మానవజాతికి చరమశ్లోకం … Edna St Vincent Millay, American
కాలువకి గండిపడింది, కరకట్ట కోసుకుపోయింది
పంటచేలన్నీ ముంపుకిగురై, పశువులుమునకేశాయి
నమ్ముకున్న నేల దూరమై, దొరికింది ప్రమాదకరంగా ఉంది
ఎటుచూసినా వేళ్లతోసహా పెకలింపబడి కొట్టుకొస్తున్నచెట్లూ,
పునాదుల్తో కొట్టుకొస్తున్న ఇళ్ళతో
వరద భీభత్సం తప్ప మరేమీ లేదు
ఇంతకష్టమూ పడి, చివరకి మనిషి
తనజీవితం చావుకంటే భారమని తలచి
తన నీడపై చప్పుడు లేకుండా ఈరోజు రాలిపోవలసిందేనా?
లేదు లేదు. నీటిలో సూర్యుడు అస్తమించినతర్వాత
ఇంకా సంధ్యవెలుగుంటుండగా తోటకి ఆవల
ఒక్క తెడ్డు మీద వాలి ఉన్నప్పుడు చూసాను….
అదిగో నానిపోయిబరువెక్కిన నాగలి,
ఇవిగో తేలుతూకొట్టుకొస్తున్న కలుపుమొక్కలు
ఇంటిచూరుకి అడ్డంగా తలా,
వంకరపోయిన ముఖంతో తీరంవైపు సాగుతున్నాయి.
అయినా, సంచినిండా విత్తనాలుమాత్రం ఉన్నాయి.
.
మిలే
(1892-1950)
ప్రకృతిలో జరిగిన ఒక వైపరీత్యానికి, ఎడ్నా విన్సెంట్ మిలే స్పందన ఇది. ఈ పద్యంలో చివరి పంక్తులు చూడండి… అవి ముంచెత్తుతున్న విషాదం లో కూడా, మనిషిని అనునయించగల ఆశాకిరణాలు. వరద తగ్గిన తర్వాత, నేల మళ్ళీ బాగుచేసుకోవచ్చు, కూలిన చెట్లస్థానంలో, కొత్త చెట్లు వేసుకోవచ్చు, కొట్టుకుపోయిన ఇళ్లస్థానే కొత్త ఇళ్ళు కట్టుకోవచ్చు. జీవితం ఆగిపోదు. ఆగకూడదు కూడా. “Pocket full of seeds” అన్న మాటలు ఆశావాదానికి ప్రతీకలు. భవిష్యత్తుకి పునాదులని సంకేతం.
