(ఈ కవిత చదువుతుంటే నవ్వుగా అనిపించినా, కవి చూపిన చమత్కారం అందులోనే ఉంది. మనమందరం పశువులమే. మనకి స్వతంత్రేఛ్చకూడా కొన్ని బంధనాలను ఛేదించుకుందికే పరిమితమై ఉంటుంది. అదికూడా కాసేపే. తర్వాత మనం మన బానిసత్వంలోనే అనందాన్ని వెతుక్కుంటాం. అది సమాజం విధించిన కట్టుబాట్లు కావచ్చు, మతం, శాస్త్రం విధించిన కట్టుబాట్లు కావచ్చు, చివరకి విజ్ఞానం ప్రకటించిన పరిమితులు కావచ్చు. కొంతమంది మాత్రమే అన్ని రకాల భావదాస్యాలనుండి విముక్తులై జీవితాంతమూ నిజమైన స్వేఛ్ఛని అనుభవించగలరు.
ఇంత సీను ఉందా ఈ కవితలో అని కొందరికి అనిపించవచ్చు. చతురుడైన కవి తన కవిత తాత్పర్యాన్ని వాచ్యం చెయ్యకుండా, treasure Hunt ఆటలో లా కొన్ని గుర్తులు అక్కడక్కడ ఉంచి వదిలెస్తాడు.
మొట్టమొదటి వాక్యం చూడండి…”కనీసం ఒక్కరోజైనా… పొరబడే అవకాశం ఉంది” అంటే, మనది Token స్వాతంత్రేఛ్ఛ. నిజమైనది కాదు. మన బలహీనతల్లోంచి … మనకు అనిపించినపుడో, పక్కవాడు వెక్కిరించడమో, ఆక్షేపించడమో చేసినపుడో, ఒక్కసారి ఒళ్ళు విదుల్చుకుని కాసేపు మనకీ స్వాతంత్ర్యం ఉన్నట్టు ప్రయత్నిస్తాము.
చివరి వాక్యం చూడండి: “ఆ రెండు కిలో మీటర్ల పరుగునే స్వేఛ్చ అని నెమరువెసుకుంటుంటుంది ఎప్పుడూ”. మన స్వాతంత్ర్యప్రకటనకూడా పదిమందితో కలిసి నినాదాలివ్వడంతొనో, రాస్తారోకోలుచెయ్యడంతొనో, ఇలాంటి వాటితో ముగుస్తుంది. అంతకుమించి ఎక్కువగా ప్రయత్నించం. ప్రయత్నించడానికి మన ఉద్యోగాలూ, మన అవసరాలూ అవకాసాన్నియ్యవు.)