నేను నీ ప్రక్కన లేనప్పుడు … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నేను నీ ప్రక్కన లేనప్పుడు
ఒంటరినైపోతాను.
నువ్వు తప్ప
నాకు సాంత్వననివ్వగలిగిన
వేరొక వ్యక్తిగాని, వస్తువుగాని లేవు.
.
నువ్వు వీడగానే
ఒక్కసారిగా నాకు నిస్సత్తువ ఆవహిస్తుంది;
నా చుట్టూ చీకటి పేరుకుని
నాకేమీ మిగలదు.
.
నేను చాలా వికల్పాలు ప్రయత్నించేను…
సంగీతం, పర్యాటనా,
ఖగోళ వీక్షణం,
సాగరతీరాన కూర్చోడం…ఇలా…
కానీ ఏ ఒక్కటీ
నీలా నన్ను సేదదీర్చలేకపోయాయి.
.
తుఫానుకి తలవంచిన గడ్డిపరకలా
నా కోరికలజడిలో తడిసిన నా అహం
తలవాల్చింది.
.
ఈ రాత్రి ఇక భరించశక్యము కాదు
ఓహ్, నన్ను నీ దగ్గరకి రానీ
నువ్వుతప్ప
నాకు సాంత్వననివ్వగలిగిన
వేరొక వ్యక్తిగాని, వస్తువుగాని లేవు.
.
సారా టీజ్డేల్.
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి
క్లుప్తంగా చెప్పాలంటే గతశతాబ్దపు అత్యుత్తమ అమెరికను కవయిత్రులలో సారా టీజ్డేల్ ఒకరు. విషాదభరితమైన జీవితం లోంచి, అద్భుతమైన ప్రేమ కవిత్వం రాయగలిగింది ఈమె.
