అనువాదలహరి

ధూళికణానికి… ఛార్లెట్ స్మిత్, ఇంగ్లీషు కవయిత్రి

.

కంటికి కనరాని ఓ చిన్ని వ్యోమగామీ!

ఒక సన్నని గాలితీగకు వేలాడుతూ,

సూర్యకిరణాలమీద తేలియాడే చైతన్య అణుపదార్థమా!

నీ గాలివాటు ప్రయాణానికి గమ్యం ఏది? ఏ ఆలోచనతో

నువ్వు ఈ ఈథర్ లో నీ సూక్ష్మ శరీరాన్ని ప్రవేశపెట్టావు?

కంటిచూపుని ఎగతాళిచెయ్యడానికా?

పాపం! దట్టమైన నీలిమేఘాల మేలిముసుగు నిను దాచేలోగానే

వెంటాడే సుడిగాలి నీ ఖగోళయానానికి తెరదించుతుందే.

అయ్యో! అచ్చం అలాగే, ఊహాకల్పిత పసిడితీగెలమీద

ఆశల ఊపిరులూదే బూటకపుముఖస్తుతులకు పొంగిపోయి

ఏడుపొరల ఇంద్రధనుస్సులు తన కళ్ళలో నడయాడుతుండగా

గొప్పభావుకతగల కోడెవయసులోని కవికిశోరాలు

చేదు జీవిత సత్యాలని విస్మరించి నడుస్తాయి.   పాపం!

త్వరలోనే, చింతలు తాకి ఆ పగటికలలు కరగిపోతాయిగదా!


.

ఛార్లెట్ స్మిత్

ఇంగ్లీషు కవయిత్రి, నవలాకారిణి 

ఇంగ్లీషు సాహిత్యంలో కవయిత్రులలో ఛార్లెట్ స్మిత్ ది ఒక దయనీయ గాధ, అయినా సాహసోపేతమైనది. బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టినా, భర్త వ్యసనాలవల్ల, అప్పులుతీర్చలేని అతనితోపాటు జైలుపాలై, అక్కడ మొదటిసారిగా కవిత్వ రచనకు పూనుకుంది. ఆమె వ్రాసిన Elegiac Sonnets బహుళ జందరణ పొందడమే గాక, రొమాంటిక్ సాహిత్యోద్యమానికి రూప శిల్పులైన వర్డ్స్ వర్త్, కోలరిడ్జ్ లకు ప్రేరణకూడా. ఆమె వ్రాసిన కొన్ని సానెట్లలోని భావాలను, వర్డ్స్ వర్త్ తన కవితలలో పొందుపరచేడని పెద్ద వివాదము కూడా  ఉంది.

సైన్సులో అద్బుతమైన అలోచనలకూ, ఆవిష్కరణలకూ తెరతీసిన 18వ శతాబ్దములో ధూళికణం ఒక ప్రాణమున్న జీవిగా అనుకునేవారేమో తెలీదు. కాని, ధూళికణపు ప్రయాణంతో కొత్తగా కవితలురాసేవారి సాహిత్య ప్రయాణాన్ని పోల్చడం ఒక్క కొత్త భావన అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.    

.

English: Charlotte Turner Smith in Charlotte T...
English: Charlotte Turner Smith in Charlotte Turner Smith, Elegiac sonnets Fifth edition. London: Published by Thomas Cadell, 1789. (Photo credit: Wikipedia)

.
 Sonnet: To the Insect of the Gossamer
.
 Small viewless aeronaut, that by the line
 Of Gossamer suspended, in mid air
 Float’st on a sun-beam—Living atom, where
 Ends thy breeze-guided voyage? With what design

In æther dost thou launch thy form minute,
 Mocking the eye? Alas! before the veil
 Of denser clouds shall hide thee, the pursuit
 Of the keen Swift may end thy fairy sail!

Thus on the golden thread that Fancy weaves
 Buoyant, as Hope’s illusive flattery breathes,
 The young and visionary Poet leaves
 Life’s dull realities, while sevenfold wreaths

Of rainbow light around his head revolve.
 Ah! soon at Sorrow’s touch the radiant dreams dissolve.

.

 Charlotte Smith

4 May 1749 – 28 October 1806

English Romantic poet and Novelist.

%d bloggers like this: