మాట నేర్చిన కోళ్ళు… బెంజమిన్ జెఫానియా, ఇంగ్లీషు కవి
(గమనిక: సారూప్యత, సందర్భం (ఇవి దసరారోజులు కదా), దేశీయతల కోసం, ఇంగ్లీషు టర్కీ కోళ్లని నాటుకోళ్ళుగానూ (అవే ఎక్కువగా బలి అవుతాయని నే ననుకుంటున్నాను), క్రిస్మస్ పండుగను దసరా పండుగగానూ మార్చి వ్రాసేను. తదనుగుణంగా మరికొన్ని మార్పులుకూడా అక్కడక్కడ చెయ్యడం జరిగింది.)
.
ఈ దసరాకి కోళ్ళతో మంచిగా ప్రవర్తించండి
ఎందుకంటే, వాటికి కూడా దసరాసరదాల్లో పాల్గోవాలనుంటుంది.
కోళ్ళు చాలా సరసంగా ఉంటాయి, కొన్ని చెడ్డవుండొచ్చు,
అయినా, ప్రతి కోడి నోరుమూసుకుని పడి ఉంటుంది కదా!
మీ కోళ్ళని ఈ దసరాకి మంచిగా చూడండి.
వండుకు తినకండి, ప్రాణాలతో బ్రతకనీండి,
అవి మీ సావాసులు కావాలి గాని సాపాటులు కాకూడదు
ఏదీ చెప్పండి, కోడీ! నేను నీకు దన్నుగా ఉంటానని.
.
కోళ్ళలో నాకు చాలామంచి నేస్తాలున్నాయి
వాటన్నిటికీ దసరారోజులంటే భయం
వాటికీ సరదాగా ఉంటుంది గానీ, మనుషులే పాడుచేశారు అని అంటాయి;
మనుషులకి బుర్ర చెడిపోయింది;
అవును, నా నేస్తాల్లో చాలామట్టుకు కోళ్ళే
వాటన్నిటికీ బ్రతికే హక్కుంది,
ఏదో గంపకింద దాచబెట్టి ఏ రైతో, అతని భార్యో
తరతరాలుగా పెంచుకుంటూ ఉండడానికి కాదు.
.
వాటికి కూడా ఆడిపాడాలనుంటుంది
అవికూడా గెంతులేద్దామనుకుంటాయి
ఒక చిన్ని కోడిపిల్ల గంతులేస్తూ
అబ్బా, నేను పులివేషాలు చూడ్డానికి
తహతహలాడుతున్నానంటే ఎంతబాగుంటుంది!
కోళ్ళకీ పండుగకట్నం తీసుకోవాలనీ, టీవీ చూడాలనీ ఉంటుంది
వాటికీ ప్రాణం ఉంది, బాధంటే ఏమిటో తెలుసు
చాలావరకు మీ లాగా నా లాగానే ప్రవర్తిస్తాయి.
.
నాకు తెలిసిన కోడి ఒకటి ఉండేది— టర్కీ అని
అది నన్నోసారి అడిగింది: ‘ ఏయ్, బెంజీ! నాకు చెప్పు,
అసలు దసరాల్లో కోళ్ళు చంపడం ఎవరు ప్రారంభించేరో
దసరాకి నిలబెట్టిన దుర్గబొమ్మలు ఏమవుతున్నాయో?”
నే నన్నాను: “నిజానికి నాకూ తెలీదు.
దసరాకీ, కోళ్ళను చంపడానికీ ఏం సంబంధం లేదు,
మనుషులు తిండిపోతులై అవసరానికి మించి వృధాచేస్తున్నారు.
వ్యాపారస్తులు ఆపేరుతో బాగా సొమ్ముచేసుకుంటున్నారు, అంతే!”
స్పందించండి