అవతారం… శ్రీజిత్ అరియల్లూర్, Malayali Poet
.
పడావు భూముల్లో
ఆడుకుందికి ఒక్కడూ వెళ్ళిన కుర్రాడు
రక్షణలేని నేలనూతిలోపడి
ములిగిపోయాడు.
ఊరల్లా
ఆ కుర్రాడిగురించి వెది వెదికి
కాళ్లు పుళ్లయిపోయి తిరిగొచ్చింది గాని
ఏమీ లాభం లేకపోయింది.
అహ్! వాడే వస్తాడులే ఏదో ఒక రోజు
ఏ పెద్దూర్లోనో బాగా డబ్బుగడించి
మారుతీ కారులో,
అని ఆశించారంతా.
తర్వాత వర్షాలొచ్చినప్పుడు
ఇళ్ళూ వాకిళ్ళూ, నూతులూ
కుప్పలుతెప్పలుగా నిండిపోయి
వరదైపోయినపుడు
ఆ కుర్రాడు తిరిగొచ్చేడు ఇంటికి
మరు జన్మలో… చేపపిల్లగా.
అయితే అతన్ని ఎవరూ గుర్తుపట్టలా.
వాళ్లమ్మానాన్నా
వాళ్ళ కన్నీళ్ళలాగే
స్వఛ్ఛమైన వాననీటిలో
వాడికి తలతుడిచే తువ్వాలుతోనే
వాడిని పట్టుకున్నారు
వాడి తమ్ముడు ఆడుకుందికి.
అరోజునుండీ గాజుకుప్పెఆక్వేరియంలో
వాళ్ళ తమ్ముడికి
ముద్దులివ్వడానికి ప్రతిరోజూ
ఆ చేపపిల్ల ఎంతో ప్రయత్నిస్తూనే ఉంది.
అయితే ఏం లాభం! వాళ్ళిద్దరివీ ఇప్పుడు
రెండులోకాలవడం వల్ల గాబోలు
పాపం! ఆ పాకిరే కుర్రాడు
వాళ్ళన్నని గుర్తుపట్టలేకున్నాడు.
.
(మలయాళ మూలం: శ్రీజిత్ అరియల్లూర్; English translation: Sri Babu Ramachandran)
- Sreejit Ariyallur
Image Courtesy: https://www.facebook.com/sreejith.ariyallur