పల్లెటూరి బడిపంతులు… ఆలివర్ గోల్డ్ స్మిత్, ఇంగ్లీషు-ఐరిష్ కవి.
(విజయనగరంలో గంటి వెంకటరమణయ్యపంతులనే లెక్కలమేష్టారు MRMP School లో పనిచేస్తూ ఉండేవారు. ఆయన ఇంగ్లీషులోకూడ దిట్ట. ఆయన మా గురువుగారు. చాలకాలం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కి సెక్రటరీగా కూడ పనిచేశారు. గురాచారివారి వీధిలో వాళ్ళ ఇల్లు ఉదయాన్నే ఎప్పుడూ పిల్లలతో కళకళలాడుతుండేది. ఈ కవిత చదువుతుంటే నాకు ఆయనే గుర్తువస్తారు. ఈ కవితలో చెప్పిన స్కూలు టీచరుకి ఉన్న చాలా లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ముఖ్యంగా మాటకరుకుగా ఉన్నా మనసు మెత్తదనం, Strict Discipline, లెక్కలలో ప్రావీణ్యం, పిల్లలపట్ల అనురాగం, విద్యపట్ల ఉన్న అపారమైన గౌరవం. కాలం ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యక్తుల్నీ చరిత్రనీ తనతో మోసుకుపొతుందో కదా! Nobody remembers GVR or SS Master now.
GVR మాష్టారూ, ఇది మీకు పాదాభివందనం తో.)
.
అదిగో, ఊరిపొలిమేర రోడ్డువార కంచెపక్కన
ఎవరికీ పట్టకుండా పూచిందో అందమైన ముళ్ళగోరింట
అక్కడే ఒకప్పుడు, సందడిగా ఉండే వీధరుగుమీద
పిల్లలకి పాఠాలుచెబుతూ చిన్నబడి నడిపేవాడొక పంతులు
.
కఠినమైన క్రమశిక్షకుడు, చూడ్డానికి మహాకఠినుడు,
నాకు బాగా అనుభవం, నాకే కాదు,బడి ఎగేసే ప్రతిపిల్లాడికీ ఎరికే;
ఆ జడిసే పిల్లలు ఎంతబాగ గ్రహించగలరంటే, ఉదయాన్నే
అతని ముఖం చూసి ఆ రోజు ఎలా ఉంటుందో ముందే పసిగట్టేవాళ్ళు.
.
అతను వేసే జోకులకి తెచ్చిపెట్తుకుని మరీ నవ్వే వాళ్ళు
ఎందుకంటే, అతను లెక్కలేనన్ని జోకులేసేవాడు
అతనుగాని నొసలు చిట్లించేడా, విపత్తు ముందుందని
అందరికీ గుసగుసలతో విషయం నలుగురికీ వ్యాపించేది
.
అయితేనేం,అతని మనసు వెన్న. అతను కఠినంగా ఉండవలసి వస్తే
నేరం అతనిదికాదు, విద్యపట్ల అతనికున్న నిబద్ధతే కారణం.
ఊరు ఊరంతా అతనికి ఎంతోతెలుసునని తీర్మానించింది
అతనికి రాయనూ, గణించనూ వచ్చుననడంలో సందేహంలేదు.
.
భూములు కొలవడం,లెక్కలుకట్టడం; రాబోయే ఉపద్రవాలు చెప్పడమే కాదు;
అతను వస్తువులనాణ్యత నిర్ణయించగలడని కథలుగా చెప్పుకుంటారు;
వాదనాపటిమలో కూడా, ఆ పంతులుకి ప్రత్యేకత ఉంది
ఓడిపోయినప్పటికీ, వాదించగలశక్తి అతనికుంది.
.
మాటాడుతున్నప్పుడు మాటలు గంభీరంగా ప్రవాహంలావస్తుంటే
ఆశ్చర్యపోతూనే గ్రామీణులు అతనిచుట్టూ చేరేవారు;
వాళ్ళకి చూస్తున్నకొద్దీ ఆశ్చర్యం కలుగుతుండేది
ఇంత చిన్న బుర్ర అన్ని తెలివితేటలు ఎలా ఉన్నాయా అని.
.
కాని, ఇపుడదతని కీర్తి అంతా గతం. ఎక్కడైతే అతను
ఎన్నో విజయాలు చవిచూసేడో, ఇపుడది పూర్తిగా మరుగుపడింది.
.
ఆలివర్ గోల్డ్ స్మిత్
(10 November 1730 – 4 April 1774)
ఇంగ్లీషు-ఐరిష్ కవీ, నవలా కారుడూ, నాటక కర్తా.
(గోల్డ్ స్మిత్ పెరు చెప్పగానే వెంటనే గుర్తువచ్చే రచనలు The Deserted Village కవిత, Vicar of Wakefield నవల, She Stoops to Conquer నాటకం. 18వ శతాబ్దంలో ఇంగ్లాండులో, నేటి భారతదేశంలో లా,భూములు కోల్పోయి జీవనాధారం పోయి పట్టణాలకు పల్లె ప్రజలు వలస పోయినపుడు గ్రామీణజీవనం ఎంత అతలాకుతలం అయిందో గోల్డ్ స్మిత్ తన కవిత “Deserted Village” లో బాగా చిత్రించాడు. అతనికి బాగా పేరు తెచ్చిపెట్టిన ఈ కవితలో కూడా గ్రామీణుల అమాయకత్వం, చదువుపట్ల, చదువుకున్న వారిపట్ల (ఇప్పటికీ) ఉండే ఎనలేని గౌరవం, విభ్రమంకనిపిస్తాయి.)
