గోడ మీది ముఖం… EV Lucas
నిన్న సాయంత్రం డబ్నీ వాళ్లింటిదగ్గర పార్టీలో మేమందరం మాట్లాడుకుంటున్నప్పుడు మా సంభాషణ ప్రకృతిసిధ్ధమైన కారణాలతో మనం సమాధానంచెప్పలేని సంఘటనలపైకి మళ్ళింది. ఒక్కొక్కరూ ఒక్కొక్క అనుభవం చెప్పేరుగాని ఏవీ అంతబాగా రక్తి కట్టలేదు. నాకు అపరిచితుల్లో ఒక పొట్టిమనిషి ఉన్నాడు… కుతూహలమైన చూపులూ అతనూ. ప్రతివాళ్ళనీ వాళ్ళు చెబుతున్నంతసేపూ ఎంతో శ్రద్ధగా విని ఆశక్తిగా గమనించేడు గానీ ఏ వ్యాఖ్యానమూ చెయ్యలేదు. చివరకి, అతన్ని కూడా సంభాషణలో భాగస్వామిని చెయ్యడానికి డబ్నీ అతనివైపు తిరిగి “మీకు మాతో పంచుకుందికి ఏదైనా సంఘటన గాని, కథగాని లేవా?” అని అడిగేడు. ఒక్క క్షణం ఆలోచించి అతను, “ఒకటుంది గాని, నిజానికి మీరందరూ చెప్పిన వాటితో పోలిస్తే దాన్ని సంఘటనగాని, కథగాని అనకూడదేమో. నా మట్టుక్కి నేను, కథకంటే అనుభవం చిత్రంగా ఉంటుందని నమ్ముతాను. అంతే కాదు చాలా కుతూహలం రేకెత్తిస్తుంది కూడా. నేను నాకు స్వయంగా జరిగిన అనుభవం ఒకటి మీకు చెప్పగలను, చిత్రంగా, అది ఇవాళ మధ్యాహ్నమే మాయమయ్యింది కూడా.” అందరం అతన్ని అ సంఘటన ఏమిటో చెప్పమని వేడుకున్నాం.
“ఏడాదో రెండేళ్ళ క్రిందటో,” అతను ప్రారంభించాడు, “నేను Great Ormand Street లో ఒక పాత ఇంటిలో అద్దెకుంటూ ఉండేవాడిని. పడకగది గోడలన్నీ పాత కిరాయిదారు చక్కగ రంగులు వేయించాడు. కాని ఒకచోట మాత్రం గోడలోకి నీళ్ళూ దిగాయో ఏమో గాని తడి తడిగా మరకలు ఉండేవి. మన అందరికీ అనుభవంలోని విషయమే, అలాంటి గోడమీది మరకలు చూస్తున్నకొద్దీ రకరకాల ఆకారాలుగా కనపడటం. అందులో ఒకటి మాత్రం అచ్చం ఒక మనిషి ముఖంలా ఉంది. పక్కమీద పడుక్కుని ఉదయాన్నే లేవడానికి బద్దకంగా ఉన్నప్పుడు దాన్నే గమనిస్తూ, ఆ ముఖాన్ని పోలినవ్యక్తి నాకంటెముందు అద్దెకున్నవాడేమోనని ఊహించుకునేవాణ్ణి. ఇందులో ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మిగతా మరకలు పెద్దవీ చిన్నవీ అవుతూ రూపాలు మారినా, ఈ మరక మాత్రం ఏమీ చెక్కుచెదరకుండా, అలానే ఉంది.”
“అక్కడ నాకు ఇన్ ఫ్లూయెంజా వచ్చి, పక్కమీదే ఎక్కువకాలం గడపవలసి వచ్చింది. పొద్దల్లా చదువుకోవడమో ఆలోచనో తప్ప మరోటి ఉండేది కాదు. అదిగో, సరిగ్గా అలాంటిసమయంలోనే ఈ ముఖం నామీద రాను రాను పట్టుసాధించింది. ఆశ్చర్యంగా, అది రోజు రోజుకీ స్పష్టంగా మనిషిముఖంలా తయారవడం ప్రారంభించింది. ఒక రకంగా చెప్పాలంటే పగలూ రాత్రీ నా ఆలోచనల నిండా అదే. నుదురు కొట్టొచ్చినట్టు కనపడుతూ, ముక్కు అద్భుతంగా వంకీ తిరిగి ఉంటుంది. అది మామూలు ముఖంకాదు. వెయ్యిమందిలో ఒకరికి ఉంటుందేమో అలాంటి ముఖం.
“మొత్తానికి ఎలాగో నాకు ఆరోగ్యం కుదుటపడింది గాని, ఆ ముఖం ఇంకా బుర్రలో తిరుగుతూనే ఉంది. నాకు తెలియకుండానే అలాంటి ముఖం కోసం వెదకడం ప్రారంభించేను. ఎందుకో నాకనిపించింది. అలాంటి మనిషి ఉంటాడు… అతన్ని ఎలాగైనా కలవాలి అని. ఎందుకు అని అడిగితే కారణం చెప్పలేను. మా ఇద్దరికీ కలవడం రాసిపెట్టి ఉందని ఎందుకో గాఢంగా అనిపించింది. అందుకని ప్రజలు ఎక్కువగా గుమిగూడేచోటులన్నీ తిరిగే వాడిని… రాజకీయ సమావేశాలు, ఫుట్ బాల్ పోటీలు, రైల్వే స్టేషన్లు, ఒకటేమిటి ఇది అది అనకుండా అన్నిచోటులూ. కాని ఏం ప్రయోజనం లేకపోయింది. నాకు అప్పటిదాకా తెలీలేదు మనుషుల ముఖాలు ఇంత వైవిధ్యంగా ఉంటాయనీ అయినప్పటికీ అవి తక్కువే ననీ. ఎందుకంటే, మనుషుల ముఖాలు ఏదీ రెండవదానితో పోలనప్పటికీ, వాటిని ఖచ్చితంగా కొన్ని నిర్దుష్టమైన గుంపులు లేదా వర్గాలుగా విభజించవచ్చు.
“ఈ వెతుకులాట నాకో వ్యసనమైపోయింది. మిగతా వన్నీ అశ్రద్ధచెయ్యడం ప్రారంభించేను. చాలా జనసమ్మర్దం ఉండే చోటుల్లో ఊరికే అలా నిలబడి వచ్చేపోయే వాళ్లని చూస్తూ నిలబడే వాడిని. వాళ్ళు నాకు పిచ్చిపట్టిందేమో అనుకునే వాళ్ళు; పోలీసులు నన్ను గుర్తుపట్టి అనుమానించడం ప్రారంభించేరు. అయితే నేనెప్పుడూ ఆడవాళ్ళని గమనించలేదు… మగవాళ్ళు… మగవాళ్ళు… ఎప్పుడూ మగవాళ్ళ ముఖాలలోకే చూసేవాడిని.”
అతను చెబుతూ చెబుతూ అలసిపోయేడేమో, ఒకసారి చేత్తో నొసలూ నుదురూ తుడుచుకున్నాడు. “ఎలాగయితేనేం,” అంటూ మళ్ళీ ప్రారంభించేడు, “చివరకి అతన్ని ఒకసారి చూడగలిగేను. అతను టాక్సీలోతూర్పుకి పికడెల్లీ మీదుగా వెళ్తున్నాడు. ఒక్కసారి అటుతిరిగి టాక్సీ వెనక కాసేపు పరిగెట్టి మరో ఖాళీటాక్సీ దొరకగానే అతని టాక్సీని వెంబడించమని చెప్పి అందులో కూలబడ్డాను. డ్రైవరు వాళ్ళ టాక్సీ మా దృష్టిలోంచి తప్పిపోకుండా తీసుకెళ్ళేడు. మేం ఛేరింగ్ క్రాస్ చేరేము. నేను పరిగెత్తి పరిగెత్తి ప్లాట్ ఫాం మీదకి వెళ్ళేసరికి అతను ఒక చిన్నపిల్ల ఇద్దరు స్త్రీలతో ఉన్నాడు. వాళ్ళు ఫ్రాన్సు వెళుతున్నారు. ఒక్కక్షణం అతనితో ఎలాగైనా మాటకలుపుదామని వేచిఉన్నానుగాని లాభం లేక పోయింది. ఇంతలో మిగతా మిత్రులుకూడ జతకలవడంతో వాళ్లందరూ బృందగా ఏర్పడి ట్రెయిన్ ఎక్కిపోయేరు.
“నేను తొందరగా ఫోక్ స్టోన్ కి ఒక టిక్కెట్టు తీసుకున్నాను, అతను ఓడ ఎక్కేలోగా అతన్ని ఒకమారు ఎలాగైనా కలవగలనన్న ఆశతో; కానీ, అతను నా కంటె ముందుగానే తన స్నేహితులతో ఓడ ఎక్కి తన ప్రైవేట్ కాబిన్ లోకి వెళిపోయేడు. దాన్ని బట్టి అతను బాగా డబ్బున్న వాడని అర్థం అవుతోంది.
“నేను మరోసారి ఓడిపోయేను; కానీ నేను ఈసారి ఎలాగయినా అతన్ని అనుసరించాలని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే, ఒకసారి ఓడ బయలుదేరేక, ఎప్పుడో ఒకప్పుడు ఆడవాళ్ళని వదిలి డెక్ మీదకి కాసేపు సరదాగా తిరగడానికైనా రాకపోడు. నాదగ్గర బొలోన్ వరకు వెళ్ళడానికేగాని తిరిగిరావడానికిడబ్బులు లేవు. కానీ ఇప్పుడు నన్నేదీ ఆపే స్థితిలోలేదు. టిక్కెట్టు కొనుక్కుని అతని కాబిన్ కి ఎదురుగుండా ఎదురుచూస్తూ నిలబడ్డాను. ఒక అరగంట గడిచిన తర్వాత అతను తలుపు తెరుచుకుని బయటకు వచ్చేడు, వెంట చిన్నపిల్లని తీసుకుని. నా గుండె దడదడా కొట్టుకోడం ప్రారంభించింది. ఎక్కడా పొరపాటు లేదు. ఆ ముఖంలో ప్రతి రేఖా నాకు పరిచయమే. అతను నావైపు ఒకసారి చూసి పై డెక్ మీదకి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. “ఇదే చివరి అవకాశం. ఇప్పుడు కాకపోతే మరి అవదు”అని నాకు అనిపించింది.
“క్షమించండి!” నేను మాటలకోసం తడువుకుంటూ, “మీరేమీ అనుకోకపోతే, మీ విజిటింగ్ కార్డ్ నాకొకటి ఇవ్వగలరా?” అని అడిగేను. “అతను కొంచెం ఆశ్చర్యంగా చూసేడు. అలా ఆశ్చర్యపోడంలో తప్పులేదు కూడా. అయితేనేం, అతని కేసులోంచి జాగ్రత్తగా ఒకకార్డు తీసి నాకిచ్చేడు. ఇచ్చి ఆ పిల్లని తీసుకుని గబగబా పై డెక్ మీదకి వెళ్లిపోయేడు. అతను నేను పిచ్చివాడినని అనుకున్నాడని అర్థం అవుతోంది; అంతకంటే ముఖ్యంగా, నన్ను సంతృప్తి పరచడమే మేలని కూడా అనుకుని ఉంటాడని తెలుస్తోంది.”
“కార్డుని చేత్తో గట్టిగా పట్టుకుని దాన్ని చదవడానికి ఓ మూలకి చేరుకున్నాను. నా కళ్ళకు ఒక్క సారి చీకటి కమ్మినట్టయింది. నా తలతిరగడం ప్రారంభించింది; దాని మీద Mr. Ormond Wall అన్న పేరూ, ఏదో పిట్స్ బర్గ్ అడ్రసూ ఉన్నట్టు మాత్రం లీలగా గుర్తుంది. అంతే! నాకు మరేమీ గుర్తులేదు. నేను కళ్లుతెరిచి చూసేసరికి బొలోన్లో ఒక ఆసుపత్రిలో ఉన్నాను. అక్కడే కొన్నివారాల చికిత్స అనంతరం, నెలరోజుల క్రిందటే తిరిగి వచ్చేను.”
అతను ఒక్క సారి మౌనం అయిపోయేడు.
మేం అతన్నొకసారి చూసి, ఒకర్నొకరు చూసుకుని నిరీక్షిస్తున్నాం ఏం చెబుతాడో విందామని. ఈ పొట్టి మనిషి చెప్పిన దానితో పోలిస్తే, సాయంత్రం మా సంభాషణ ఏమీ కాదు.
ఒక నిముషమో రెండునిముషాలో గడిచిన తర్వాత మళ్ళీ ప్రారంభించాడు, “నేను తిరిగి Great Ormond Street కి వెళ్ళిపోయాను. ఈ అమెరికను గురించి ఎంత సమాచారం వీలయితే అంత సంపాదించడానికి ప్రయత్నించేను, నేను పిట్స్ బర్గ్ ఉత్తరాలు రాసేను; అమెరికన్ ఎడిటర్లకి ఉత్తరాలు రాసేను; లండనులోఉన్న అమెరికన్లతో స్నేహంకలిపేను; అంతాచేసి నాకు దొరికిన సమాచారం ఏమిటంటే, అతనొక మిలియనీర్ అనీ, తల్లి దండ్రులు బ్రిటిషుజాతీయులనీ, వాళ్ళు లండనులో నివసించేవారనీ. అంతే! లండనులో ఎక్కడుంటున్నాడన్నదానికి సమాధానం దొరకలేదు.
“అలా కాలం పరిగెత్తుతూనే ఉంది నిన్నటి ఉదయం దాకా. రోజూకంటే బాగా అలసి పడకెక్కడంతో, బాగా పొద్దెక్కీదాకా తెలివిరాలేదు. నాకు తెలివి వచ్చేసరికి గదినిండా సూర్యుడివెలుతురు నిండి ఉంది. అలవాటు ప్రకారం నేను గోడవంక చూసేను ఆ ముఖం ఎలా ఉందో చూద్దామని. ఒక్కసారి తుళ్ళిపడి లేచేను. నమ్మలేక కళ్ళునులుపుకుని చూసేను. ఇప్పుడది లీలగా కనిపిస్తోంది. మొన్నరాత్రి ఎప్పటిలాగే చాలా ఖణీగా కనిపించింది… ఎంతగా అంటే అది నా ఎదురుగా మాటాడుతున్నట్టే ఉంది. ఇప్పుడు దానికి వికృతిలా ఉంది.
నాకేం తోచలేదు. బుర్ర దిమ్ముగా అయిపోయింది. అప్పటికే ఉదయం వార్తాపత్రికలన్నీ వచ్చేసేయి. ప్రముఖవార్త అదే : “అమెరికన్ మిలియనీర్ మోటారు కారు ప్రమాదం”… నిన్న మీరు కూడా అందరూ చదివే ఉంటారు. కొని చదివేను. “పిట్స్ బర్గ్ మిలియనీరు అయిన Mr. Ormond Wall, అతని బృందమూ ఇటలీలో విహారయాత్రచేస్తుండగా ఎదురుగావస్తున్న వాహనం ఢీకొని కారు తలక్రిందులయిపోయింది. అతని పరిస్థితి విషమంగా ఉంది” అదీ సారాంశం.
నేను నా గదికి వెళ్లిపోయి పక్కమీద కూర్చుని గోడమీది ఆ ముఖం వైపే చూస్తూ కూర్చున్నాను. నేను చూస్తుండగానే అది పూర్తిగా మాయమైపోయింది.
తర్వాత నేను తెలుసుకున్నది Mr. Wall నేను ఏ క్షణంలో ఆ ముఖం అదృశ్యం అవడం చూసేనో అదే సమయంలో మరణించేడని.
మరొక్కసారి అతను మౌనంగా అయిపోయేడు.
“అద్భుతం, అపూర్వం…” అన్నా రందరూ. అందరి మనసులోంచి వచ్చిన మాట అది.
“నిజం” అన్నాడు ఆ అపరిచిత వ్యక్తి.
” నా కథలో మూడు అపూర్వమైన, అసాధారణమైన విశేషాలున్నాయి. మొదటిది, ఎక్కడో లండనులో ఒక గదిగోడమీదనున్న మరక అమెరికాలోనున్న ఒక మనిషి ముఖకవళికలకి చాలా దగ్గరపోలికలు కలిగి ఉండడమేగాక, అతని జీవితంతోకూడా ముడిపడి ఉండడం. సైన్సు దానికి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. రెండోది ఒక వ్యక్తి పేరుకీ, అతని కవళికలు కుతూహలం రేకిత్తెంచేటంత ఖచ్చితంగా కనిపిస్తున్న ప్రదేశానికీ సంబంధం ఉండడం. కాదంటారా?
అందరం అతనితో ఏకీభవించేం. మళ్ళీ ప్రకృతికి అతీతంగా అద్భుత సంఘటనల జరగడం గురించిన మా మొదటి ప్రస్తావన ఊపందుకుంది మరింత ఉత్సాహంతో; అంతలో మా అపరిచిత అతిథి లేచాడు గుడ్ నైట్ చెప్పి శలవు తీసుకుందికి. అతను సరిగ్గా వీధిద్వారం చేరే వేళకి ఇంత ఉత్సాహంగా జరుగుతున్న వాదప్రతివాదనలకి మూలమైన విషయాలగురించి ఎవరో ప్రస్తావిస్తూ, అతను వెళ్ళిపోయేలోగానే మూడోది ఏమిటో కనుక్కోవాలని గుర్తుచేశారు. ఒకతను, “మీరు మూడువిషయాలన్నారుగదా,” అని అతన్ని అడిగేడు మూడోది ఏమిటి అని ధ్వనిస్తూ.
“ఓహ్, అదా!” అతను తలుపు తెరుస్తూ అన్నాడు, ” అది మరిచిపోతున్నాను. మూడవ అసాధారణ విషయం ఏమిటంటే, అది నేను అరగంట క్రితమే అప్పటికప్పుడు అల్లిన కట్టుకథ. అందరికీ మరోసారి, గుడ్ నైట్.”
