ఆవగింజల టపటపలు … మనుజ్ బ్రహ్మపాద, Malayalam, Indian Poet.
.
విరబూచినచెట్టు ఒకటి
కిటికీ పక్కకి వంగి,
పిట్టలా మూతిముడిచి
సన్నగా ఊళవేసింది:
“ఏయ్, బాబూ! బయటికి దా!
నేను నీ కోసం పువ్వులు కురియడానికి
ఎదురుచూస్తున్నా.”
.
మనసు
చికాకు తెప్పించే సోషలు పుస్తకాన్ని
ఒక్కసారి అవతలకు విసిరేసి,
ఒక ఆకును మీటింది
పళ్లతోటలోకి పరుగెత్తడం గురించి ఆలోచిస్తూ…
.
సరిగ్గా అప్పుడే
వంటింట్లోంచి ఒక కేక వినిపించింది:
“ఓరే, బాబూ! రేపు పరీక్ష …”
.
ఎక్కడికో ఎగిరిపోడానికి
పావురం రెక్కలు అల్లాడించింది;
చెట్టు మౌనంగా ఉండిపోయింది;
అక్బరు తవ్వించిన
ఆ నిశ్చలతటాకం వైపు
మనసు అటూ ఇటూ ఊగిసలాడింది
కాసేపు తేలుతూ, కాసేపు ములుగుతూ.
.
అప్పుడు
కిటికీలోంచి ఒక పండుటాకు
బుగ్గలు సాగేలా నవ్వుతూ,
భుజాన్ని ఆప్యాయంగా స్పృశిస్తూ
ఒడిలో వాలి, గువ్వలా ఒదిగిపోయింది.
.
ఒక్కసారిగా,
అతనికి మంచి మార్కులు
రావడం ప్రారంభించేయి
పుస్తకం పేజీలు నలుచదరంగా చించి
కాగితం పడవలుగా మడిచి
అతనే తెడ్డువేసుకుంటూ ప్రయాణించసాగేడు.
.
అప్పుడు
వంటింట్లోంచి
చప్పట్లుకొట్టి
అభినందిస్తున్నట్టుగా
ఆవగింజలు టపటపలాడసాగేయి.
.
మనుజ్ బ్రహ్మపాద,
మలయాళీ కవి
.
