముందుకు వేయలేరు” అంటాడు.

ఆమె వ్యక్తిత్వం ఎవరికైనా ఆదరణీయమైనది. ఎంతటివాళ్ళు ఎన్నివేలుపోసి పిలిపించినా మర్యాదమీరే సాహసం చెయ్యలేకపోయేవాళ్ళు. అలాంటిప్రయత్నం చేసేవాళ్ళను మృదువుగా మందలించి మర్యాద కాపాడుకునేకళలో ఆరితేరిన కళావతి ఆమె.

హైదరాబాదు నిజాం రెండవకుమారుడు ప్రిన్స్ మొజ్జంజా కళాసాహిత్య పోషకుడు. అతనిదర్బారు కవులతో కళాకారులతో కళకళలాడుతుండేది.  వారం రోజులకోసం అఖ్తరీబాయిని ఆహ్వానించాడు ప్రిన్స్. మొదటిరోజే అక్కడివ్యవహారం ఆమెకు అరుచికరమైంది. మర్నాడు ప్రిన్స్ అనుమతి తీసుకోకుండానే పెట్టేబేడా సర్దుకుని బయటపడింది. ఏడువారాలనగలు, ఏడు విలువైన చీరలూ, వారం రోజులకోసం మాట్లాడుకున్న ప్రతిఫలం తన సెక్రటరీద్వారా నాంపల్లి స్టేషనుకు పంపించినాడట ప్రిన్స్. ప్రిన్స్ దర్బారు విశేషాలను “దర్బారె దుర్బార్” అనే పుస్తకంలో భద్రపరిచిన ప్రముఖకవి సిద్కి జాయెసీ చెప్పిన ముచ్చట ఇది. అవన్నీ ఆమె స్వీకరించిందో తిరస్కరించిందో చెప్పలేదతడు. ఆస్థానాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఆ కవి చెప్పదలుచుకున్నది ప్రిన్స్ ఔదార్యాన్ని గురించి కాని అఖ్తరీబాయి ఆత్మాభిమానాన్నిగురించి కాదాయె.

ఆ కాలంలో ఏ శుభకార్యం జరిగినా పేరుగల బాయిజీలను పిలిపించి ముజ్రా చేయించటం సంపన్నుల సంప్రదాయం. అలాగే పంజాబులో  ఒక జమీందారు అఖ్తరీబాయి ముజ్రా ఏర్పాటుచేసినాడు.  అతనింట్లో ఏదో శుభకార్యం. ఆకూతులైన ప్రముఖులు ఆమెపాటకు ముగ్ధులైనారు.  ముజ్రాముగించి సలాం చెయ్యగానే సంప్రదాయం ప్రకారం వేయి విక్టోరియా నాణేలుగల సంచీ బాయీకి సమర్పించబడింది. ఈ సంచిని ఆమె అందుకుని తన సాజిందాల్లో ఎవరికో ఇచ్చివేసింది.

“బాయీజీ! అందులో వేయి విక్టోరియాసిక్కాలున్నవి. మీరు లెక్కించుకోలేదు” అన్నాడు జమీందారు. ఆ దర్పం అసహ్యమైంది ఆమెకు. “హుజూర్” అని రెండుచేతులూ పైకెత్తి “ఈ హస్తభూషణాలే అరవైవేలు పలుకుతాయి. ఇంకా ఒంటిమీద ఎన్ని నగలున్నాయో చిత్తగిస్తున్నారుకదా. నా ఇంటగల నగలవెల ఎన్నివేలో చెప్పలేను. తమ దయవలన డబ్బూదస్కానికి కొరత లేదు. ఇక్కడ ఈ వెయ్యిరూపాయలను లెక్కిస్తూ కూర్చుండే ఓపిక ఎక్కడిది నాకు?” అని వెళ్ళిపోయింది.

అందరితోనూ ఆమెప్రవర్తన అలాగే ఉండేదని కాదు. ‘రసికరాజు’ రామూభయ్యాదాతే తన ఇంటికి వస్తే దేవుడుదిగివచ్చినట్లు సంబరపడిపోయి లఖ్నవీ సంస్కార సహజమైన ఆతిధేయమర్యాదలు నడిపి అతనికిష్టమైన చీజులు వినిపించి పంపేది. రామూభయ్యాదాతే ఇండోర్ నివాసి. అప్పటిప్రభుత్వంలో ఉన్నతోద్యోగి. అతని సంగీత శాస్త్రవైదుష్యం అపారమైంది. ఆనాటి గాయనీగాయకులందరూ అతడు తమపాట వినాలని అభిలషించేవాళ్ళు. ‘రసికరాజు’ అనేబిరుదు ఆనాటి గాయనీగాయకులిచ్చిందే. అతనికి అఖ్తరీబాయి పట్ల ఇంతింతనిచెప్పరాని అభిమానం. తన పాన్ లో వేసుకునే జర్దా గుళికలను “అఖ్తరీ పిల్స్” అనేవాడు. తరచుగా తానభిమానించే గాయకులవెంట సంగీతయాత్రకు బయలుదేరేటప్పుడు ఉపయోగించే అతని కారు పేరు అఖ్తరి.

(Part 2)

సంగీత రసికుడైన కిషన్ సింగ్ చావ్ డా అనుభవం చెప్పుకోదగ్గది.

అతనప్పుడు నీలం నగర్ మహరాజా దగ్గర దీవాన్ గా పనిచేస్తున్నాడు. వైస్రాయ్ ఎక్కడ ఉంటే అతనితో అవసరం ఉన్న స్వదేశీసంస్థానాధీసులు అక్కడ ఉండడం పరిపాటి. కలకత్తాడిసెంబర్ కమనీయమైంది.  కాబట్టి వైస్రాయ్ దర్బారు డిసెంబరు నెలలో కలకత్తా నగరాన జరిగేది. డిసెంబరు 1938. కిషన్ సింగ్ చావ్ డా తన రాజావారి వెంట ఒక భవ్యమైన హోటల్లో బసచేసి వున్నాడు. మహరాజావారు సంగీతప్రియులు. కనుక అవకాశం దొరికినపుడల్లా గాయనీగాయకులను స్మరించుకునేవారు. అక్తరీబాయి అప్పట్లో కలకత్తాలో ఉండేది. నిజమైన కళాకారులు నిజమైన సంగీత రసికులకు ఇచ్చేవిలువ డబ్బుకీయరు. రాజావారి ముందు పాడుతున్నప్పుడు సందర్భశుధ్ధిగాతలూపుతూ శహబాష్ ఇచ్చే చావ్ డాను చాలసార్లు కడగంట గమనించింది. అతడు నిజమైన రసికుడని అర్థం చేసుకుంది.  ఒకనాడు పాటవినిపించి కిందికిపోతూ తనకారుదాకా రావలసిందిగా అతన్ని అభ్యర్థించింది.  కారులోకూర్చుంటూ, “చావ్ డాజీ! ఒకసారి నా యింటిని పావనం చెయ్యండి. మీకు ప్రత్యేకంగా చీజులు వినిపించాలని ఉన్నది” అని మనవి చేసింది. అహో భాగ్యం అనుకున్నాడు   చావ్ డా.

ఒకనాడు ఆమె నివాసభవనానికి వెళ్ళినాడు. సాదరంగా అతన్ని ఆహ్వానించి సాజిందాల (వాద్యకాండ్రు)కు సంజ్ఞ చేసింది. ఆలాపన ఆరంభించబోతుండగా నీలం నగర్ మహారాజావరు వేంచేసినారని క్రిందనుండి వార్త వచ్చింది. తను రాజావారి కంటపడడం చావ్ డా కు సంకట పరిస్థితి. అతని అవస్థ గమనించిన బాయీజీ అతన్ని తన శయనాగారంలోకి పంపి మహారాజావారిని ఆహ్వానించింది.  మళ్ళీ సాజిందాలకు సంజ్ఞ. మళ్ళీ ఆలాపన. అంతలోనే ప్రతాప్ గఢ్ మహారాజావారు వచ్చినారని వార్త. మళ్ళీ చిక్కువచ్చి పడింది.  మహారాజావారుని అదే శయనాగారంలోకి పంపి  ప్రతాప్ గఢ్ మహారాజాను పైకి ఆహ్వానించింది. జరుపవలసిన అతిధిమర్యాదలు జరిపి, అతడుకోరిన చీజులు వినిపించి, ఇచ్చిన పారితోషికం స్వీకరించి కిందికి పంపివేసింది. శయనగృహంలో తేలుకుట్టినదొంగల్లా మౌనంగాకూర్చున్నారు మహారాజా, అతని సెక్రటరీ. వాళ్ళిద్దర్నీ దర్బారు హాల్లోకి తెచ్చి, కూర్చుండబెట్టి తనివిదీరా విలువైన చీజులు వినిపించింది. అది సరస్వతి సన్నిద్గానం. అక్కడరజూ పేదా సమానులే. అభిజ్ఞుడు ఆదరనీయుడు. శ్రోతలిద్దరూ బ్రహ్మానందభరితులైనారు.  దిగి వచ్చేటప్పుడు రాజావారి ఆజ్ఞమేరకు ఐదువందల రూపాయలు అర్పించబోయినాడు  చావ్ డా. ఆమె మర్యాదగా తిరస్కరించింది.  మకారాజు మర్మజ్ఞుడు. మందహాసం చేసి ఊరుకున్నాడు. అంతటితో ఆగలేదు బాయీజీ. “చావ్ డాజీ. మిమ్మల్ని ఇక్కడకి ఆహ్వానించింది స్వీకరించడానికి కాదు.  నివేదించడానికి. మీ ముందు నాస్వల్ప విద్యను ప్రదర్శించి ధన్యురాలనైనాను. సంగీత విద్యలో సామాన్య సాధకుయ్రాలు సంగీత రసికునికి సమర్పించిన చిరు కానుక ఇది” అంటూ కృతజ్ఞతాపూర్వకంగా శిరసు వంచి సలాం చేసింది.

“రాజాధిరాజులముందు వంగని శిరస్సు  ఒక సామాన్యుడైన రాజోద్యోగి ముందు సవినయంగా వంగింది. వేలకువేలు సమర్పించినా తృప్తిచెందని బాయీజీ విన్నందుకే ధన్యురాలన్నది” అంటాడు చావ్ డా.

సాంప్రదాయికమైన ముస్లిం కుటుంబంలో జన్మించిన అఖ్తరీ బేగం సంగీతం పట్ల ఆసక్తి పెంచుకుని కొన్నాళ్ళు  పట్యాలా ఘరనాకు చెందిన ఉస్తాద్  అతా అహ్మద్ ఖాన్ వద్ద, మరికొన్ని నాళ్ళు కిరాణా ఘరానాకు చెందిన  ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్ వద్ద శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది. అయినా అమెకు ఠుమ్రీ, దాద్రా, గజల్, భజన్ ల గాయనమే సమ్మతమయింది. ఆ కాలంలో అది బాయీజీల విద్య.  కాబట్టి ఆమె తన కుటుంబానికి దూరమయింది. అఖ్తరీబాయిగా అశేషమైన కీర్తినీ, అపారధనసంపత్తినీ ఆర్జించింది. బారిస్టర్ అబ్బాసీ భార్య అయిన తర్వాత బేగం అఖ్తర్ సమాజంలో గౌరవ స్థానం సంపాదించింది. ఈ సామాజిక గౌరవం వల్ల ఆమె కొన్ని కట్టుబాట్లకు లోనుకావలసి వచ్చింది. బురఖా చాటున ఆమె స్వరాలు మూగవోయినవి. తబ్లా, హార్మోనియం, తంబూరాలు మూల పడ్డవి. పాడటమే జీవితమని భవించిన ఆమె పర్దాచాటుకు వెళ్ళిపోవటం ఆమె అభిమానులకేగాక  ఆమెకు కూడా దుస్సహమయింది. ఆమె తోటి గాయనీగాయకులు ఆమె ఇంటికి వస్తే అబ్బాసీగారు ఆప్యయంగా ఆదరించేవారు. కాని ఆమె అసహాయురాలయి మౌనంగా రోదించేది.  ఎవరిపాటలు విన్నా ఏడుపువచ్చేదామెకు. గజల్ గాయనం లో ఆమెకు సమానురాలు కాకున్నా సన్నిహితురాలైన మలికా పఖ్రాజ్ (Malika Pukhraj)అమెను ఆ స్థితిలో చూసి తానూ ఏడ్చిందట. మలికా పక్రాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిందీ మాట.

బారిస్టర్ అబ్బాసీ ఉర్దూ గజళ్ళపట్ల ఉత్తమాభిరుచిగలవాడే. సంగీత ప్రియుడే. కానీ, పరువుగల కుటుంబంలో ప్రవేసించిన తన భార్య పబ్లిగ్గా పాడటాన్ని అనుమతించలేకపోయాడు. సునీల్ బోస్ స్వతహాగా గాయకుడు, సంగీతవేత్త. అతడు లఖ్నో రేడియో స్టేషన్ కు ప్రోగ్రం ప్రొడ్యూసర్ గా నియుక్తుడయ్యాడు. అదృష్టవశాన అతనికి లఖ్నోలో బేగం అఖ్తర్ హవేలీ “అఖ్తర్ మంజిల్” దగ్గర్లోనే ఇల్లు దొరికింది.  అతడామెకు పూర్వ పరిచితుడు. కనుక తరచుగా తన భార్యవెంట అఖ్తర్ మంజిల్ కు వెళ్ళేవాడు. ఆ దంపతులతో సంగీతసాహిత్యాల చర్చచేసేవాడు. సంగీత ప్రసక్తి వచ్చినపుడు బేగం అఖ్తర్ ముఖం మీద కనిపించే నిరాశా నిస్పృహలను గమనిస్తూ, బోసుబాబు ఎలాగైనా ఆమెను లఖ్నో రేడియో నుంచి పాడించాలని నిర్ణయించుకున్నాడు. జస్టిస్ వాల్ఫోర్డ్ విదేశీయుడైనా ఉర్దూ గజళ్ళను, ఉత్తరాది సంగీతాన్ని ప్రేమించేవాడు.  అతనితో కలిసి బోసుబాబు ఎలా అయితేనేమి బారిస్టర్ అబ్బాసీని ఒప్పించి బేగం సాహెబాను రేడియో స్టేషనుకు రప్పించగలిగినాడు. బహుకాలం తర్వాత లఖ్నో రేడియో స్టేషన్ ప్రసారం చేసిన ఆమె గజళ్ళను విని అసంఖ్యాకులైన ఆమె అభిమానులు ఆనందభరితులైనారు.  అబ్బాసీ కూడ దైవదత్తమైన అలాంటి దివ్యస్వరాలను దాచిపెట్టడం అపచారమని గ్రహించినాడు.  ఆనాటినుంచి తానే ఆమెను ప్రోత్సహించినాడు.  ఎక్కడ బేగం అఖ్తర్ ప్రోగ్రాం జరిగినా అక్కడ అబ్బాసీ వుండేవాడు. ఆమె ఛారిటీ ప్రోగ్రాములు చాలా ఇచ్చింది. అహమదాబాదులో 30 అక్టోబరు 1974న అలాంటి  ప్రోగ్రాం ఒకటి ఏర్పాటయింది. అబ్బాసీ వెంట అక్కడికి వెళ్ళిందామె. ఆమె ఆరోగ్య పరిస్థితి గమనించి ఉస్తాద్ అంజాద్ ఆలీఖాన్ “అమ్మీజాన్, మీ ఆరోగ్యం బాగాలేదు. ఈనాడు పాడకుంటేనే మంచిది” అని వేడుకున్నాడు. “బేటా! మాట ఇచ్చినాను. ఇప్పుడెలా తప్పను?” అని పాటకచేరీ ప్రారంభించి  పాట ముగిసిన తర్వాత “చివరి శ్వాస వరకూ పాడుతూనే జీవిస్తాను” అని తరచూ అంటూవుండే బేగం సాహెబా తనమాటను సార్థకం చేసుకున్నది. చివరి శ్వాస అక్కడే విడిచింది.

ఆమె గజల్ గాయన శైలి అతి విశిష్టమైనది.  ఆమె గజల్ పాడేటప్పుడు భావానికి ప్రాధాన్యం ఇచ్చేది. రాగాన్ని గౌణంగా పాటించేది. ఏదో ఒక ప్రసిధ్ధ రాగంలో గజల్ ప్రారంభించి అంతగా రాగాలాపన చెయ్యకుండా, స్పష్టమైన, శుధ్ధమైన ఉచ్ఛారణతో ఒక్కొక్క షేర్ నూ ఆ రాగస్పర్శతో పాడేది. గజల్ పాడేటప్పుడు తన సంగీత పాటవాన్ని ప్రదర్శించేది కాదు. సరిగమలు వెయ్యడం గాని, తాన్ బాజీ చేయటం గాని గజల్ భావ సౌందర్యాన్ని మరుగుపరుస్తాయని తన శిష్యులకు చెప్పేది. తానూ అలాగే పాడేది. కాబట్టే ఎందరో కవులకు ఆమె ప్రతిష్ఠ కలిగించింది. ఆమె గజళ్ళు వింటుంటే శ్రోతలు మధురమైన సంగీతం వింటున్నామన్న అనుభూతిని పొందుతారు. అందమైన గజల్ వింటున్నామన్న ఆనందం పొందుతారు. ఈనాడు ఎందరో గజళ్ళు పాడుతునారు. కొందరికి గొప్ప కీర్తి ప్రతిష్ఠలు కూడా లభించినాయి. కానీ, బేగం అఖ్తర్ స్థాయిని అందుకోవటం ఈ తరంలో ఎవరి తరం కాదు. తాము పాడిన గజళ్ళ క్యాసెట్లు అసంఖ్యాకంగా విడుదల చేస్తున్న  గజల్ గాయకులు  గజల్ ని ఎలా పాడవలెనో గ్రహించటానికి బేగం అఖ్తర్ ను పదేపదే వినాలె.

“భక్తజనులు రామాయణ సప్తాహం జరుపుకున్నట్లు మాకాలంలో మేము బేగం అఖ్తర్ రికార్డుల సప్తాహం జరుపుకునేవాళ్ళం ”  అంటాడు పద్మభూషణ్ పు. ల. దేశ్ పాండే.

బేగం అఖ్తర్ ఉదారం గా విద్యాదానం చేసింది. తన శిష్యుల నోట, శిష్యురాండ్ర నోట “అమ్మీజాన్” అని ప్రేమగా పిలిపించుకునే ఆమె అందరికీ ఎలాంటిప్రతిఫలాపేక్షలేకుండా తన గాయన శైలిని నేర్పింది. శాంతీ హీరానంద్, రీటా గంగూలీ, అంజలీ బెనర్జీ లాంటివాళ్ళు ఆమె శైలిని కొంతవరకు కాపాడుతున్నారు. ఆమె శిష్యురాలి కాకున్నా అచ్చం ఆమెలా పాడే శోభా గుర్టు గజళ్ళు వింటుంటే బేగం అఖ్తర్ ను స్మరించుకోకుండా ఉండలేము.

ఇటీవల ఆమె 25వ వర్థంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం బేగం అఖ్తర్  తపాలాబిళ్ళను విడుదల చేసింది. మొదటి తపాలాబిళ్ళను అమె బాల్య సఖి, ఆమెస్థాయికి  ఇంచుమించు  చేరిన గాయకురాలు మలికా పఖ్రజ్ కు సమర్పించింది. పాకిస్తాన్ లో నివసిస్తున్న మలికా పఖ్రాజ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఇది చాలా సముచిత చర్య అని భారత ప్రభుత్వాన్ని సంగీత రసికులు ప్రశంసించినారు.

%d bloggers like this: