ద యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ… నెరూడా
(గత కొన్ని సంవత్సరాలుగా మనదేశంలో ప్రతిరోజూ బయటపడుతున్న స్కాముల పరంపర చూస్తుంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలూ, నిర్ణయాధికారంగల అధికారులూ, ఇతర చిల్లర మల్లర ప్రభుత్వోద్యోగులూ పోటీలుపడిమరీ దేశసంపదని కొందరు వ్యక్తులకో, కొన్ని విదేశీసంస్థలకో దఖలుపరచడానికి … ప్రజాభిప్రాయాన్ని తోసిరాజని, అధికారాన్ని తమకు అందజేసిన రాజ్యాంగంమీద చేసిన ప్రమాణాన్ని బేఖాతరుచేసి, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా రాజ్యాంగేతర శక్తులుగా ఎదిగి, న్యాయవ్యవస్థనుకూడా లక్ష్యపెట్టకుండా చేసిన ప్రయత్నాలు పరిశీలిస్తే, గత శతాబ్దపు పూర్వార్థంలో మధ్య అమెరికను దేశాలలోని నియంతృత్వప్రభుత్వాలు ప్రవర్తించిన తీరు నెరూడా ఎలా చిత్రించాడో దానికి అచ్చుగుద్దినట్టు ఉందని ఇంగితజ్ఞానం ఉన్నవారెవరికైనా ఇట్టే అర్థం అయిపోతుంది.
ఆ వైనం ఏమిటో ఒకసారి చిత్తగించండి:)
.
ఇలా సృష్టికి ప్రాభాతభేరీ మ్రోగడమే ఆలశ్యం,
భూమ్మీద సమస్తం మూటగట్టి సిద్ధంచేయబడి ఉన్నాయి
యెహోవా భూమిని ఖండాలుగా విభజించి,
కోకకోలా కంపెనీకి, ఆనకొండలకీ,
ఫోర్డు మోటార్స్ మొదలైనవాటన్నిటికీ పంచేసేడు.
.
యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ మాత్రం
మధ్యఅమెరికాకి నాజూకైన నడుములాంటి
నా నేలమీది అతిసారవంతమైన తీరాన్ని
తనకోసం అట్టేపెట్టుకుంది.
.
దాని సామ్రాజ్యాన్ని “బనానా రిపబ్లిక్స్”
అని ముద్దుగా నామకరణం చేసి
అమరవీరులసమాధుల సాక్షిగా,
స్వేఛ్ఛా, పతాకాలతోపాటు
ఔన్నత్యంకోసం పోరాడే వీరులమీద
పెత్తనం చెలాయిస్తూ
తన వికృతనాటకం ప్రారంభించింది.
.
దేశాల స్వాతంత్ర్యాన్ని రద్దుచేసి
కొందరికి నియంతల కిరీటాలు తగిలించింది
మత్సరాల్ని ఒరలోంచి బయటకు వొదిలి
జలగల్లాంటి నియంతృత్వాలూ,
TrujillO జలగలూ, Tacho జలగలూ
Carias జలగలూ, Martines జలగలూ
Ubico జలగలూ గాక,
సామాన్యంగా రక్తంతాగే జలగలూ,
సమాధులమీద దాడిచేసే తాగుబోతు జలగలూ,
నియంతృత్వంలో బాగా తర్ఫీదుపొందిన
మేధావి జలగలూ,
బఫూన్ జలగల ఆదరణకూడా పొందింది.
.
రక్తపిశాచులైన ఈ జలగలమధ్య
ఫ్రూట్ కంపెనీ తన ఓడలు లంగరువేస్తుంది
కాఫీ, పళ్ళూ దోచుకుపోడానికి.
అప్పుల్లో ములిగిపోయిన మా దేశాల సంపద
కంచాల్లో వడ్డించినట్టు ఓడల్లోకి తరలిపోతుంది.
ఈ మధ్యలో
ఓడరేవుల్లోనిచెరుకు అగడ్తల్లో
దేశీయ ఇండియన్లు పడిపోతుంటారు
తొలిసంజ రాలే పొగమంచు దుప్పటిలో
చుట్టబడి సమాధికై ఎదురుచూస్తూ;
కొన్ని వందల శవాలు,
పేరూ – ఊరూ లేనివి,
రాలిపోయిన అనామకులు,
చెత్తమీదకి విసిరేసిన
కుళ్ళిపోయిన పళ్ళలాంటి వాళ్ళు.
.
పావ్లో నెరూడా
చిలీ కవి
July 12, 1904 – September 23, 1973
(Notes:
Trujillo: Rafael Leonidas Trujillo Molina, 1930 – 1961 వరకు డొమినికన్ రిపబ్లిక్ అధ్యక్షుడు
Tacho: 1936 – 1956 నికరాగువా అధ్యక్షుడైన Anastasio Somoza Garcia మారుపేరు
Carias: Tiburcio Carias Andino, 1933-1946ల మధ్య హోండురాస్ అధ్యక్షుడు
Martinez: Maximiliano Hernandez Martinez, 1931 – 1944 ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు
Ubico: Jorge Ubico y Castaneda, 1931-1944 ల మధ్య గ్వాటిమాలా అధ్యక్షుడు )
