ఆల్బట్రాస్… ఛార్లెస్ బోద్ లేర్, ఫ్రెంచి కవి
.
అగాధ పారావారాలపై అతినెమ్మదిగా పయనించే
సహయాత్రీకులైన ఓడలని అనుసరించే
విస్తారమైన ఈ నీటి పక్షులు, ఆల్బట్రాస్ లని,
తరచు ఎరవేసి పట్టుకోవడం నావికులకొక క్రీడ
.
పట్టుకుని ఓడ బల్లమీద పడవెయ్యడమే ఆలస్యం
ఇంతటి గగనాధీశులూ, కలవరపడి, లజ్జాకరంగా
పాపం, దీనాతిదీనంగా,విశాలమైన తమతెల్లని రెక్కలని
తెడ్లువేసినట్టు రెండువైపులా ఈడ్చుకుంటూ పోతాయి
.
ఈ రెక్కలరౌతు ఎంతలో నేర్పుతప్పి, బలహీనుడైనాడు!
ఇంత అందగాడూ, క్షణంలో ఎంత సొగసుతప్పి, హాస్యాస్పదుడైనాడు.
తన ముక్కులో పొగాకుగొట్టాన్ని దోపి హింసిస్తున్నాడు ఒకడు
ఇప్పటిదాకా నింగినేలినవాణ్ణి కుంటుతూ గేలిచేసేవాడొకడు
.
తుఫానులతో స్నేహంచేసి, విలుకాడిని సైతం వెక్కిరించగలిగిన
కవి కూడా ఈ మొయిలుయువరాజుకి దీటైనవాడే;
కూతలూకేకల అవహేళనలతో నేలపాలైనకవికి
బ్రహ్మాండమైన అతని రెక్కలే,అతని నడకకి గుదిబండలు
.
ఛార్లెస్ బోద్ లేర్,
(April 9, 1821 – August 31, 1867)
ఫ్రెంచి కవి
