కాలేజీ కిటికీ… DH Lawrence
గట్టిగాకాస్తున్న ఎండకి నిద్రలో జోగుతున్న నిమ్మచెట్టు వెలుగులు
వణుకుతున్నట్టు నామీద నుండికదిలి, అలా కాలేజీ గోడ ఎగబాకుతున్నై.
నేలమీద లేత నీలి రంగులో పచ్చిక చాలా బాగుంది
నిశ్చలంగా ఉన్న డెయిజీలగుత్తులు మెత్తగా మనసు హరిస్తున్నాయి.
వీధిలోకి వేలాడుతున్న కొమ్మలకి దూరంగా
హద్దులుగీసి ఉన్న , వేసవి తెలుపులా స్వచ్ఛమైన కాలిబాటమీద
తమనీడలు కాళ్ళకింద పడుతుంటే
ప్రపంచం కుడి ఎడమల నడిచిపోతోంది.
ఎక్కడో దూరంగా, ముష్టివాడి దగ్గు నాకు వినిపిస్తున్నా
వాడికి నాణెం వేస్తున్న అందమైన స్త్రీ వేళ్ళుకనిపిస్తున్నాయి
నేను ఎప్పుడూ చేరదలుచుకోని ఆ ప్రపంచం కంటే
హాయిగా ఉన్నానన్న తృప్తితో, నిశ్చింతగా కూర్చున్నాను.
.
(“కాలేజీ కిటికీ” కవిత నుండి)
DH లారెన్సు
(11 September 1885 – 2 March 1930)
ఇంగ్లీషు నవలాకారుడూ, కవీ, నాటక కర్తా, సాహితీ విమర్శకుడూ, వ్యాసకర్తా, చిత్రకారుడూ .
అతని సమగ్రరచనలు చూసినపుడు, ఆధునికతా, పారిశ్రామికీకరణ మనుషుల్లో మానవత్వాన్ని ఎలారూపుమాపేయో అన్న అతని భావాన్ని ప్రతిఫలిస్తాయి.అతను ఆరోగ్యకరమైన భావావేశాలగురించీ, వాటి జీవచైతన్యం, యాదృఛ్చికతా, స్వాభావికత గురించీ ప్రశ్నిస్తాడు.
అతని అభిప్రాయాలు అతనికి అనేకమందితో శత్రుత్వం కల్పించడమేగాక, ప్రభుత్వమునుండి వేధింపులూ, అభిప్రాయప్రకటనపై నియంత్రణా, అతని సృజనాత్మకతని తప్పుగా వ్యాఖ్యానించడమూ మొదలైనవన్నీ ఎదుర్కొనవలసి వచ్చింది… ముఖ్యంగా జీవితం ద్వితీయార్థంలో. అందుకని తనకుతానుగా విధించుకున్న ఏకాంతవాసంలో గడిపేడు. అతను మరణించేనాటికి ప్రజల్లో అతను తెలివితేటలని వృధాచేసుకున్న ఆశ్లీల రచయితగా ముద్ర ఉండిపోయింది.
అతని సంస్మరణలో EM Forster ఈ అభిప్రాయాన్ని ఖండిస్తూ,”మనతరంలో అత్యంత ఆలోచనాపరుడైన నవలాకారుడతను” అని కితాబు ఇచ్చేడు. కేంబ్రిడ్జికి చెందిన ప్రముఖ విమర్శకుడు F R Leavis కళమీది అతని సత్యనిష్ఠనీ, నైతికవిలువలపై అతని నిజాయితీని వెనకేసుకువచ్చి, ఇంగ్లీషు నవలా సాహిత్యపు ఉన్నత సంప్రదాయవిలువలని అతను ఎలాపొషించేడో చూపిస్తూ, అతని సాహిత్యానికి అందులో సముచితమైన స్థానం కల్పింపజేశాడు. ఇప్పుడు D H లారెన్సుని ఆంగ్లసాహిత్యంలో దార్శనికుడైన మేధావిగా, ఆంగ్లసాహిత్యానికి ప్రతినిథిగా గుర్తిస్తున్నారు.
