సరోవరం జ్ఞాపకంలో … ఎడ్గార్ ఏలన్ పో, అమెరికను కవి

యౌవనం తొలినాళ్ళలో

ఈ విశాలవిశ్వంలో

అన్నిటికంటే ఇష్టమైన  ప్రశాంతంగా ఉండే జాగా కోసం

వెతుక్కోవడం నాకో అలవాటుగా ఉండేది.

.

చుట్టూ నల్లని రాళ్లతో,

అంబరాన్ని తాకే  పైన్(pine) చెట్లతో

ఈ ప్రకృతిసిధ్ధమైన సరోవరపు ఏకాంతం

ఎంత హాయిగా ఉండేదో చెప్పలేను.

.

కాని, చీకటిపడిన తర్వాత

నిశాసుందరి మనఅందరిమీద కప్పినట్టే

ఈ ప్రదేశం మీద కూడా

తన నల్లని ముసుగుకప్పిన తర్వాత

మార్మికపు పిల్లతెమ్మెర ఏవో రహస్యాలాలపిస్తూ

పక్కనుండి పరిగెత్తుతున్నప్పుడు చూడాలి,

అబ్బ!

ఈ సరోవరపు గభీరత

అప్పుడు తెలిసొస్తుంది నాకు.
.

అలాగని అదేమీ భయపెట్టే  గాంభీర్యం కాదు,

చిరు చలిలో వణికేటి, తొణికిసలాడే ఆనందం…

ఆ అనుభూతి ఎన్ని రత్నరాశులిచ్చినా

చెప్పగలిగేదీ, నిర్వచించగలిగేదీ కాదు,

ప్రేమకూడా కాదు, ప్రేమలాంటిజ్వరమైనా.

తన ఒంటరితనపుటాలోచనల్లో

ఈ నిశాపరివ్యాప్తమైన సరస్సునే

స్వర్గధామంగా ఊహించగల వ్యక్తికి

ఆ విషమ నులితరగల్లో మృత్యువు దాగుంది

ఆ అగాధంలోనే శాశ్వతమైన సమాధిశయ్య కూడా.

.

Carte de Visite of Edgar Allan Poe
Carte de Visite of Edgar Allan Poe (Photo credit: Wikipedia)

ఎడ్గార్ ఏలన్ పో

January 19, 1809 – October 7, 1849

(పో కవితలు కొన్ని చాలా గహనంగా, మార్మికతో అనేకమైన వ్యాఖ్యానాలకు అనువుగా ఉంటాయి. అందులో ఇది ఒకటి. ఇక్కడ చెప్పిన విషయాలన్నీ సరస్సు నేపధ్యానికి సరిగా సరిపోయినా, దీని వెనుక చెప్పదలుచుకున్న అంతరార్థం వేరే ఉందని తెలుస్తుంది. చాలామంది చాలా రకాలుగా చెప్పినా నామట్టుకు  ఇది మనిషిలోని వెదుకులాట గురించి, అందులోనూ తనకేతెలియని ఎదుకులాట. మనిషికికూడా తనకు ఇష్టమైన వ్యక్తిగురించీ, వ్యాపకం గురించీ వెదుకులాడుతుంటాడు. తనకు ఇష్టమైన అనేక వృత్తిప్రవృత్తులో ఏది అత్యంతప్రీతిపాత్రమో తనే నిర్ణయించుకోలేడు ఒకంతట. అందులో కొన్ని(నల్లరాళ్లవంటివి, సేదదీరడానికి)  నిబంధనలు పెట్టుకుంటాడు, ఉదాత్తమైన ఆలోచనలుగాని, ఆశయాలుగాని అందులో భాగమే. అవే Pineచెట్లలా ఆ లక్ష్యంచుట్టూ పరివ్యాప్తమైనవి. ఒకసారి అటువంటి వ్యక్తో, వ్యాపకమో దొరికితే అందులో లీనమైపోవడం లోనే అతనికి ముక్తీ, ఆనందమూ ఉంటాయి. ఏ లక్ష్యం కోసం తను ఇన్నాళ్ళూ తపించేడో అది దొరికినతర్వాత అతని అంతరంగం కలిగించే ప్రేరణే … చిరుగాలి చెవిలో ఊదే మార్మిక గీతాలు. ఇక్కడ మృత్యువు నెగెటివ్ సెన్స్ లో వాడలేదనిపిస్తుంది. ఇక్కడ మృత్యువంటే లీనమవడం, మనం అందరం మృత్యువులో లీనమయినట్టు. సమాధి అన్నది శాశ్వతత్వానికి ప్రతీక.

పో జీవిత విశేషాలకు ఈ క్రింది లింకు చూడండి:

http://en.wikipedia.org/wiki/Edgar_Allan_Poe    )

.

To The Lake

In spring of youth it was my lot
To haunt of the wide world a spot
The which I could not love the less
So lovely was the loneliness
Of a wild lake, with black rock-bound,
And the tall pines that towered around.
But when the Night had thrown her pall
Upon that spot, as upon all,
And the mystic wind went by
Murmuring in melody
Then–ah then I would awake
To the terror of the lone lake.
Yet that terror was not fright,
But a tremulous delight
A feeling not the jewelled mine
Could teach or bribe me to define
Nor Love–although the Love were thine.
Death was in that poisonous wave,
And in its gulf a fitting grave
For him who thence could solace bring
To his lone imagining
Whose solitary soul could make
An Eden of that dim lake

Edgar Allan Poe.

“సరోవరం జ్ఞాపకంలో … ఎడ్గార్ ఏలన్ పో, అమెరికను కవి” కి 2 స్పందనలు

  1. అద్భుతమైన భావన సార్. ఎందుకో నా తొలి ఆలోచనలు గుర్తుకొచ్చాయ్. నిజంగా ఈ రోజు అనువాదము ఎన్ని సార్లు చదివినా చదవాలనిపిస్తోంది..

    మెచ్చుకోండి

  2. సుభగారూ,

    మీ అభిమానపూర్వకమైన వ్యాఖ్యకి ధన్యవాదాలు. కవిత్వంలో మార్మికత ఒక అందమైన ప్రయోగం. అయితే కొందరు దాన్ని ఆధ్యాత్మికచింతనా పరిధిలో చేస్తే, మరికొందరు కేవలం కవిత్వాన్ని గహనం చెయ్యడానికి ఉపయోగిస్తారు. అపురూపమైన జీవితమూ, అనుభవాలూ, వేదనా, పో లాంటి మనిషిని, సారవంతం చెయ్యడమేగాక జీవితాన్ని ఎవరికి వారికి అనుభవమయ్యేరీతిలో తాత్త్విక చింతన బోధిస్తాయి. అందులోంచి ఉత్పన్నమైన కవిత్వం సంద్రంగా, మనసునీ మేధనీ రంజింపజేసేదిగా ఉంటుంది. పో జీవితం ఒక అపూర్వమైన కావ్యం వ్రాయదగ్గ అనుభవాలతో కలగలిసినది. అందుకే అతనికవిత్వం కూడ, చదువుతున్న కొద్దీ బాగుంటుంది. మన అనుభవాలకి అతిసమీపంగా వ్రాయగలగడం లోనే సాహిత్యం తాలూకు గొప్పదనం ఉంది.

    అభివాదములతో

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: