అనువాదలహరి

When Rag Pahaadi Went Astray… Samala Sadasiva

(ఈ దేశంలో ఇంగ్లీషువాడు రాకమునుపు, వచ్చి మనల్ని విడదీయకమునుపు, ఈ దేశంమీదకి ఎంతమంది దండెత్తివచ్చినా ఇందులో భాగమై, మమేకమైపోయారు. హిందూముస్లిం సయోధ్య ఒక ఆదర్శమో, ఒక భావనో కాదు. నిజజీవితంలో నేను చూసిన సత్యం. ఓటుబాంకు రాజకీయాలకు అలవాటుపడిన వారికి, సంగీతం, సాహిత్యంతోపాటు, హిందూదేవతలని పూజించిన ముస్లిములూ, ముస్లిం పెద్దల దగ్గరా పిల్లలకి తావీదులు కట్టించుకుని దర్గాల దగ్గరా, మసీదు దగ్గరా ప్రార్థనలూ, మొక్కుబడులూ చెల్లించుకునే హిందువులూ, కలసిమెలసి ఉండేవారన్న విషయం గుర్తుండదు.  కేవలం భాషాభేదం తప్ప(అదికూడ చాలా సందర్భాలలో ప్రాంతీయభాషతో కలిసిపోయి), నిజజీవితంలో అందరూ పాలూ నీళ్లలా కలిసిపోయేరన్న స్పృహకూడ చాలా మందికి లేదు. భారతీయ సంగీతానికీ, భారతీయతకూ, సూఫీ తత్వంద్వారా విశ్వమానవతకు ముస్లింలు చేసిన అపారమైన సేవ కొందరు స్వార్థపరులవల్ల కనుమరుగై, ఎప్పుడూ వాళ్ల మధ్యనున్న విభేదాలే తెరపైకి వస్తూ అవే నిజమని భ్రమింపజేస్తున్నాయి.

సామల సదాశివగారి మలయమారుతాలు పుస్తకం ఈ విషయమై చారిత్రక నేపథ్యంతో, ప్రచారంలో ఉన్న అనేకమైన యదార్థ సంఘటనల ఉదాహణలతో అపురూపంగా సాగింది. అపూర్వమైన పాండిత్యంతో పాటు వాళ్లని అనుకరించ దగిన ఉదాత్తమైన వ్యక్తిత్వాలు కలిగిన ముస్లిములుకూడ ఈ నేలమీద నడిచారు. వాళ్ళు భారతీయతతో మమేకమయ్యారు. కష్టసమయాల్లో హిందువులను ఆదుకున్న ముస్లిములూ, ముస్లిములను ఆదుకున్న హిందువుల కథలూ తెరమీదకీ, ప్రచారం లోకీ రావు, రానీయరు. అటువంటి అపురూపమైన వారసత్వం మనకి ఉందని మననం చేసుకుందికి ఆ పుస్తకంలోని కొన్నివ్యాసాలను అనువాదం చేయ సంకల్పించాను. అందులో మొదటిది ఇది. )

.

When Kishan Singh Chavda was working as Personal Secretary to the Maharaja of Neelamgar, the marriage of the Neelamgar Prince was performed with the Princess of Nepal. The responsibility to invite the best and most reputed singers, dancers, and musicians in the country in a befitting manner, and to convince and take them as part of the entourage fell upon Mr. Chavda.  In that context, he narrated many anecdotes, but they are for some other time. Let me narrate one for the present.  

Festivities went on in Neelamgar for many days after returning from Nepal after consummating the marriage. One day, a concert by the then famous Vocalist Sidhdheswari Devi was arranged in the Palace to entertain the invited Sovereigns and Provincial Rulers. In the room next to the one where the concert was held, arrangements were made for the supply of all kinds of liquors. While the Kings and Maharajahs were supplied liquor at their seats, other aristocrats and courtiers, however, had to visit the adjoining room intermittently for replenishment.

Sidhdheswari had a very deep and profound voice. She commenced the concert with a “cheez” in Rag Jaijaivamti and left her audience in raptures. She then took up another cheez in Rag Pahaadi and commenced her alaap. but she could not concentrate. The notes were going stray before they could fall in place. The singer was embarrassed for her inability to concentrate. She also knew the reason why.

Those days, Ustad Allayuddin Khan was in the service of the Neelamgar Maharaja as Band Master. In the garden not far from the Palace where this concert was going on, he was conducting a “gat” in Rag Tilak Kamod with his band troupe swaying his baton. Tilak Kamod was a powerful Raga. And, Allayuddin Khan was himself directing the “gat” . 

Wafting through the air, the notes of Tilak Kamod reached the Palace concert Hall and were interacting with the notes of Pahaadi taking shape there. The notes of Pahaadi were going astray. Sidhdheswari Devi stopped her concert.  She stood up and requested the Maharaja, “Please permit me to listen to the music that is so disconcerting,” and without waiting for the permission, walked her way into the garden. Few Kings who had good ear for music and in the knowledge of its niceties followed her and stood on the dais where the practice was going on.

But Allayuddin Khan was not here. He lost himself in unswerving concentration and was conducting the Tilak Kamodgat” to the limits of ecstasy. After the diminuendo he put down the baton, and noticed the greatest singer of his times standing with tear-filled eyes beside him. She fell at his feet and wore the dust under his feet on her forehead.  Ustad was perplexed first, and after understanding its import, smiled at her. Without hesitating for a moment Sidhdheswari said, “Ustad! Before your notes of Tilak Kamod, my notes of Pahaadi lost their way. I can’t sing anymore.”  Watching the mien and gestures of the two great artistes, the Kings and onlookers praised and gave them ovation in unison.

Ustad Allayuddin Khan was famous as “Ustadom ke Ustad” (Master of Masters).  The famous Sarod artiste Ustad Ali Akbar Khan was his son. Pandit Ravisankar was not only his student, but was also his son-in-law.  Ustad’s daughter AnnapoornaDevi was Ravisankar’s first wife.  Though Ustad was a muslim, he worshipped Lord Shiva everyday. The inimitable flutist Hariprasad Chaurasia was a student of Annapoorna Devi. 

.

Samala Sadasiva

Image Courtesy: http://1.bp.blogspot.com

Telugu original:

తోవ తప్పిన పహాడీ

కిషన్ సింగ్ చావ్డా నీలంగర్ మహారాజా దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఉన్న కాలంలో నీలంగర్ రాజకుమారుని వివాహం నేపాల్ రాజు కుమార్తెతో జరిగింది. నీలంగర్ నుంచి పెళ్ళివాళ్ళు నేపాల్ వెళ్ళేటప్పుడు దేశంలోని సువిఖ్యాత గాయనీగాయకులను, నర్తకీ నర్తకులను, వాద్యనిపుణులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి, ఒప్పించి, రప్పించే బాధ్యత చావ్డాకు అప్పగించబడింది. ఆ సందర్భంలో అతడు చెప్పిన ముచ్చట్లు అనేకం. అవన్నీ తర్వాత ముచ్చటించుకుందాం. ఇక్కడొక ముచ్చట.

వివాహం సుసంపన్నం చేసుకుని తిరిగివచ్చిన తర్వాత కూడ నీలంగర్ లో చాల రోజులు ఉత్సవాలు జరిగినవి. ఒకనాడు రాజభవనంలో ఆహూతులైన సంస్థానీశుల మనోరంజనం కోసం సిధ్ధేశ్వరీదేవి పాటకచేరీ ఏర్పాటు చేశారు. పాటకచేరీ సాగుతున్న హాలును ఆనుకుని ఉన్న గదిలో రకరకాల మద్యాలు సరఫరాచేసే ఏర్పాటుకూడా చేయబడింది. రాజబంధువులు, రాజోద్యోగులు మధ్య మధ్య వెళ్ళి మద్యపానం చేసి వస్తున్నారు. రాజులకుమాత్రం వాళ్ళు ఆసీనులైనచోటికే పానపాత్రలు అందించటం జరుగుతున్నది.

సిధ్ధేశ్వరీదేవి గాత్రం గంభీరమైంది. జయజయవంతి రాగంలో ఒక “చీజ్” ను వినిపించి శ్రోతలను ఆనందపరవశుల్ని చేసింది. తర్వాత పహాడీ రాగంలోని ఒక “చీజ్” ఆలాపన ప్రారంభించింది. కానీ ఆలాపన కుదరటం లేదు. పహాడీ స్వరాలు కుదురుకోకమునుపే చెదిరిపోతున్నాయి. గాయకురాలు తన అసమర్థతకి గాభరాపడుతున్నది. తన ఆలాపన ఎందుకు సాగటం లేదో ఆమెకు తెలుసు.

అప్పట్లో ఉస్తాద్ అల్లాయుద్దీంఖాన్ నీలంగర్ రాజుకొలువులో బ్యాండ్ మాస్టర్ గా ఉన్నాడు.   రాజభవనానినికి కొంతదూరాన ఉద్యానవనంలో  బ్యాండ్ ట్రూప్ ను చేతిలోని చిన్న కర్రను ఆడిస్తూ తిలక్ కామోద్  “గత్” వాయింపజేస్తున్నాడు. “తిలక్ కామోద్” చాలా శక్తివంతమైన రాగం. పైగా గత్ కు డైరక్షన్ ఇస్తున్నాడు  అల్లాయుద్దీన్ ఖాన్.

తిలక్ కామోద్ స్వరాలు గాలిలో తేలివచ్చి రాజభవనంలో రూపుదిద్దుకుంటున్న పహాడీ స్వరాలను తాకుతున్నాయి. పహాడీ స్వరాలు ఆ తాకిడిని తట్టుకోలేక చెదిరిపోతున్నాయి.  సిధ్ధేశ్వరీ దేవి పాట ఆపేసింది.  లేచినిలబడి “నన్నింతగా అశాంతికి గురిచేస్తున్న ఆ స్వరాలు వినటానికి అనుమతి దయచేయండి” అని, అనుమతికోసం చూడకుండా గబగబా నడిచి  ఉద్యానవనానికి వెళ్ళింది. సంగీత మర్మజ్ఞులైన కొందరు మహారాజులు పానపాత్రలు పట్టుకునే ఆమెవెనకాల వెళ్ళి ఉద్యానవనం దగ్గరి గద్దెమీద నిలుచున్నారు.

అల్లాయుద్దీన్ ఖాన్ మాత్రం ఈ లోకంలో లేడు.  తన ధ్యానంలో తాను తిలక్ కామోద్ గత్ వాయింపజేస్తున్నాడు.  గత్ సమాప్తం కాగానే చేతికర్రను దించి, చెంత అశ్రుసిక్తనయనాలతో నిల్చున్న ఆనాటి  మేటిగాయని సిధ్ధేశ్వరీదేవిని చూచాడు. ఆమె గబుక్కున అతని పాదాలమీద తలవాల్చి పాదరజం నొసటదిద్దుకున్నది. ఉస్తాద్ తొలుత ఆశ్చర్యపడ్డాడు.  తర్వాత అర్థం గ్రహించి మందహాసం చేశాడు.  సిధ్ధేశ్వరికూడా ఏమాత్రం సంకోచం లేకుండా ” ఉస్తాద్! మీ తిలక్ కామోద్ స్వరాల్లో నా పహాడీ త్రోవ తప్పింది.  నే నికపాడలేను” అన్నది.  ఆ ఇరువురి ప్రవర్తనను చూస్తున్న మహారాజులు ముక్త కంఠం తో అభినందించారు.

ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ ను “ఉస్తాదోంకే ఉస్తాద్” అంటారు. సుప్రసిద్ధ సరోద్ విద్వాంసుడు  ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ అతని కొడుకు. పండిట్ రవిశంకర్ అతని శిష్యుడేగాక  అల్లుడుకూడా. ఉస్తాద్ కుమార్తె అన్నపూర్ణాదేవి  రవిశంకర్ మొదటిభార్య.  ఉస్తాద్ ముసల్మానయినా నిత్య శివారాధకుడు. ఫ్లూట్ వాయిద్యం లో అద్వితీయుడైన పండిత్  హరిప్రసాద్ చౌరస్యా అన్నపూర్ణ శిష్యుడు.

తెలుగు మూలం: సామల సదాశివ.

( అనువాదకుడు “మలయమారుతాలు” పుస్తకం లోని సామల సదాశివ గారి అద్భుతమైన ఈ వ్యాసాలని అనువాదం చెయ్యడానికి అనుమతి నిచ్చిన వారసులకు బ్లాగు ముఖంగా కృతజ్ఞతలు   తెలియజేసుకుంటున్నాడు)

%d bloggers like this: