బంగారుపళ్ళెం… లే హంట్, ఆంగ్ల కవి

.
ఒక సారి కాశీలో దేవాలయప్రాంగణంలో
ఒక అద్భుతమైన బంగారుపళ్ళెం ఆకాశం నుండి పడింది.
దానిమీద ఇలా రాసి ఉంది:
“ఏవరైతే సాటిమనిషిని నిజంగా ప్రేమిమిస్తారో,
వారికి భగవంతుడిస్తున్న కానుక ఇది” అని.
అంతే! అక్కడి అర్చకులు వెంటనే ప్రకటించారు:
“ప్రతిరోజూ మిట్ట మధ్యాహ్నం
దైవం అనుగ్రహించిన ఈ కానుక గ్రహించడానికి ఎవరైతే
అర్హులనుకుంటున్నారో వాళ్ళందరూ సమావేశమవొచ్చు.
వాళ్ళు దయాకనికరాల్ని ప్రదర్శించిన సంఘటనలు
విశదీకరించి అర్హత ఋజువుచేసుకోవచ్చు.”
ఆ వార్త కాంతికన్న వేగంగా నలుమూలలా ప్రాకింది
అప్పటినుండీ తండోపతండాలుగా
కులీనులు, దివానులు, సన్యాసులు, పండితులు, సాధువులు
ఒకరేమిటి, వాళ్ళ సత్కార్యాలకి ప్రసిధ్ధిగన్న
అందరూ రావడం ప్రారంభించేరు.
ప్రతిరోజూ అర్చకులు కొలువుతీరి
కానుక స్వీకరించడానికి హక్కు ప్రకటించిన
ప్రతివారి అర్హతలనూ బేరీజు వేయసాగేరు.
.
ఇలా ఒక సంవత్సరం గడిచిపోయింది.
చివరికి ఎలాగైతేనేం అర్చకులు
అందరి అర్హతలూ నిశితంగా పరీక్షించి
ఒక ఏడాది కాలంలో తన సంపదసర్వస్వం
బీదలకు పంచియిచ్చిన ఒకతనిని యోగ్యుడుగా
నిర్ణయించి బంగారుపళ్ళెం బహూకరించడానికి నిశ్చయించేరు.
అతను ఆనందంతో తబ్బిబ్బవుతూ
ఆ బంగారు పళ్ళాన్ని తీసుకుందికి ముందుకి చెయిజాచేడు.
ఆశ్చర్యం! ఒక్కసారిగా ఆ బంగారు పళ్ళెం
కనికిష్టమైన సీసపు పళ్ళెంగా మారిపోయింది.
అందరూ నిశ్చేష్టులై నిలుచుండిపోయారు.
పాపం! దాన్ని గ్రహించిన దుర్భాగ్యుడు
దాన్ని నేలకు జారవిడవగానే
చిత్రంగా, అది మళ్ళీ బంగారు పళ్ళెంగా మారిపోయింది.
.
మరొక సం వత్సరం పాటు మళ్ళీ అర్చకులు
సమావేశమై అర్హుడిని నిర్ణయించ ప్రయత్నించేరు.
అలా మూడుసార్లు వాళ్లు నిర్ణయించారు.
కానీ, మూడుసార్లూ దైవం తిరస్కరించేడు.
.
చివరకి ఒక సామాన్య రైతు
ఈ బంగారుపళ్ళెం ముచ్చట ఏమాత్రం తెలియనివాడు
దేమునికి తన మొక్కు చెల్లించుకుందికి వచ్చేడు.
శుష్కించిపోయిన బిచ్చగాళ్ళని చూసి
అతని మనసు కనికరంతో ద్రవించింది.
అతనికి ద్వారం దగ్గరనే ఎవరూ పట్టించుకోని
ఒక బీద, రోగిష్టి అంధబిక్షువు కనిపించేడు.
ఆ రైతు అతని సమీపించి
చూపులేని ఆ ముఖం లోకి చూసినపుడు,
చేయిజాచలేక వణుకుతూ మోకరిల్లిన
అతని రెండుచేతులనూ తన చేతుల్లోకి తీసుకుని
“అన్నా, భగవంతుడు దయామయుడు
అన్ని చక్కబడతాయి, ధైర్యంగా ఉండు” అన్నాడు.
అని తను తిన్నగా దేవాలయంలోకి వెళ్ళేడు.
అక్కడ హక్కుదారులందరూ తమ ఘనకార్యాల చిట్టాలు
అర్చకులకు విశదీకరించుకుంటున్నారు.
రైతు కాసేపు అవి విని, అక్కడనుండి వెనుదిరిగి పోయాడు.
కాని, అక్కడ బంగారుపళ్ళెం పట్టుకున్న అర్చకుడిని
ఇతనిలో ఏదో ఆకర్షించింది.
వెంటనే ఇతనిని వెనక్కి రావలసిందిగా పిలిచేడు.
అర్చకుడు ఎందుకు రమ్మన్నారో తెలియకపోయినా
వినయంగా అతని ఆజ్ఞ శిరసావహిస్తూ
పవిత్రమైన పళ్ళేన్ని తాకడానికి చెయ్యిజాపేడు.
అద్భుతం! అంతకుముందుకంటే మూడురెట్ల కాంతితో
మిలమిలా మెరిసిపోతోంది ఆ బంగారు పళ్ళెం.
అందరూ ఆశ్చర్యపోయారు.
అపుడు ఆ అర్చకుడు ఆనందాశృవులతో ఇలా అన్నాడు:
“వత్సా! భగవంతుని ఈ అనుగ్రహానికి నీవే అర్హుడవు!
సంతోషించు!మనుషులపై నిజమైన ప్రేమ నీకే ఉంది.”
అందరూ తమ ఆమోదాన్ని తెలిపి
ఒకరి వెనుక ఒకరు నిష్క్రమించేరు.
కాని, ఆ రైతు మోకాళ్లపై పడి
తల బంగరు పళ్ళేనికి ఆనిస్తూ దైవాన్నిప్రార్థించేడు.
అతని పై ప్రాభాత కిరణముల వెల్లువలా
భగవంతుని ఆశీస్సులు ప్రసరించేయి.
.
జేమ్స్ లే హంట్
(అక్టోబరు 19, 1784 – ఆగష్టు 28, 1859)
ఆంగ్ల కవీ, రచయితా వ్యాసకర్తా.
లే హంట్ పేరు వినగానే గుర్తుకొచ్చే కవిత ఏబూ బెన్ ఏడం (Abu Ben Adam). కీట్స్ (John Keats) ని షెల్లీకి (PB Shelly) పరిచయం చేసింది లే హంటే. అతని మిత్ర మండలిలో ఇంకా బైరన్ (George Gordon Lord Byron), విలియం హేజ్లిట్ (William Hazlitt), ఛార్లెస్ లాంబ్ (Charles Lamb), వంటి హేమా హేమీలున్నారు.
.

.