స్నేహగీతం … టాగోర్
గతించిన మధురక్షణాల జ్ఞాపకాలు
ఎన్నడైనా మనస్మృతిపథం వీడగలవా?
స్వయంగా అనుభవించినవి; మన జీవనాడి;
అవి ఎన్నడు మరువగలం?
.
మిత్రమా! ఒక సారి మరలిరా!
వచ్చి నా జీవితాన్ని పంచుకో.
చిరునవ్వులూ, కన్నీళ్ళూకలబోసుకుందాం
అదొక తీపిగురుతుగా మిగుల్చుకుందాం
.
వేకువనే మనిద్దరం కలిసి పూలు కోసేవాళ్ళం
ఇద్దరం గంటలకొద్దీ ఉయ్యాలలూగేవాళ్ళం
వంతులువారీగా ఇద్దరం వేణువూదుకున్నాం
చెట్లనీడన పాటలు పాడుకున్నాం
.
మధ్యలో ఎప్పుడో విడిపోయాం
ఒకరి చిరునామా ఒకరికి తెలియకుండా.
మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా నాకెదురైతే
వింతగా చూడకు… రా! స్నేహాన్ని తిరిగి చిగురించు.
.
టాగోర్
