పోలికలు … కాల్పెట్ట నారాయణన్, మలయాళ కవి
మొదటిసారి
మా యింటికి వచ్చిన స్నేహితుడు
గోడమీది నా పాత ఫొటో చూసి
“మీ తమ్ముడా?” అని అడిగేడు.
అడిగి మళ్ళీ,
“అవును! మీ తమ్ముడే.
అవే చూపులూ
అదే చెదిరిపోయిన జుత్తూ
కళ్ళుమాత్రం అంతలోతుగా లేవు.
తీపి జ్ఞాపకాలు
అంత త్వరగా విడిచిపెట్టవు.
నీకంటే బాగా కనిపిస్తున్నాడు”
అన్నాడు నా మిత్రుడు.
ఆత్మవిశ్వాసం అతను
పనులన్నీ చకచకా చెయ్యగలిగేట్టు
చేసింది.
అతనికి బంధుప్రీతి ఎక్కువే.
ఏకాంతంలోకూడా
అతనెన్నడూ ఒంటరిగా ఉండలేదు.
మరొకసారి దీక్షగా
ఫొటోలోకి పరికించి చూసి
గుసగుసలాడినట్టు నెమ్మదిగా
“అతను ఇప్పుడు లేడు,
అవునా?”
అని అడిగేడు.
“ఉన్నాడు.
కాని, అతనిపుడు అతను కాదు.”
.
మలయాళ మూలం : కాల్పెట్ట నారాయణన్
ఇంగ్లీషు సేత: జయశ్రీ తొట్టెకట్
(ఈ కవితలో సౌందర్యం, పోలికలు గురించి ఒక్కోసారి మనం ఎంత పొరపడతామో అన్న విషయం కాదు. జీవిత చరమాంకంలో, మనం మననుండి, లేదా మన ఆశలు ఆశయాల నుండి ఎంతదూరం వచ్చేసేమో అని ఒక్కోసారి అవలోకనం చేసుకుంటూ బాధపడతాం. … అయితే, ఇది, వ్యక్తి తను ఏకాంతంలో అలా బాధపడడం కాకుండా, ఒక స్నేహితుడిద్వారా దానికి తగిన నేపధ్యాన్ని సృష్టించి, మనిషిలో సహజంగా వచ్చే శారీరక మార్పులకీ, మానసికంగా వచ్చే లేదా తెచ్చుకునే మార్పులకీ, పోలిక తెస్తూ, మంచి తాత్త్వికమైన మలుపునివ్వడం.)
